ఎండల నుంచి రక్షణ ఇలా...

ABN , First Publish Date - 2021-04-11T05:27:51+05:30 IST

మొక్కలు పెరగడానికీ, వాటికి పోషకాలు అందడానికీ ఎండ చాలా ముఖ్యం. అయితే, వేసవిలో నలభై డిగ్రీలు దాటి మండిపోతున్న ఎండలు మొక్కలకు హాని చేస్తాయి. తీవ్రమైన ఎండ వేడికి మొక్కలు వాడిపోతాయి

ఎండల నుంచి రక్షణ ఇలా...

మొక్కలు పెరగడానికీ, వాటికి పోషకాలు అందడానికీ ఎండ చాలా ముఖ్యం. అయితే, వేసవిలో నలభై డిగ్రీలు దాటి మండిపోతున్న ఎండలు మొక్కలకు హాని చేస్తాయి. తీవ్రమైన ఎండ వేడికి మొక్కలు వాడిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరి.


ఆ వేళల్లో వద్దే వద్దు: వేసవి కాలంలో మొక్కలకు ఏ సమయంలో నీరు పెడుతున్నారన్నది ప్రధానం. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో నీరు పెడితే... ఆ నీరు మొక్కల వేర్లకు చేరకుండానే ఆవిరైపోతుంది. కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే సమయంలో... అంటే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ మొక్కలకు నీరు పెట్టకండి. తెల్లవారుజామున, లేదా చీకటి పడిన తరువాత నీరు పొయ్యడం వల్ల వేర్లకు నీరు అందుతుంది. 


పరిమితి తెలుసుకోండి: మొక్కలకు నీరు ఎప్పుడు పెట్టాలనేది ఎంత ముఖ్యమో ఎంత నీరు పెట్టాలనేది కూడా అందే ముఖ్యం. వేసవి కాలం కాబట్టి మొక్కలకు అవసరమైన దానికన్నా ఎక్కువ నీరు పెడితే మట్టిలో తేమ శాతం ఎక్కువవుతుంది. అది కొనసాగితే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. చివరకు ఫంగల్‌ వ్యాధులు తలెత్తవచ్చు. కాబట్టి నీరు ఎంత పెట్టాలనే పరిమితిని తెలుసుకోండి.


నీడ ఏర్పాటు చేయండి: ఎండ వేడి తీవ్రంగా ఉన్నప్పుడు మొక్కలకు పువ్వులు పూయడం తగ్గిపోతుంది. ఆకులు ఎండకు మాడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా పూలు, కూరగాయలు, ఆకుకూరల మొక్కల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజులో వేడిగా ఉండే సమయంలో వాటి మీద ఎండ పడకుండా చూసుకోవాలి. నీడ పడే చోటికి వాటిని మార్చాలి. లేదంటే మొక్కల మీద నీడ ఉండేలా తేలిక పాటి వస్త్రం లేదా ప్లాస్టిక్‌ షీట్ల లాంటివి పైన అమర్చాలి. 


కలుపు తొలగించండి: మొక్కల మధ్య కలుపు పెరగడం సాధారణమే. ప్రత్యేకించి పెరళ్ళలో పెంచే మొక్కలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వాటిని తరచూ తొలగించకపోతే మొక్కల ఎదుగుదల మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది. వేసవిలో ఈ ఇబ్బంది మరీ ఎక్కువవుతుంది. కలుపు మొక్కల వల్ల మీరు పెంచుకుంటున్న మొక్కలు దెబ్బతినకుండా ఉండాలంటే వారానికి ఒకసారి... అది వీలు కాకపోతే కనీసం నెలకు రెండుసార్లయినా కలుపు మొక్కలను తొలగించండి. 


మొదళ్ళను కప్పండి: మొక్కల మొదళ్ళను కప్పి ఉంచితే వేడి నుంచీ, చల్లదనం నుంచీ వాటికి రక్షణ లభిస్తుంది. దీన్ని ‘మల్చింగ్‌’ అంటారు. దీనివల్ల మట్టిలో తేమ నిలిచి ఉంటుంది. మీ తోట మీద అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉన్నట్టయితే, నాలుగు నుంచి ఆరు అంగుళాల పొరను ఏర్పాటు చేయండి. సేంద్రియ పద్ధతుల్లో అయితే ఎండిన ఆకులు, గడ్డి, చెరుకు వ్యర్థాలు, గులకరాళ్ళతో మల్చింగ్‌ చేస్తారు. అలాగే పెద్ద తోటల్లో ప్లాస్టిక్‌ షీట్లతో కూడా మల్చింగ్‌ చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ ద్వారా భూసార పరిరక్షణ, కలుపు నివారణ జరుగుతుంది. నీరు ఆదా అవుతుంది.

Updated Date - 2021-04-11T05:27:51+05:30 IST