ఇంకెంతకాలం ఇలా..?

ABN , First Publish Date - 2021-12-01T06:46:31+05:30 IST

‘చాలీచాలని జీతాలతో పదేళ్లకుపైగా పనిచేస్తూనే ఉన్నాం. ఎన్నికలముందు మాకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నోచుకోవడంలేదు.

ఇంకెంతకాలం ఇలా..?
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

సొసైటీ కార్మికులను క్రమబద్ధీకరించాలి 

కాంట్రాక్టు కార్మికులను కార్పొరేషన్‌లో విలీనం చేయాలి

టీటీడీ ఏడీ భవనం వద్ద కొనసాగుతున్న కార్మికుల దీక్ష 


తిరుపతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘చాలీచాలని జీతాలతో పదేళ్లకుపైగా పనిచేస్తూనే ఉన్నాం. ఎన్నికలముందు మాకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నోచుకోవడంలేదు. ఇంకెంత కాలం ఇలా? ఇక ఓర్చుకునే ఓపికలేదు. పోరాటమే శరణ్యం’ అంటూ టీటీడీ కార్మికులు కదం తొక్కారు. సొసైటీ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కాంట్రాక్టు కార్మికులను  కార్పొరేషన్‌లో విలీనం చేయాలని కోరుతూ శనివారం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. రాత్రిళ్లు సైతం దీక్షలో పాల్గొంటున్నారు. మంగళవారమూ కొనసాగిన దీక్షకు సొసైటీ కార్మికులు తోడవటంతో  పెద్దఎత్తున జనం కనిపించారు. పాలక మండలి పెద్దలు, టీటీడీ ఈవో, ఎమ్మెల్యేలు మాట తప్పి వ్యవహరించారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే మూడు నెలల్లో రెగ్యులర్‌ చేస్తామని ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ ప్రక్రియ చేపట్టలేదన్నారు. టీటీడీ చైర్మన్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించక పోవడం వల్లే  ఈ పరిస్థితి తలెత్తిందని, హైకోర్టు ఆదేశాలను ఈవో అమలు చేయలేదని విమర్శించారు. అధికారులు తమ  హామీలకు కట్టుబడి వ్యవహరించాలని ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు ఎం.నాగార్జున కోరారు. సొసైటీ కార్మికులకు  కార్పొరేషన్‌ అవసరం లేదని సీఎం హామీ మేరకు టైంస్కేల్‌ అమలు చేయాలన్నారు. టీటీడీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో టీటీడీ ఔట్‌సోర్సింగ్‌ నాయకులు హరిప్రసాద్‌, హరికృష్ణ, నవీన్‌వర్మ, అమరనాథ్‌, రూప్‌కుమార్‌, సురేష్‌, టీటీడీ  కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌  నేతలు గోపీనాథ్‌, త్యాగరాజు రెడ్డి,బాలాజీ, మనోహర్‌, రాజేష్‌, కుమార్‌, హరి, దిలీప్‌, శివారెడ్డి, రజనీ, ఏకాంబరం, యశోద, సుభద్ర, రాధా, సుభాషిణి తదిరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాలర్‌ శేషాద్రి మృతికి సంతాపసూచికంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. 


పలు పార్టీల మద్దతు 

టీటీడీ కార్మికుల దీక్షకు వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు పలికారు. కాంట్రాక్టులపై ప్రేమతో కార్మికుల కడుపు కొట్టొద్దని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. ఓట్లకోసం వైసీపీ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక తప్పించుకోవడం సరికాదన్నారు. టీడీపీ నేతలు నరసింహయాదవ్‌, ఆర్సీ మునికృష్ణ, మహేష్‌ యాదవ్‌, రవి నాయుడు, సింధూజ, వినుకొండ సుబ్రమణ్యం, మైనం బాలాజీ, ఆనంద్‌ యాదవ్‌, ఎస్కే శ్రీధర్‌, జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరపున డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌, కిరణ్‌ రాయల్‌, కాంగ్రెస్‌ నుంచి నవీన్‌ కుమార్‌ రెడ్డి దీక్షలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. అవసరమైతే పవన్‌ స్వయంగా ఉద్యమంలో పాల్గొంటారని జనసేన నేతలు తెలిపారు. 

Updated Date - 2021-12-01T06:46:31+05:30 IST