‘లింక్‌’..థింక్‌

ABN , First Publish Date - 2020-08-08T09:58:10+05:30 IST

కృష్ణా జలాల నీటి వాటాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో, దాదాపు 17 లక్షల

‘లింక్‌’..థింక్‌

కేఎల్‌ఐ, పీఆర్‌ఎల్‌ఐ అనుసంధానానికి చర్చలు

కేఎల్‌ఐ డీ-5 కాలువ ద్వారా ఏదుల రిజర్వాయర్‌ నింపేందుకు కసరత్తు

పీఆర్‌ఎల్‌ఐ తొలి దశలో నాలుగు పంపుల ఏర్పాటు

2021 కల్లా కర్వెన రిజర్వాయర్‌ వరకు కృష్ణా జలాలు

స్ట్రక్చర్లన్నీ రెండు టీఎంసీల నీటి పంపింగ్‌కు అనుగుణంగా ఉండాలంటున్న ప్రజాప్రతినిధులు


కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ), పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల (పీఆర్‌ఎల్‌ఐ) అనుసంధానానికి పావులు కదులుతున్నాయి.. పీఆర్‌ఎల్‌ఐకి నిధుల సమస్య ఉత్పన్నమవుతుండటం, పనులు మందకొడిగా సాగుతుండటంతో ఇటీవల ఈ పథకాలను పరిశీలించిన ఇరిగేషన్‌ శాఖ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల బృందం సుదీర్ఘంగా ‘లింక్‌’పై చర్చించింది.. కేఎల్‌ఐ పరిధిలో నాలుగు టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లే ఉండగా, పీఆర్‌ఎల్‌ఐ పరిధిలో ఆరున్నర టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏదుల రిజార్వాయర్‌కు కేఎల్‌ఐ డి-5 కాలువ ద్వారా కృష్ణా జలాలను మళ్లీంచే యోచన చేస్తోంది.. డిజైన్లు, అనుసంధానానికి సంబంధించి నివేదికలు సిద్ధం చేసి, సీఎం కేసీఆర్‌కు అందించాలనే నిర్ణయం చేసినట్లు తెలిసింది..


నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా జలాల నీటి వాటాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో, దాదాపు 17 లక్షల ఎకరాలకు సాగునీరందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐ), కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) అనుసంధానం విషయంలో జోరుగా చర్చ సాగుతోంది. గత శుక్రవారం రాష్ట్ర మంత్రులు, ఇరిగేషన్‌ శాఖ ఉన్నత స్థాయి అధికారులు కేఎల్‌ఐ, పీఆర్‌ఎల్‌ఐ పనులను పరిశీలించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో పథకాలకు సంబంధించిన అనుసంధానం ప్రక్రియపై సాంకేతిక పరమైన అంశాలను సుదీర్ఘంగా చర్చించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. దాదాపు రూ.5 వేల కోట్ల వ్యయంతో కేఎల్‌ఐ ద్వారా 4.25 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో రెగుమాన్‌గడ్డ, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు లిఫ్టులను ఏర్పాటు చేశారు.


వీటి ద్వారా నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 383 చెరువులను, కుంటలను నింపుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ నుంచి 802 అడుగుల స్థాయిలో నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. కేఎల్‌ఐలో 30 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు మోటార్లుండగా కేవలం నాలుగు టీఎంసీలలోపు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మాత్రమే ఉన్న రిజర్వాయర్లున్నాయి. కాలువల ఎత్తు, వెడల్పు 3,200 క్యూసెక్కుల నీటి పంపింగ్‌కు తట్టుకునే విధంగా లేకపోవడంతో ప్రతి సీజన్‌లో మూడుకు మించి పంపులు నీటిని పంపింగ్‌ చేయడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌ఎల్‌ఐని తెరమీదకు తెచ్చింది.


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు వికారాబాద్‌, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి కేఎల్‌ఐ మొదటి లిఫ్టు సమీపంలో నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లను నిర్మించాలని పనులు ప్రారంభించింది. ఇందుకు దాదాపు రూ.65 వేల కోట్లు ఖర్చు కానుండగా, నిధుల సమస్య ఉత్పన్నం కావడంతో అనుసంధానం అంశం తెరమీదకు వచ్చింది. కేఎల్‌ఐ డి-5 కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేసి, ఆరున్నర టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను మళ్లించవచ్చని, రెండు ఎత్తిపోతల పథకాల్లో ఎక్కడ నీటి సమస్య తలెత్తినా సాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని ప్రభుత్వం యోచిస్తోంది.


పీఆర్‌ఎల్‌ఐలో తొలి దశలో నాలుగు మోటార్లే

పీఆర్‌ఎల్‌ఐ తొలి దశలో నాలుగు మోటార్లు బిగించాలని సాగునీటి శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నార్లాపూర్‌ మొదటి లిఫ్టులో ఎనిమిది మోటార్లకు గాను మొదట నాలుగు మోటార్లను బిగించి రోజుకు ఒక టీఎంసీ చొప్పున పంపింగ్‌ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 2021 నాటికి ఈ నాలుగు పంపులు పూర్తి చేసేలా పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా అందిన రుణాన్ని వినియోగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే. పథకం కింద నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల్లోని 70 మండలాల పరిధిలోని 1,226 గ్రామాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. పంపింగ్‌ స్టేషన్లు, సర్టిపూళ్ల డిజైన్లు రెండు టీఎంసీల నీటిని పంపింగ్‌ చేసేలా స్ట్రక్చర్లు నిర్మించాలని మెజార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు నిర్వహించిన సమావేశంలో అనుసంధానం, డిజైన్లకు సంబంధించి నాలుగు ముఖ్యమైన డిజైన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందించాలని నిర్ణయించారు.

Updated Date - 2020-08-08T09:58:10+05:30 IST