మద్య ‘నిషా’ధం

ABN , First Publish Date - 2022-06-28T05:13:32+05:30 IST

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అన్న మాటలకు, రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీకి ఎక్కడా పొంతన కుదరడం లేదు.

మద్య ‘నిషా’ధం

ఖజానాకు మద్యం కిక్కు

దశల వారీ నిషేధంపై వెనుకడుగు 

నియంత్రణకూ నీళ్లొదిలిన పాలకులు

మూడు జిల్లాల్లో ఏరులై పారుతున్న మద్యం

అమ్మకాలను పెంచుకుంటూ పోతున్న వైనం

కిందటేడాది కంటే 10 శాతం పెరిగిన ఆదాయం

 

తాగండి.. తూగండి.. ఖజానా నింపండి.. అన్న తీరుగా ప్రభుత్వం మద్యం పాలసీ అమలు చేస్తోంది. మద్య నిషేధం మాట మరిచిపోయారు.. దశల వారీగా నియంత్రణకు నీళ్లొదిలారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి మద్యాన్ని నిషేధించాలన్న జగన్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మాటమరిచి మడమ తిప్పారు. మద్యం కిక్కుతోనే నవరత్నాలను కొనసాగిస్తున్నామని పాలకులు బహిరంగంగా చెప్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆదాయం కోసం మందుబాబులను పీల్చిపిప్పి చేస్తోంది. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పాలకులు ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఏటికేడు అమ్మకాలు.. ఆదాయం పెంచుకుంటూ పోతున్నారు. భవిష్యత్‌ మద్యం ఆదాయం చూపి మరీ పాలకులు అప్పులు చేస్తున్నారంటే ఇక మద్యం నియంత్రణ కాని, మద్య నిషేధం కాని ఉండదని తెలుస్తోంది. 


మద్యాన్ని నిషేధించాలి. చంద్రబాబు చేస్తోడో లేదో నాకు తెలియదు. బుద్ధున్నోడైతే చేయాలి. రెండేళ్లకో, మూడేళ్లకో మన ప్రభుత్వమైతే వస్తుంది.. మన ప్రభుత్వం వచ్చాక మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం.. అని గట్టిగా చెప్తా ఉన్నా.

- ప్రతిపక్ష నేతగా జగన్‌ 


దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఒకేసారి రెవెన్యూని తీసేయలేని పరిస్థితిలో ఉంటాం. కానీ రెవెన్యూని స్లోగా తగ్గిస్తాం. 2024 ఎన్నికలకు ఓట్లు అడిగే సమయానికి మాత్రం మద్యాన్ని ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు పరిమితం చేస్తా.

-  అధికారం చేపట్టాక జగన్‌  


గుంటూరు, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అన్న మాటలకు, రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీకి ఎక్కడా పొంతన కుదరడం లేదు.  నవరత్నాల్లో భాగంగా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పిన జగన్‌ మాట మార్చి ప్రజలను మద్యం నిషాలో ముంచేస్తున్నారు. 2024 నాటికి మద్యాన్ని సామాన్యులకు అందకుండా చేస్తానన్న జగన్‌ నేడు ఆదాయం కోసం మందుబాబులను పీకల వరకూ తాగించడమే పనిగా పెట్టుకున్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వానికి రోజు గడవాలంటే ఆ ఆదాయమే దిక్కయింది. అందుకే ఏటికేడాది వందల కోట్ల రూపాయల మేర మద్యం అమ్మకాలను పెంచుకుంటూ పోతోంది.  మద్య నిషేధాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. దశల వారీ నిషేధాన్ని పూర్తిగా మర్చిపోయింది. దశలవారీ నిషేధంలో భాగంగా 2019లో 20 శాతం మద్యం షాపులను తగ్గించిన ప్రభుత్వం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 355 షాపులను 20 శాతం తగ్గించి 282కు పరిమితం చేసింది. ఆ మరుసటి ఏడాది 2020లో తగ్గించాల్సిన 20 శాతాన్ని 13 శాతానికి కుదించింది. 2021లో మూడో దశ నిషేధాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం ఒక్క షాపు కూడా మూసేయలేదు. పైపెచ్చు వాక్‌ ఇన్‌స్టోర్ల పేరిట భారీఎత్తున మద్యం మాల్స్‌ ఏర్పాటు చేసింది.  గుంటూరు లిక్కర్‌ డిపో పరిధిలో 81, నరసరావుపేట లిక్కర్‌ డిపో పరిధిలో 87, తెనాలి డిపో పరిధిలో 100 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటితోపాటు కొత్తగా ఏర్పాటైన బాపట్ల జిల్లా చీరాల డివిజన్లోని 55 లిక్కర్‌ షాపులు తోడయ్యాయి. వీటి ద్వారా మూడు జిల్లాల్లో రోజుకు రూ.10 కోట్లకు పైగా అమ్మకాలు సాగుతున్నాయి.


రెండు సార్లు ధరలు తగ్గింపు 

ధరలు పెంచి మందుబాబులను తాగుడుకు దూరం చేస్తామన్న ప్రభుత్వం ఆ మాట మరిచిపోయింది. అమ్మకాలు పెరగడం.. అందుకు ఎక్కువ ధరలే కారణమన్న నివేదికలతో ధరలు తగ్గించింది. రాష్ట్రంలో నాటుసారా, పక్క రాష్ట్ర మద్యం పెరిగిందన్న వంకలతో ప్రభుత్వం వాటిని నియంత్రించడానికి బదులుగా సొంత మద్యం అమ్మకాలను పెంచేందుకు పూనుకుంది. గడిచిన రెండేళ్లలో మద్యం ధరలను 20 శాతం చొప్పున రెండు సార్లు తగ్గించింది. దీంతో మద్యం అమ్మకాలు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి. 


 రెండేళ్లలో 6 వేల కోట్ల కష్టార్జితం ఆవిరి

గత రెండేళ్లలో మద్యం అమ్మకాల ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వం రూ.5,800 కోట్ల ప్రజల కష్టార్జితాన్ని కాజేసింది. 2020 జూన్‌ నుంచి 2021 మే వరకూ రూ.2,413 కోట్ల విలువ చేసే మద్యం అమ్మిన ప్రభుత్వం ఈ ఏడాది అదే కాలానికి 2,685.51 కోట్ల మద్యాన్ని అమ్మింది. ఇది కిందటేడాది కన్నా రూ.272 కోట్లు (11.2 శాతం) అధికం. కిందటేడాదికి ఈ ఏడాదికి విక్రయాల్లో 27 శాతం పెరిగింది.  

 

Updated Date - 2022-06-28T05:13:32+05:30 IST