Advertisement

రోడ్డుపైనే సిట్టింగ్‌..

Apr 20 2021 @ 23:56PM
ఫుట్‌పాత్‌ పైనే మద్యం సేవిస్తున్న మందుబాబులు

వైన్స్‌ సమీపంలో మందుబాబుల జాతర

వారి కోసమే వెలసిన దుకాణాలు

పట్టించుకోని పోలీసులు  

నగరంలోని పలు వైన్స్‌ల సమీపంలో మందుబాబులు రోడ్డుపైనే సిట్టింగ్‌ వేస్తున్నారు. ఆ ప్రాంతాలను బార్లగా మార్చేస్తున్నారు. వైన్స్‌లో మందు కొనుగోలు చేసి.. ఆ పక్కనే కూర్చుని ఎంచక్కా తాగేస్తున్నారు. సమీప బడ్డీకొట్లలో గ్లాసులు, నీళ్లు కొనుగోలు చేసి తమ పని కానిచ్చేస్తున్నారు. రోడ్డుపైనే పుట్‌పాత్‌లపై ఇలా తాగుతున్నా.. కనీసం అడిగే నాథుడు లేకుండా పోయాడు. గుంటూరు శివారు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇలా రోడ్లపైనే తాగుతున్న దృశ్యాలు రోజూ దర్శనమిస్తున్నాయి. 


గుంటూరు(తూర్పు), ఏప్రిల్‌ 20: నగరంలో మందుబాబులు మద్యం తాగేందుకు ఎంచక్కా రోడ్లే బార్లగా మారుతున్నాయి. 

 పొన్నూరు రోడ్డులో ఉన్న ప్రభుత్వ వైన్స్‌ వద్ద మందుబాబుల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. ఏకంగా రోడ్డును, ఈ మధ్మనే నూతనంగా నిర్మించిన ఫుట్‌పాత్‌ను అడ్డాగా చేసుకుని మద్యం సేవిస్తున్నారు. దీంతో  ఈ రోడ్డులో ప్రయాణించాలంటే  వాహనదారులు, పాదచారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పాతగుంటూరు స్టేషన్‌ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇంత జరుగుతున్నా కనీసం పోలీసులు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. అదే విధంగా చిలకలూరిపేట రోడ్డులో వైజంక్షన్‌ దాటిన తర్వాత వైన్స్‌ వద్ద బడ్డీకొట్లనే బార్లుగా చేసుకుని నిత్యం మద్యం తాగుతున్నారు. హైవే పోలీసులు రోజూ ఇటువైపే తిరుగుతున్నా.. పట్టించుకోవడం లేదు. 

జాతరను తలపిస్తున్న వైన్స్‌ ప్రాంతాలు

సాధరణంగా ప్రభుత్వ వైన్స్‌ పరిధిలో సుమారు 100నుండి 200 మీటర్ల పరిధిలో మద్యం సేవించకూడ దు. అలాగే మద్యానికి సంబంధించిన ఎటువంటి దుకాణాలు నిర్వహించకూడదు .కానీ ఈ వైన్స్‌ వద్ద అటువంటి నిబంధనలు పాటించడం లేదు. మందుబాబుల కోసం ఫట్‌ఫాత్‌ను ఆనుకుని పదుల సంఖ్యలో గ్లాసులు, సిగరెట్లు అమ్మే దుకాణాలు వెలిశాయి.  

దుకాణదారుల వద్ద వసూలు

వైన్‌షాపులో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఈ దుకాణాలు వద్ద డబ్బులు తీసుకుని వీటి నిర్వహణకు అనుమతినిచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఎవరైనా అధికారులు తనిఖీలకు వచ్చినపుడు ఉద్యోగులు సదరు దుకాణాదారులకు సమాచారం ఇచ్చి ఆ కాసేపు అక్కడనుంచి ఖాళీ చేయిస్తారని సమాచారం. ఒకో దుకాణం నుంచి రోజుకు రూ.50 నుంచి 100 వరకు సదరు ఉద్యోగులకు సమర్పించాలని దుకాణాదారులే బహిరంగంగా చెప్పడం విశేషం.

పట్టించుకోని పోలీసులు 

నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదు. పాత గుంటూరు స్టేషన్‌ పరిధిలోకి వచ్చే ఈ వైన్స్‌ ప్రాంతంలోకి పోలీసులు కొంతకాలం నుంచి రౌండ్స్‌కు రావడం కూడా మానివేశారు. దీంతో మందుబాబుల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. ప్రయాణికులను తరలించే ఆటోలు, ఇతర వాహనాలపై రాళ్ళు వేయడం వంటి ఘటనలు ఈర ోడ్డులో షరామాములే. ఈ మధ్య కాకాని మండలం గారపాడు వద్ద ఓ హత్య జరిగినప్పటికి పోలీసులు అప్రమత్తం గాకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పలు ఆరోపణలకు తావిస్తోంది.


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.