తాగుడు.. తగ్గకూడదు

ABN , First Publish Date - 2021-11-24T06:08:34+05:30 IST

మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయి.. మందుబాబులు ఎందుకు తాగడంలేదు.. దుకాణాల్లో మద్యం బ్రాండ్‌ల ప్రదర్శన సక్రమంగా లేకనా.. సిబ్బంది సమయానికి దుకాణం తీయనందునా.. పరిశీలించండి. అమ్మకాలు తగ్గకూడదు.. తనిఖీలు చేసి మద్యం అమ్మకాలు పెంచేందుకు చర్యలు చేపట్టిండి.. అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తాగుడు.. తగ్గకూడదు

మద్యం అమ్మకాలపై ఆడిట్‌

49 దుకాణాల్లో తగ్గుతున్న అమ్మకాలు 

తనిఖీల బాధ్యత జిల్లా ఆడిట్‌ అధికారికి 

కారణాలు గుర్తించి జేసీకి నివేదించాలని ఆదేశం

గుంటూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయి.. మందుబాబులు ఎందుకు తాగడంలేదు.. దుకాణాల్లో మద్యం బ్రాండ్‌ల ప్రదర్శన సక్రమంగా లేకనా.. సిబ్బంది సమయానికి దుకాణం తీయనందునా.. పరిశీలించండి. అమ్మకాలు తగ్గకూడదు.. తనిఖీలు చేసి మద్యం అమ్మకాలు పెంచేందుకు చర్యలు చేపట్టిండి.. అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన వైసీపీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేయకుండా అమ్మకం ఎందుకు తగ్గుతోందనే విషయంపై దృష్టి కేంద్రీకరించడంపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమౌతున్నది. సాధారణంగా దుకాణాల్లో మద్యం అమ్మకం తగ్గితే సంతోషించాలి. కాని అందుకు దారి తీస్తోన్న కారణాలపై పర్యవేక్షణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. తనిఖీ బాధ్యతని ఏకంగా జిల్లా ఆడిట్‌ అధికారికి కేటాయించారు. అలానే ఆయన కింద పని చేసే అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్లకు ప్రతీ సోమవారం మద్యం దుకాణాల జాబితాని పంపిస్తామని, వాటి వద్దకు సిబ్బందితో వెళ్లి ఒక చెక్‌లిస్టు పెట్టుకుని తనిఖీ చేసి నివేదికని జాయింట్‌ కలెక్టర్‌కి నివేదించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆడిట్‌ అధికారులు తమ సాధారణ పనులు పక్కన పెట్టి మద్యం దుకాణాల ఇన్‌స్పెక్షన్‌కి వెళ్లక తప్పని పరిస్థితి తలెత్తింది. 

మద్యం అమ్మకాలు తక్కువ ఇక్కడే..

జిల్లాలోని 49 మద్యం దుకాణాల్లో సగటు అమ్మకాలు తగ్గుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సగటు దినసరి అమ్మకం రూ.90 వేల లోపు 25 మద్యం దుకాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిల్లో చెరుకుంపాలెం, బెల్లంకొండ, పల్లికోన, పరసావారిపాలెం, తెనాలి, పిల్లుట్లరోడ్డు, తాళ్లపల్లి, జంగమేశ్వరపురం, నడికుడి, లాంచ్‌స్టేషన్‌, వీపీ సౌత, గుంటూరు - నార్కెడ్‌పల్లిహైవే, దాచేపల్లి, మందాడి, రెంటచింతల, పులిపాడు, మాచర్ల - గుంటూరు రోడ్డు, గుండ్లపల్లి, గామాలపాడు, గురజాల, కుంకలగుంట, దాచేపల్లి, రొంపిచర్ల మెయిన్‌రోడ్డు(2), గురజాలలోని మద్యం దుకాణాల ఆదాయం తక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. అలానే రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల మధ్య దినసరి అమ్మకం ఉన్న కోనూరు, ముట్లూరు, వట్టిచెరుకూరు, దిడుగు, కొండమోడు, బెల్లంకొండ, బోడిపాలెం, బార్తిపాడు, ముత్తాయపాలెం, దావులూరు, గుళ్లపల్లి, చిలుమూరు, కొల్లిపర, మంగళగిరి, సుంగారపురం, మాచవరం, జానపాడురోడ్డు, నడికుడి పంచాయతీ, నకరికల్లు, పిడుగురాళ్ల, వెల్లటూరు, గురజాల(పల్లెగుంట రోడ్డు), బొల్లాపల్లి, మాచర్ల స్టేషన్‌ రోడ్డులోని మద్యం దుకాణాల ఆదాయం కూడా తక్కువగా ఉంటుందని గుర్తించారు. ప్రతీ వారం ఏ మద్యం దుకాణాల ఆదాయం అయితే తక్కువగా ఉంటుందో వాటి జాబితాను అసిస్టెంట్‌ ఆడిటింగ్‌ అధికారులకు పంపించి తనిఖీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 11 గంటల కల్లా రిటైల్‌ అవుట్‌లెట్‌ తెరుస్తాన్నారా, లేదా, సిబ్బంది అంతా హాజరౌతున్నారా, లేదంటే అందుకు కారణాలు, దుకాణ బోర్డు అందరికీ కనిపించేలా పెట్టారా, ఎంఆర్పీ జాబితాని ఏర్పాటు చేశారా, పరిశుభ్రంగా రిటైల్‌ అవుట్‌లెట్‌ ఉందా, నిల్వలు ర్యాక్‌లలో సక్రమంగా పేర్చారా, అన్ని బ్రాండ్‌ల ప్రదర్శన సక్రమంగా ఉందా, చిల్లర్స్‌లో అన్ని బ్రాండ్ల బీర్‌లు పెట్టారా, ఫిజికల్‌ స్టాక్స్‌ సరితూగుతున్నాయా, నగదు లెక్కలు సరిపోతున్నాయా, చెల్లింపులు సక్రమంగా చేస్తున్నారా, ఏవైనా అతిక్రమణలు జరుగుతున్నాయా తదితర అంశాలను తనిఖీకి వచ్చిన సిబ్బంది పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.  అలానే తనిఖీ సమయంలో మద్యం తాగే వారి అభిప్రాయం కూడా సేకరించాలని ఆదేశించారు. తనిఖీ నిర్వహించిన ప్రతీ షాపు ఫొటోలు తీసి పంపించాలన్నారు.  

Updated Date - 2021-11-24T06:08:34+05:30 IST