మద్యం మాఫియా!

ABN , First Publish Date - 2020-12-02T05:16:16+05:30 IST

జిల్లాలో ఓ లిక్కర్‌ డాన్‌ మద్యం మాఫీయాపై ఆధిపత్యం చలాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తు న్నాయి. లిక్కర్‌ వ్యాపారంలో ఆరితేరిన ఆయన ఎక్సైజ్‌ శాఖ అధికా రులను గుప్పిట్లో పెట్టుకొని అడ్డగోలు దందాకు ఎగబడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

మద్యం మాఫియా!

బెల్ట్‌ జోలికి వెళ్లొద్దంటూ లిక్కర్‌ డాన్‌ హెచ్చరికలు

గ్రామాల్లో జోరుగా దేశీదారు, కల్తీ మద్యం అమ్మకాలు

వీడీసీలకు నెల వారీగా వాటాలు

హోల్‌సెల్‌ పేరిట అధిక ధరలకు విక్రయాలు

చోద్యం చూస్తున్న జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు

ఆదిలాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓ లిక్కర్‌ డాన్‌ మద్యం మాఫీయాపై ఆధిపత్యం చలాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తు న్నాయి. లిక్కర్‌ వ్యాపారంలో ఆరితేరిన ఆయన ఎక్సైజ్‌ శాఖ అధికా రులను గుప్పిట్లో పెట్టుకొని అడ్డగోలు దందాకు ఎగబడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తలమడుగు మండలంలోని ఓ బెల్ట్‌షాపులో కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమా చారంతో తనిఖీ చేయడానికి వెళ్లిన అధికారిపై ఆయన ఓ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నెలనెలా మామూ ళ్లు ఇస్తున్నాం కదా.. మళ్లీ తనిఖీలు చేయడం ఏమిటని దబా యించినట్లు తెలిసింది. తనకున్న ఆర్థిక పరపతితో అధికారులను దారికి తెచ్చుకోవడం, మాట వినకుంటే రాజకీయ పలుకుబడితో బదిలీ చేయిస్తానని బెదిరింపులకు గురిచేయడం ఆయనకు అలవాటుగానే మారిందంటున్నారు. జిల్లాలో అధికారికంగా 31 వైన్స్‌ షాపులు, 12 బార్లు మాత్రమే ఉన్నాయి. కానీ జిల్లా వ్యాప్తంగా వందలాది బెల్ట్‌ షాపులు ఎలా నడుస్తున్నాయో ఎక్సైజ్‌ శాఖ అధికారులకే తెలియాలి మరి. అధికారుల అండదండలతోనే అనధికారికంగా మద్యం దందా నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కళ్లముందే బెల్ట్‌ షాపులను నిర్వహిస్తున్నా.. అటువైపు కన్నెత్తి చూడని అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారి రవీందర్‌రాజ్‌ను ఫోన్‌లో వివరణ కొరగా తాను మీటింగ్‌లో ఉన్నానని చెప్పి వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.

బెల్ట్‌ మాటున దేశీదారు..

బెల్ట్‌ షాపుల్లో విక్రయిస్తున్నందంతా అసలైన మద్యం అనుకుంటే ఎక్సైజ్‌ శాఖ అధికారుల భ్రమగానే చెప్పవచ్చు. బెల్ట్‌ మాటున ఛౌకగా దొరికే దేశీదారు మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. బెల్ట్‌షాపుల్లో మద్యాన్ని అమ్ముతున్నట్లు చూపుతునే దేశీదారు మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఎందుకంటే దేశీదారు మద్యం అమ్మకాలతో ఎక్కువ లాభాలు రావడమే అసలు కారణమని చెబుతున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర సరిహద్దు మండ లంలో దేశీదారు మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర మద్యం వైపే బెల్ట్‌ యజమానులు మొగ్గు చూపుతున్నారు. మందుబాబులకు కూడా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ కిక్‌ రావడంతో దేశీదారు మద్యానికి భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది. ఇటీవల జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్న ఎక్సైజ్‌ శాఖ అధికారులు మౌనంగానే ఉండి పోవడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. నేరుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసే వరకు దిక్కులేని పరిస్థితి ఉందంటే ఏ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఉందో తెలుస్తూనే ఉంది. కల్తీ, దేశీదారు, మద్యం విక్రయాలపై ఫిర్యాదు చేస్తే తప్ప ఉన్నతాధికారులు కార్యాలయాలను వదిలి బయటకు రావడం లేదంటున్నారు.

వీడీసీలకు వాటాలు..

బెల్ట్‌షాపుల్లో మద్యం విక్రయాలకు ఎలాంటి ఆటంకాలు కలుగ కుండా వీడీసీలకు నెలనెలా వాటాలతో ఎరవేస్తున్నారు. లిక్కర్‌ డాన్‌ వైన్స్‌ల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభయం ఇవ్వడంతో ఆయన మద్యం దుకాణాల నుంచే బెల్ట్‌షాపులకు మద్యాన్ని తరలిస్తున్నారు. ఒకవేళ కాదు కూడదు అంటే ఎక్సైజ్‌, పోలీసు అధికారులు దాడులు చేసి ముప్పు తిప్పలు పెట్టడం జరుగుతుంది. ఒక్కో బెల్ట్‌షాపుకు నెలకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు వీడీసీలకు చెల్లిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమ దందా సాగుతుందో అర్థమవుతోంది. వాస్తవంగా ప్రభుత్వం నిర్ణయిం చినధరకే మద్యాన్ని విక్రయిస్తే ఇదంతా ఎక్కడ నుంచి చెల్లిస్తున్నారో ఎక్సైజ్‌ అధికారులకే తెలియాలి మరి. 

మందుబాబుల నిలువు దోపిడీ..

వైన్‌ షాపులను దక్కించుకుంటున్న వ్యాపారీ లక్షల్లో పెట్టిన పెట్టు బడులు తిరిగి రాబట్టుకునేందుకు అడ్డదారుల్లో సంపాదనకు ఎగబడు తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో బెల్ట్‌ షాపులను ఏర్పా టు చేస్తూ హోల్‌సెల్‌గా మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తూ మందుల బాబులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అధిక ధరలతో పాటు కల్తీ మద్యాన్ని అంట గడు తూ మందుబాబుల ఒళ్లు గుళ్ల చేస్తున్నారు. భయం కరమైన వ్యాధుల బారిన పడడంతో ఎన్నో కుటుం బాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ శాఖ అధికారులు కళ్లు మూసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2020-12-02T05:16:16+05:30 IST