Advertisement

పైన గడ్డి.. లోపల బుడ్డీ!

Mar 5 2021 @ 23:41PM
స్వాధీనం చేసుకున్న మద్యంతో అధికారులు

ఆర్టీసీ కార్గోలో మద్యం రవాణా

డెకరేషన్‌ గ్రాస్‌ మాటున దిగుమతి

గుట్టురట్టు చేసిన ఎస్‌ఈబీ

198 మద్యం సీసాల స్వాధీనం

డ్రైవర్‌ అరెస్టు, నిందితుల కోసం గాలింపు


నెల్లూరు(క్రైం), మార్చి 5 : రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం ప్రవాహం పోటెత్తుతోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి జిల్లాకు భారీగా మందు దిగుమతి అవుతోంది.  ఓ పక్క ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది, పోలీసులు వరుసగా దాడులు చేస్తూ కేసుల కొద్దీ మద్యాన్ని పట్టుకుంటుండగా మరోపక్క కొత్త మార్గాల్లో లిక్కర్‌ జిల్లాను ముంచెత్తుతోంది. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లోనే మద్యం తరలిస్తుండగా తాజాగా ఆర్టీసీ కార్గో సర్వీసుల్లోనూ మందును దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించి సెబ్‌ అధికారులు నివ్వెరపోతున్నారు. డెకరేషన్‌కు ఉపయోగించే గడ్డి మాటున మద్యం బాట్టిళ్లను రవాణా చేస్తుండటాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆర్టీసీ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి 198 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను శుక్రవారం నెల్లూరు-1 కార్యాలయంలో ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ కే శ్రీలక్ష్మి మీడియాకు వివరించారు.


వీకే ఫ్లోరా అనే సంస్థకు చెందిన అట్టపెట్టల కింది భాగంలో మద్యం సీసాలను అమర్చి పైభాగంలో డెకరేషన్‌ గడ్డిని నింపారు. వెంకటేష్‌ అనే వ్యక్తి రామారావు, అయ్యప్పగుడి, నెల్లూరు పేరుపై కార్గోలో ఈ పార్శిల్‌ను బుక్‌చేశారు. మద్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచిన నేపథ్యంలో నెల్లూరు-1 ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ కుమార్‌ తన సిబ్బందితో కలిసి నగరంలోని అయ్యప్పగుడి సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నెల్లూరు-2 డిపోకు చెందిన బెంగళూరు-నెల్లూరు ఆర్టీసీ బస్సును కూడా తనిఖీ చేశారు. డ్రైవర్‌ నరసింహులు బస్సుదిగి హడావిడిగా వెనక్కి వెళ్లడాన్ని, అప్పటికే అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులకు కార్గో తాలుకు బిల్లు ఇస్తుండటాన్ని  ఎస్‌ఈబీ అధికారులు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ వ్యక్తులు పరారయ్యారు. బస్సు డిక్కీలో వీకే ఫ్లోరా పేరుతో ఆరు అట్టపెట్టెలుండగా వాటిలో డెకరేషన్‌ గడ్డి కింద కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుమారు రూ.2 లక్షల విలువ చేసే 198 లీటర్ల మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. డ్రైవర్‌ను ఎస్‌ఈబీ అధికారులు అదుపులోకి తీసుకుని పరారైన వ్యక్తుల కోసం విచారిస్తున్నారు. నెల్లూరు కార్గో కార్యాలయంలో బుకింగ్‌ తాలుకు బిల్లులను సేకరించి అందులో ఉన్న ఫోన్‌ నెంబర్లకు ఫోన్‌ చేయగా నకిలీ పేర్లతో బుకింగ్‌ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆర్టీసీ డ్రైవర్‌, కార్గో రశీదులపై ఉన్న ఫోను నెంబర్ల కాల్‌ డీటైల్స్‌ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీలక్షి తెలిపారు. పెద్ద ఎత్తున మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఏఈఎస్‌ శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ బీ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ రవీంద్ర, కానిస్టేబుళ్లు అజీజ్‌బాషా, ప్రసాద్‌, రామ నరసయ్య, సిబ్బందిని శ్రీలక్ష్మి అభినందించారు.

 

అక్రమంగా మద్యం తరలిస్తున్న

ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అరెస్ట్‌ 

నెల్లూరు(క్రైం), మార్చి 5: మున్సిపల్‌ ఎన్నికల నేపఽఽథ్యంలో ఎస్‌ఈబీ అధికారులు జిల్లా వ్యాప్తంగా విస్తృత్తంగా తనిఖీలు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వాహన తనిఖీలు చేపట్టారు. వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద ఇందుకూరుపేట ఇన్‌స్పెక్టర్‌ కిశోర్‌, ఎస్‌ఈబీ నెల్లూరు-2 ఇన్‌స్పెక్టర్‌ జీ సూర్యనారాయణ వారి సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఓ బస్సును తనిఖీచేస్తుండగా అందులో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన ఎక్స్‌సర్వీస్‌మెన్‌ రాంబాబు అధికారుల కళ్లుగప్పి తప్పించుకుని వెళుతుండగా పట్టుకున్నారు. అతని వద్ద 100పైపర్స్‌ విస్కీ 8 ఫుల్‌ బాటిళ్లు, బ్లాక్‌డాగ్‌ విస్కీ 4, వాట్‌ 69విస్కీ 2ఫుల్‌ సీసాలు కలిపి 14 బాటిళ్ల డిఫెన్స్‌ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందిని జేడీ శ్రీలక్ష్మి అభినందించారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.