సంపూర్ణ.. మద్యపానం

ABN , First Publish Date - 2022-09-22T05:13:55+05:30 IST

నవరత్నాల్లో ఒక రత్నమైన మద్యనిషేధంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా మాట తప్పారు. దశలవారీ మద్యనిషేధం అని చెప్పిన ముఖ్యమంత్రి దశలవారీగా మాట తప్పుతూ, మడమ తిప్పుతూ వచ్చారు.

సంపూర్ణ.. మద్యపానం

 తాగండి.. ఊగండి

50 రోజుల్లో రూ.450 కోట్ల మద్యం అమ్మకాలు 

మద్యనిషేధంపై మడమ తిప్పిన సర్కార్‌

ఊసే లేని మద్యం షాపుల కుదింపు ప్రక్రియ

బార్లకు మరో రెండేళ్లకు లైసెన్సు జారీ

ఆవిరైపోతున్న రెక్కల కష్టం.. కుదేలవుతున్న కుటుంబాలు


ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాల రికార్డులు బద్ధలవుతున్నాయి. మూడు జిల్లాలో ప్రతి నెలా రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు అలవోకగా సాగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో రోజుకు రూ.8 కోట్ల మద్యం విక్రయించాలని ప్రభుత్వం టార్గెట్‌ నిర్ణయించగా దానికి మించి రూ.10 కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. మందుబాబులు మద్యం మత్తులో జోగుతుంటే కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన మద్యనిషేదం.. నీటిమీద రాతగా మిగిలిపోయింది. 

 


గుంటూరు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నవరత్నాల్లో ఒక రత్నమైన మద్యనిషేధంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా మాట తప్పారు. దశలవారీ మద్యనిషేధం అని చెప్పిన ముఖ్యమంత్రి దశలవారీగా మాట తప్పుతూ, మడమ తిప్పుతూ వచ్చారు. ఫలితంగా మద్య నిషేధం కాస్తా.. మద్య నిషా..దంగా మారిపోయింది. మూడు జిల్లాల్లో ఇక్కడ, అక్కడ అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. మందుబాబులు మద్యం మత్తులో జోగుతుంటే కుటుంబాలకు కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మద్యం అమ్మకాల్లో ఏరోజుకారోజు రికార్డులు బద్దలవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే చెప్పవచ్చు. 


మద్యం షాపులు తగ్గలే.. బార్లు ఆగలే!

మద్యనిషేధంలో భాగంగా ప్రభుత్వం మద్యంషాపులను ఏటా 20 శాతం తగ్గిస్తానని ప్రకటించింది. ఐదే ఏటికి వచ్చేసరికి మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తానని చెప్పింది. ప్రస్తుతం అలాంటిది ఏదీ జరగడం లేదు. తొలి రెండు సంవత్సరాల్లో ఆర్భాటంగా షాపులు తగ్గించిన ప్రభుత్వం, తగ్గించిన షాపుల్లోనే రెట్టింపు అమ్మకాలు సాగించింది. మూడో ఏడాది మాత్రం షాపుల తగ్గింపు ప్రస్తావన కూడా వినిపించడం లేదు. దీనికి తోడు ఈ ఏడాది బార్లకు మరో రెండేళ్లపాటు లైసెన్సులిచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు లిక్కర్‌ డిపోలు ఉన్నాయి. గుంటూరు డిపో పరిధిలో 87, పల్నాడు డిపో పరిధిలో 81, తెనాలి డిపో పరిధిలో 110 ఉన్నాయి. వీటికి తోడుగా చీరాల డివిజన్‌ పరిధిలో ఉన్న మరో 55 షాపులు బాపట్ల జిల్లాలో భాగమయ్యాయి. ప్రస్తుతం మూడు జిల్లాల్లో 333 మద్యం దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో 70 బార్లు ఉండగా, వాటికి వచ్చే రెండేళ్లకుగానూ కిందటి నెల కొత్తగా లైసెన్సులు జారీ చేశారు. దీంతో మరో రెండేళ్లపాటు బార్లు తగ్గించే యోచనే లేదని తేలిపోయింది. వీటికి తోడు జిల్లాలో ఎక్కడంటే అక్కడ అనధికార బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలంలో 25 నుంచి 35 వరకూ అనధికార బెల్టు షాపులున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.  


 మూడు జిల్లాల్లో నెలకు రూ.300 కోట్ల అమ్మకాలు

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మద్యం అమ్మకాల రికార్డులు బద్ధలవుతున్నాయి. ఈ మూడు జిల్లాలో ప్రతి నెలా రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు అలవోకగా సాగిపోతున్నాయి. జిల్లాలో రోజుకు రూ.8 కోట్ల మద్యం విక్రయించాలని గతంలో ప్రభుత్వం టార్గెట్లు నిర్ణయించింది. ఇప్పుడు ఆ టార్గెట్లను మించి అమ్మకాలు సాగుతున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబరు 18 వరకూ జిల్లా పరిధిలో అక్షరాలా రూ.450 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గుంటూరు-1 డిపో పరిధిలో రూ.126.56 కోట్లు, గుంటూరు-2 డిపో పరిధిలో రూ.118.15 కోట్లు, గుంటూరు-3 డిపో పరిధిలో 106 కోట్లు, చీరాల డివిజన్‌ పరిధిలో రూ.100.8 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇవి కిందటేడాది అమ్మకాల కంటే రూ.50 కోట్లు అదనం. ఐదేళ్ల క్రితం, గత ప్రభుత్వ పాలనలో మద్యం రోజువారీ అమ్మకాలు రూ.3 కోట్లను మించేది కాదు. అలాంటిది ఇప్పుడు ప్రతి రోజూ రూ.10 కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. 


పేదల కష్టం మద్యంపాలు..

మద్యం అమ్మకాల ద్వారా వందల కోట్ల రూపాయల ప్రజల రెక్కల కష్టాన్ని ప్రభుత్వం కొల్లగొడుతోంది. రోజూ రూ.10 కోట్ల మేర ప్రజల రెక్కల కష్టం ఆవిరైపోతోంది. గతంలో ఇది రూ.3 కోట్లకు మించి ఉండదు. అలాంటి ఇప్పుడు మద్యంపై ఖర్చు మూడు రెట్లు పెరిగింది. ఈ కారణంగా అణగారిన వర్గాల కష్టజీవుల కష్టార్జితం ఒక్క రూపాయి కూడా ఇంటికి చేరని దారుణమైన పరిస్థితి నెలకొంది. నాణ్యమైన లిక్కర్‌ కాకపోవడంతో చాలామంది అనారోగ్యాలపాలై ఆసుపత్రులకు వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫలితంగా కుటుంబాలకు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకపోతున్నాయి. అప్పులపాలై అన్ని విధాలా కుదేలైపోతున్నాయి. 

Updated Date - 2022-09-22T05:13:55+05:30 IST