పడిపోయిన మద్యం అమ్మకాలు

ABN , First Publish Date - 2021-04-23T11:05:26+05:30 IST

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఓవైపు కరోనా మరోవైపు నాటుసారా ప్రవాహం.. మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గతం వారం రోజులుగా

పడిపోయిన మద్యం అమ్మకాలు

రోజుకు రూ.పది కోట్ల మేరకు తగ్గుదల

కరోనా, నాటుసారా ప్రభావమే కారణం

అమ్మకాలు పెంచేందుకు అధికారుల ప్రయత్నాలు


అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఓవైపు కరోనా మరోవైపు నాటుసారా ప్రవాహం.. మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గతం వారం రోజులుగా రాష్ట్రంలో అమ్మకాలు సగటున పది కోట్ల మేర పడిపోయాయి. రాష్ట్రంలో బార్లు కాకుండా షాపుల్లో రోజుకు సగటున రూ.60 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. ఈనెల 14న రూ.54 కోట్లు, 15న 51, 16న 46, 17న 47, 18న 67, 19న 50, 20న 53కోట్ల మద్యం షాపుల్లో అమ్మారు. ఇవి కాకుండా బార్లలో రోజుకు సుమారు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మందుబాబులు షాపులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. మరోవైపు నాటుసారా తీవ్రంగా పెరిగిపోయింది. రాష్ట్రంలో మంచి బ్రాండ్లు దొరక్కపోవడం, ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు నాటుసారావైపు మొగ్గుతున్నారు.


ఇటీవల నాటుసారా ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. వేల లీటర్ల సారాను అక్రమార్కులు ఉత్పత్తి చేస్తుండగా.. అందులో 20 నుంచి 30శాతం మాత్రమే ఎస్‌ఈబీ కంటపడుతోంది. మిగిలినచోట్ల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ, మారుమూల ప్రాంతాలో సారా ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోంది. మరోవైపు తెలంగాణ మద్యం కూడా రాష్ట్రంలోకి భారీగానే వస్తోంది. ఈ పరిణామాలన్నీ మద్యం అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి.


అమ్మకాలు పెంచే ప్రయత్నాలు

అమ్మకాలు తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపుతుండటంతో అమ్మకాలు పెంచాలని అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. ఎక్సైజ్‌ ఉన్నతస్థాయి నుంచి ఎలాంటి ఆదేశాలు అందకపోయినా క్షేత్రస్థాయిలో యంత్రాంగం అమ్మకాలు పెంచాలని ఒత్తిడి చేస్తోంది. అమ్మకాల తగ్గుదలపై ఇటీవల గుంటూరు జిల్లాలో అధికారులు సమీక్ష నిర్వహించారు. షాపులకు వెళ్లి అమ్మకాలు ఎందుకు తగ్గాయో ఆరా తీశారు. అవసరమైతే ఐదు సీసాలైనా ఇవ్వాలని, అమ్మకాలు పెంచాలని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు వేసవి కావడంతో బీరు అమ్మకాలు పెంచాలని ఎక్సైజ్‌ శాఖ ప్రయత్నిస్తోంది. బీరు అయితే అమ్మకాల విలువ అధికంగా ఉంటుందని ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.


లిక్కర్‌తో పోలిస్తే బీరు వినియోగం ఎక్కువగా ఉంటుంది. సగటున ఒక వ్యక్తి లిక్కర్‌ ఒక క్వార్టర్‌ తాగితే, బీరు అయితే రెండు మూడు తాగుతారు. ఒక క్వార్టర్‌ లిక్కర్‌ సగటున రూ.250 ఉంటే, బీరు సీసా రూ.220పైన ఉంది. వినియోగదారులు బీరు తాగితేనే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందని భావించి, వాటి అమ్మకాలు పెంచే ప్రయత్నాలను అధికారులు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా షాపుల్లో బీర్లకు కూలింగ్‌ ఉండాలని సేల్స్‌మెన్‌కు సూచిస్తున్నారు.

Updated Date - 2021-04-23T11:05:26+05:30 IST