కిక్కే..కిక్కు

ABN , First Publish Date - 2022-09-28T05:49:18+05:30 IST

కిక్కే..కిక్కు

కిక్కే..కిక్కు

దసరా కోసం వైన్‌షాపుల్లో సిద్ధమవుతున్న మద్యం

గతేడాది నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల ఎక్సైజ్‌ పరిధిలో రూ.30 కోట్ల వ్యాపారం

ఈసారి పెరిగిన ధరలతో మందుబాబుల జేబులకు చిల్లు.. 

బెల్ట్‌షాపు కల్తీ మద్యంతో ఆందోళన

బార్‌లో నిబంధనలు గాలికి..

మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ శాఖ 


నర్సంపేట టౌన్‌, సెప్టెంబరు 27 : ప్రజలు అంరంగ వైభవంగా జరుపుకునే దసరా పండుగలో సుక్క, ముక్క తప్పనిసరి. జిల్లాలో ఏటా  కోట్ల రూపాయల మద్యం వికయ్రాలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా దసరాకు మద్యం విక్రయాల జోరుగాసాగుతాయని మద్యం వ్యాపారులు, ఎక్జైజ్‌ అధికారులు పేర్కొంటున్నారు. వచ్చేనెల 5న జరగనున్న దసరా పండుగకు మరో తొమ్మిది రోజులుండగానే మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున మద్యం స్టాక్‌ను దింపేందుకు ఎక్సైజ్‌ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల ఎక్సైజ్‌ స్టేషన్‌ల పరిధిలో తొమ్మిది బార్లు, 57 మద్యం షాపులతో పాటు వందలాది బెల్టుషాపులున్నాయి. 


నర్సంపేటలోనే గతేడాది రూ.12కోట్ల వ్యాపారం..

గత ఏడాది దసరా పండుగ జరుపుకున్న నెలలో ఒక్క నర్సంపేట ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో రూ. 12.17కోట్లు, వర్ధన్నపేట, పరకాల ఎక్సైజ్‌ స్టేషన్‌ల పరిధిలో సుమారు రూ.18.27కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఒకట్రెండు రోజుల్లో మద్యం షాపులు, బార్‌లకు నూతన స్టాక్‌ రానుంది. మద్యం షాపులతోపాటు బెల్ట్‌ షాపులు సైతం భారీగా మద్యం డంప్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.


ఇష్టారాజ్యంగా బెల్ట్‌ షాపులు..

మద్యం మాఫియా ఇప్పటికే పలు చోట్ల మద్యాన్ని కల్తీ చేస్తూ విక్రయాలు జరుపుతూ ఆరోగ్యంతోపాటు, మందుబాబుల జేబులకు చిల్లుపెడుతోంది. ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండల కేంద్రంలో మద్యం బాటిళ్లలో కల్తీ చేయడాన్ని విజిలెన్స్‌ అధికారులు గుర్తించి షాపును సీజ్‌ చేశారు. ఇంకా జిల్లాలో ఇలాంటి మద్యం కల్తీ చేసే షాపులు చాలానే ఉన్నట్లు సమాచారం. బెల్ట్‌షాపు నిర్వాహకులు ఎమ్మార్పీకి రెండితలు వసూలు చేస్తున్నారు. వచ్చేది దసరా పండుగ కావడంతో అత్యధికంగా అమ్మకాలు జరిగే అవకాశం ఉండడంతో కల్తీ మాఫియా పేట్రేగిపోయే ప్రమాదముందని, సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 


బార్‌లో నిబంధనలు గాలికి..

జిల్లాలోని బార్‌లలో ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. బెల్టు షాపులకంటే అధ్వానంగా బార్‌షాపులను నిర్వహించడంతో మందుబాబులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేటలోని బార్‌లలో కనీస వసతులైన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో  బార్‌లో అడుగుపెడితే కంపుకొడుతున్నాయని మద్యంప్రియులు వాపోతున్నారు. పలు బార్లలో నకిలీ మద్యం విక్రయించినా, అధిక ధరలు వసూలు చేసినా ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 


అడ్డుగోలుగా పెరిగిన మద్యం ధరలు 

అడ్డగోలుగా మద్యం రేట్లను ప్రభుత్వం పెంచడంతో తాగకుండానే మద్యం ప్రియులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం గత ఏడాది  కంటే ఈ ఏడాది 25శాతం ధరలను పెంచినట్లు అబ్కారి శాఖ తెలిపినప్పటికీ అది ఓసీ, ఐబీ, రాయల్‌ స్టాగ్‌ వంటి బ్రాండ్లకే పరిమితమైందని మందుబాబులు పేర్కొంటున్నారు. రాయల్‌చాలెంజ్‌, బ్లెండర్‌స్ర్పైడ్‌ తదితర క్లాస్‌ బ్రాండెడ్‌ల మద్యానికి 30 నుంచి శాతం పెంచడంతో ఇప్పటికే మద్యం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు.  గత ఏడాది బీరుకు రూ. 130 ఉండగా పెరిగిన ధరలతో ప్రస్తుతం రూ.150 విక్రయిస్తున్నారు. విస్కీ, బ్రాండీ ఫుల్‌ బాటిల్‌కు ఒక్కో బ్రాండ్‌కు రూ.80 నుంచి రూ.220 వరకు పెంచారు. దీంతో పెరిగిన ధరల వల్ల మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పడుతుండగా మరోవైపు ప్రభుత్వానికి, మద్యం వ్యాపారులకు  లాభాలు చేకురుస్తున్నాయి.

Updated Date - 2022-09-28T05:49:18+05:30 IST