ఏ దేశంలో ఎంతెంత మంది..? కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి లెక్కలివీ..!

ABN , First Publish Date - 2021-05-31T21:42:24+05:30 IST

మనదేశంతోపాటు బ్రెజిల్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది

ఏ దేశంలో ఎంతెంత మంది..? కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి లెక్కలివీ..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మనదేశంతోపాటు బ్రెజిల్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. సెకండ్ వేవ్‌లో సంభవించిన మరణాల కారణంగా ఈ జాబితాలో భారత్  స్థానం పైపైకి పోతోంది. బ్రెజిల్ పరిస్థితి కూడా అంతే. తాజాగా ఈ దేశంలో కూడా ప్రతిరోజూ వేలల్లో కరోనా మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటి వరకూ అత్యథిక కరోనా మరణాలు సంభవించిన దేశాలు ఏంటో ఒకసారి చూద్దామా?


1. అమెరికా

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి ఎంతటి విలయాన్ని సృష్టించిందో తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో కనిపిస్తున్న భయానక దృశ్యాలన్నీ అమెరికాలో గతేడాదే కనిపించాయి. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌తో దూసుకుపోతున్న అమెరికాలో ఇప్పటికీ కరోనా కేసులు బాగానే వెలుగు చూస్తూనే ఉన్నాయి. గతంలో ట్రంప్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అమెరికాలో కరోనా ఇంతలా విజృంభించిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ దేశం కరోనా విషపు కోరల నుంచి వేగంగా బయట పడుతోంది. ప్రతిరోజూ లక్షల కేసులు చూసిన ఈ దేశంలో తాజాగా శనివారం నాడు కొత్తగా 11,651 కరోనా కేసులు, 336 కరోనా మరణాలు మాత్రమే నమోదయ్యాయి. మొత్తమ్మీద అమెరికాలో ఇప్పటి వరకూ 3,40,43,068 కరోనా కేసులు నమోదయ్యాయి. 6,09,544 మంది కరోనా కాటుకు బలయ్యారు. 


2. బ్రెజిల్

అగ్రరాజ్యానికి పొరుగుదేశమైన బ్రెజిల్ కూడా కరోనా మహమ్మారి ధాటికి గజగజలాడుతోంది. ఈ దేశాధ్యక్షుడు జైర్ బొల్సనారో నిర్లక్ష్యం, మొండి వైఖరి వల్లే బ్రెజిల్‌లో కరోనా ఇంతలా వ్యాపించిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ఆయన మాస్కు పెట్టుకోవడానికి నిరాకరించారు. దేశాధ్యక్షుడు అయ్యుండీ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను వ్యతిరేకించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం జరగదని చెప్పి, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించారు. ఆయనకే కరోనా వచ్చినా కూడా తన మొండి వైఖరి మాత్రం మార్చుకోలేదు. అందుకే కాబోలు అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం మరోసారి కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం 11,40,284 యాక్టివ్ కేసులున్న బ్రెజిల్లో ఇప్పటి  వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,65,15,120. అలాగే మొత్తం సంభవించిన మరణాలు 4,62,092.


3. భారతదేశం

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా అల్లాడుతున్న భారత్‌లో కూడా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్కరోజులోనే భారత్‌లో 1,74,041 కరోనా కేసులు, 3,614 మరణాలు వెలుగు చూశాయి. దేశంలో కరోనాను నియంత్రించడం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ జరుగుతోంది. అయినా సరే భారత్‌లో వెలుగు చూసిన డబుల్ మ్యూటెంట్ వైరస్ మాత్రం చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీనికితోడు తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటి వరకూ భారత్‌లో మొత్తం 2,80,47,534 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 2,56,92,342 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 20,26,065. మొత్తం నమోదైన కరోనా మరణాలు 3,29,127.


4. మెక్సికో

కరోనా కారణంగా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న మరో అమెరికా పొరుగు దేశం మెక్సికో. ఇక్కడ తాజాగా 3,052 కరోనా కేసులు, 411 మరణాలు సంభవించాయి. మొత్తమ్మీద 24,12,810 కరోనా కేసులు నమోదవగా.. 2,23,507 మంది ప్రాణాలు కోల్పోయారు. 19,26,287 మంది కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,63,016.


5. ఇంగ్లండ్

ఐరోపా ఖండంలో కరోనా దెబ్బ గట్టిగా తిన్న దేశం ఇంగ్లండ్. ఇక్కడ మొత్తం 44,84,056 కరోనా కేసులు నమోదయ్యయి. 1,27,781 మంది మృత్యువాత పడ్డారు. 42,87,708 మంది కోలుకన్నారు.


6. ఇటలీ

ఇటలీలో కరోనా ఎంతటి విలయాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక్కడ మొత్తం 42,16,003 కరోనా కేసులు నమోదవగా.. 1,26,046 మంది మరణించారు. 38,51,661 మంది కోలుకున్నారు.


7. రష్యా

ఆసియాలో భారత్ తర్వాత కరోనాతో అంతగా అల్లాడిన దేశం రష్యానే. ఇక్కడ మొత్తం 50,71,917 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,21,501 మంది కన్నుమూశారు. 46,84,585 మంది కోలుకున్నారు.


8. ఫ్రాన్స్

కరోనా బారిన పడి అల్లాడిన మరో యూరప్ దేశం ఫ్రాన్స్. ఇక్కడ మొత్తమ్మీద 56,66,113 కరోనా కేసులు, 1,09,402 కరోనా మరణాలు నమోదయ్యాయి. 53,15,150 మంది ఈ మహమ్మారితో పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు.


9. జర్మనీ

జర్మనీలో కూడా కరోనా తీవ్రత బాగానే కనిపించింది. ఇక్కడ మొత్తం 36,87,715 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 89,051 మంది మరణించారు. 34,86,700 మంది కోలుకున్నారు.


10. కొలంబియా

కరోనా తీవ్రత అధికంగా ఉన్న మరో అమెరికా దేశం. దక్షిణ అమెరికాలోని కొలంబియాలో మొత్తం 33,83,279 కరోనా కేసులు, 88,282 కరోనా మరణాలు రికార్డయ్యాయి. మొత్తమ్మీద 31,53,961 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Updated Date - 2021-05-31T21:42:24+05:30 IST