ఇవన్నీ పచ్చి అబద్దాలే.. అసలే ప్రజలంతా కరోనా భయంతో ఉంటే నెట్టింట ఈ నీచాలేంటి..?

May 7 2021 @ 15:59PM

(ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం):  దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. రోజువారీగా సగటున నాలుగు లక్షల వరకు కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ వైద్యాధికారులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు ఈ కరోనా సెకండ్ వేవ్‌కు ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు. ‘కరోనా సెకండ్ వేవ్ గురించి మార్చి నెలలోనే మేం కేంద్రానికి నివేదిక పంపాం. కరోనా కొత్త వేరియంట్ల గురించి చెప్పాం. కరోనా వల్ల వేలల్లోనూ, లక్షల్లోనూ మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించాం. అయినా కేంద్రం అలక్ష్యం వహించింది. ఎన్నికల సభలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుంభమేళాకు ఓకే చెప్పింది. ప్రజలు భారీ సమూహాలుగా ఏర్పడి సూపర్ స్ప్రెడర్లుగా మారారు.’ అంటూ సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో పేర్కొర్నారంటే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవబోతున్నాయో తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ఇంతటి ఘోర పరిస్థితులు ఉంటే ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి.. కొందరు వ్యక్తులు కావాలనే నెట్టింట అబద్ధపు ప్రచారాలను వండి వార్చుతున్నారు. జరిగిన విషయం ఒకటయితే దానికి మసాలాలు జల్లి మరింత అందంగా కూర్చి నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే కరోనా భయంతో గడుపుతున్న సామాన్యులు ఆ వార్తలను చూసి మరింతగా వణికిపోతున్నారు. ఆ తరహా వార్తలేమిటో, ఆ ఫేక్ న్యూస్ కథాకమామిషేమిటో ఓ లుక్కేయండి. 

వ్యాక్సిన్‌పై అపోహలు పెంచుతూ అవాస్తవ ప్రచారం:

ఓ వ్యక్తి వ్యాక్సిన్ వేసుకోవడానికి కూర్చున్నాడు. పక్కన ఉన్న ఓ నర్సు ఓ ఖాళీ సిరంజీకి సూదిని ఉంచి అతడికి గుచ్చి, కొద్ది క్షణాల్లోనే బయటకు తీస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేసి ‘సిరంజీలో వ్యాక్సిన్‌ను నింపకుండానే సూదిని గుచ్చుతున్నారు. ఆ వ్యాక్సిన్లను బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు’ అంటూ తెగ షేర్ చేస్తున్నారు. భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా నర్సుల నిర్వాకం అంటూ నెట్టింట ఈ వీడియోపై నానా రచ్చ జరిగింది. తీరా చూస్తే అది భారత్‌లో తీసిన వీడియో కాదు. మెక్సికోలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో. కానీ, అది అబద్ధమన్న వార్త తెలిసేలోపే నెట్టింట చుట్టేసింది. వ్యాక్సిన్‌పై అపోహలను పెంచేసింది. 

భారత్‌లోనే రెండో అతి పెద్ద కొవిడ్ కేర్ సెంటర్‌ను నెట్టింటే నిర్మించేస్తున్నారు..!

పై ఫొటో చూశారు కదా.. ‘భారత్‌లో రెండో అతి పెద్ద కొవిడ్ కేర్ సెంటర్ నిర్మాణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో జరగుతోంది. 45 ఎకరాల్లో, 4 ఆక్సిజన్ ప్లాంట్‌లతో 6000 బెడ్స్ ఉండేలా సకల సౌకర్యాలతో ఆ సెంటర్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దీన్ని స్వయంగా ఆర్ఎస్‌ఎస్ సంస్థే నిర్మిస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో కళ్లు చెదిరే ఆకృతితో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. తీరా ఆరా తీస్తే అసలు అక్కడ అలాంటి నిర్మాణాలేమీ లేవనీ, అదంతా వట్టి పుకారేనని తేటతెల్లమయింది. పైగా నెట్టింట వైరల్ అయిన ఫొటోలో ఉన్న భవన నిర్మాణం కూడా ‘ఖతర్ దేశంలోని అల్ బైట్ స్టేడియం’కు సంబంధించినదే కావడం గమనార్హం. వాస్తవానికి మహారాష్ట్ర ప్రభుత్వం ‘మా అహిల్యా కొవిడ్ సెంటర్’ను ఇండోర్‌లో ఏర్పాటు చేసింది. 6000 వేల బెడ్స్ కెపాసిటీ కలిగిన ఆ కొవిడ్ సెంటర్‌ను ఆర్ఎస్ఎస్ సంస్థ ఏమీ నిర్మించలేదు. కానీ ఆర్ఎస్ఎస్ వలంటీర్లు మాత్రం అందులో సేవలు అందిస్తున్నారు. ఎవరు పుకారు పుట్టించారో కానీ, ఆ భవనాన్ని ఆర్ఎస్‌ఎస్ నిర్మించిందంటూ నెట్టింట వార్తలను షేర్ చేశారు. చివరకు అది కూడా ఫేక్ అని తేలిపోయింది. 

ఆక్సిజన్ సిలిండర్‌కు బదులుగా నెబులైజరా..? ఇదెక్కడి ఘోరం..

ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కొరత ఎంత తీవ్రంగా ఉందో కళ్ల ముందే కనిపిస్తోంది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క పేషెంట్లే సిలిండర్లను ఏర్పాటు చేయించుకోవడాన్ని చూస్తున్నాం. సుప్రీంకోర్టులో కూడా ఆక్సిజన్ కొరత గురించి విచారణ జరుగుతోంది. అన్ని రాష్ట్రాలు కేంద్రం వైపు ఆశగా చూస్తున్నాయి. ఆక్సిజన్ కొరత వల్లే వందల సంఖ్యలో రోగులు దేశ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రుల్లో జరిగిన ఆ భయానక దృశ్యాల గురించి వార్తలు విని అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితులను కూడా కొందరు ఫేక్ గాళ్లు వదిలి పెట్టలేదు. ఆక్సిజన్ కొరత ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా ‘నెబులైజర్’ను వాడండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఓ నెబులైజర్ కూడా ఆక్సిజన్ సిలిండర్‌లాగా పనిచేస్తుందని ఓ హెల్త్ కేర్ వర్కర్ చెబుతున్నట్టు, ఆ నెబులైజర్‌తోనే ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడినట్టు ట్విటర్లో ఓ వీడియో తెగ వైరల్ అయింది. ‘నా పేరు డాక్టర్ అలోక్. నేను ఫరీదాబాద్‌లోని సర్వోదయా ఆసుపత్రిలో పనిచేస్తున్నాను. ఆక్సిజన్ కొరత సమస్యను ఎదుర్కొనేందుకు నేను ఓ అద్భుతమైన ఆలోచన చేశాను. అది వర్కవుట్ కూడా అయింది. బ్లడ్‌లో ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచేందుకు నెబులైజర్‌ను కూడా వాడొచ్చు. ఈ టెక్నిక్ ద్వారా వేల మంది ప్రాణాలను కాపాడొచ్చు. ఈ వీడియోను అందరూ తప్పకుండా చూడండి’ అంటూ నెట్టింట ఓ వీడియో వైరల్ అయింది. ఈ విషయం తెలిసి వైద్య నిపుణులు కంగుతిన్నారు. ఆ వీడియోను నమ్మి ఎవరూ అలాంటి ప్రయోగాలు చేయొద్దని హెచ్చరించారు. ఆక్సిజన్ సిలిండర్‌కు నెబులైజర్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని తేల్చిచెబుతున్నారు. చివరకు ఆ వీడియోలో ఉన్న అలోక్ అనే డాక్టరే ఆ సమాచారం తప్పని ఒప్పుకున్నారు. కానీ ఆ వీడియో మాత్రం వైరల్ అవుతూనే ఉంది. 

అజిత్ దోవల్ లేఖ రాశారట.. శెభాష్ అని పొగిడారట..!

‘కుంభమేళా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుంభమేళాను ఘనంగా జరిపారు. రాష్ట్ర, కేంద్ర బలగాలు, ఆర్ఎస్‌ఎస్ వలంటీర్లను సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని అద్భుతంగా పూర్తి చేయించారు. గతంలో కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షించిన మీకు అప్పటి అనుభవం బాగా పనికొచ్చింది. హిందువులంతా పవిత్రంగా, పండుగగా జరుపుకునే కుంభమేళాను ఘనంగా నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది.’ అంటూ నేషనల్ సెక్యూరిటీ అవ్వైజర్ అజిత్ దోవల్ ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారంటూ ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అయింది. అసలే కుంభమేళా వల్ల కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగాయంటూ ఆరోపణలు వస్తున్న తరుణంలో, అజిత్ దోవల్ ఇలాంటి లేఖ రాయడమేంటని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ఆ లేఖను రూపొందించి నెట్టింట వదిలారు. తీరా చూస్తే అది కూడా ఓ ఫేక్ వార్తేనని ప్రూవ్ అయింది. అసలు అజిత్ దోవల్ నుంచి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి ఎలాంటి లేఖలు రాలేదని తేలిపోయింది. 

ఓ కుర్రాడి కోసం బెడ్‌ను ఇచ్చేసిన 85 ఏళ్ల వృద్ధుడి పైనా అవాస్తవ ప్రచారం:

ప్రస్తుతం ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకడమే ఇబ్బందిగా మారిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘నాగ్‌పూర్‌కు చెందిన దబాల్కర్ 85 ఏళ్ల వృద్ధుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త. కరోనాతో ఇందిరా గాంధీ ప్రభుత్వాసుపత్రిలో జాయినయ్యాడు. అదే సమయంలో ఓ కుర్రాడికి కరోనా సోకితే అతడు బెడ్ దొరక్క అల్లాడిపోతోంటే ఆ వృద్ధుడికి విషయం తెలిసింది. తన బెడ్‌ను ఆ కుర్రాడికి ఇచ్చేశాడు. అతడికి ఎంతో భవిష్యత్ ఉంది. నాదేముంది మహా అయితే ఏడాది బతుకుతానేమో. నేను పోయినా వచ్చే నష్టమేమీ లేదు. ఆ యువకుడు బతకాలి. అంటూ ఆ వృద్ధుడు తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజే ఇంట్లో అతడు కరోనాతో మరణించాడు’.. అంటూ ఓ యువతి తన తండ్రి చేసిన త్యాగం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే మంచి వార్తలు వైరల్ అయితే ఓర్వలేని బృందం వెంటనే రంగంలోకి దిగింది. ఇదొక ఫేక్ న్యూస్ అని ప్రచారంలోకి తెచ్చేశారు. విచారణలో అధికారులు చేసిన ఓ పొరపాటు కూడా నెటిజన్ల అత్యుత్సాహానికి కారణమయింది. దీంతో ఈ వార్త ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలయింది. చివరకు అధికారులు కూడా చేసిన తప్పును గ్రహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వృద్ధుడిని పొగుడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఓ పోస్ట్ చేయడంతో అవాస్తవ ప్రచారానికి పులుస్టాప్ పడింది. 


రోడ్డుపక్కన ఆక్సిజన్ సిలిండర్‌తో సహా ఓ వృద్ధురాలి ఫొటోతో రచ్చ రచ్చ..

‘ఓ వృద్ధురాలు. ఆక్సిజన్ సిలిండర్ సాయంతో శ్వాస తీసుకుంటోంది. ఆమె ఏ ఐసీయూ బెడ్లోనో, ఆసుపత్రిలోనో ఉంటే అది వార్త అయి ఉండేది కాదు. కానీ ఆమె ఆక్సిజన్ సిలిండర్ సాయంతో శ్వాస తీసుకుంటోంది నడి రోడ్డుపైన. అవును, ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క రోడ్డుపైనే చికిత్స చేస్తున్నారు. ఇదీ కరోనా సృష్టిస్తున్న విలయం. అధికారుల నిర్లక్ష్యం. ప్రభుత్వ వైఫల్యం..’ అంటూ కామెంట్లతో ఓ ఫొటో నెట్టింట పెద్ద రచ్చే క్రియేట్ చేసింది. అయితే నెట్టింట వైరల్ అయిన ఆ ఫొటో ఇప్పటిది కాదు. కరోనాకు అసలే సంబంధం లేదు. కరోనా రాకముందు జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పొటో అది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 2018వ సంవత్సరంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన ఫొటో అది. అయినా, అది కరోనాకు సంబంధించినదేంటూ నెట్టింట తెగ షేర్ అయింది. అయ్యో పాపం అంటూ కామెంట్లు పెడుతూనే, ప్రభుత్వాలను నెటిజన్లు ఏకిపారేశారు. తీరా అది ఫేక్ వార్త అని చెప్పినా, ఎవరూ నమ్మకపోవడం విచిత్రం.

ముక్కులో నిమ్మరసం.. కరోనాకు దివ్యౌషధమట..!

‘ముక్కులో నిమ్మరసం పోసుకోండి చాలు. ఏ కరోనా వైరస్ మీ దరిచేరదు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ చేరదు. దీన్ని అబద్దమని నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తా. వైద్యులు, శాస్త్రవేత్తలకు సవాల్’ అంటూ ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది. అది నిజమేనని కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాకు చెందిన బసవరాజ్ అనే ఉపాధ్యాయుడు నమ్మేశాడు. ముక్కులో నిమ్మరసం పిండుకున్నాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చివరకు పరిస్థితి విషమించి ప్రాణాలే కోల్పోయాడు. 


చూశారుగా.. ఇలాంటి ఎన్నో అబద్ధపు ప్రచారాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న ఈ రోజుల్లో నెట్టింట కుప్పలుతెప్పలుగా వస్తున్న ఈ పోస్టులను నిజమని నమ్మేయకండి. నమ్మి షేర్ చేయకండి. అవాస్తవ ప్రపంచంలోని మీ స్నేహితులను నెట్టేయకండి. నెట్టింట సూచించే సూచనలను నిజమని నమ్మొద్దు. వైద్యుల సూచనలతోనే ఎలాంటి ట్రీట్‌మెంట్ అయినా తీసుకోండి. సోషల్ మీడియాలో లభించే సమాచారాన్ని నమ్మి పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...