చైర్మన్‌ మాట వినాల్సిందే!

ABN , First Publish Date - 2021-07-28T05:08:42+05:30 IST

మాన్సాస్‌ ట్రస్టు బోర్డు ఆమోదంతో చైర్మన్‌ ఇచ్చిన ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మాన్సాస్‌ ఖాతాల ఫ్రీజింగ్‌ ఆదేశాలను సస్పెండ్‌ చేసింది. ఉద్యోగుల జీతాలకు ఈవో అడ్డుపడుతున్న తీరుపై చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది.

చైర్మన్‌ మాట వినాల్సిందే!
మాన్సాస్‌ కార్యాలయం

హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మాన్సాస్‌ ఖాతాల ఫ్రీజింగ్‌ ఆదేశాలను సస్పెండ్‌ చేసిన కోర్టు

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

మాన్సాస్‌ ట్రస్టు బోర్డు ఆమోదంతో చైర్మన్‌ ఇచ్చిన ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మాన్సాస్‌ ఖాతాల ఫ్రీజింగ్‌ ఆదేశాలను సస్పెండ్‌ చేసింది. ఉద్యోగుల జీతాలకు ఈవో అడ్డుపడుతున్న తీరుపై చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. ట్రస్టుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజింగ్‌ చేయాలని ఈవో ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్‌ చేసింది. ఈవో తీరును తప్పుపట్టింది. ట్రస్టుకు సంబంధించిన లావాదేవీల ఆడిట్‌ను అధికారులతో మాత్రమే చేయించాలని.. ఇతరుల ప్రమేయం ఉండకూడదని కూడా స్పష్టం చేసింది. 

ఇదీ కారణం

మాన్సాస్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాల్లేవు. ఏడాదిగా సగం జీతం మాత్రమే చెల్లించగా గత నాలుగు నెలలుగా పూర్తిగా వేతనాలు చెల్లించడంలేదు. అశోక్‌ గజపతిరాజు తిరిగి ట్రస్టు బోర్డ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత సిబ్బంది జీతాలు చెల్లించాలని ఆదేశాలిచ్చారు. కరస్పాండెంట్‌ ద్వారా నగదు విడుదలకు చెక్కలు కూడా జారీ చేశారు. ఆ చెక్కులు చెల్లుబాటు కాకుండా ఈవో బ్యాంకు ఖాతాలపై ఫ్రీజింగ్‌ ఆదేశాలిచ్చారు. దీంతో బ్యాంకర్లు చెక్కులను వెనక్కు పంపించారు. ఆ తర్వాత కథ ముదిరి పాకాన పడింది. చైర్మన్‌, కరస్పాండెంట్‌ ఆదేశాలిచ్చానా జీతాలు చెల్లుబాటుకాకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అశోక్‌గజపతిరాజు హైకోర్టుకు వెళ్లారు. ఖాతాలను ఎలా ఫ్రీజ్‌ చేస్తారని? ఆ ఉత్తర్వులను వెంటనే కొట్టివేయాలని అభ్యర్ధించారు. దీనిపై హైకోర్టు విచారించి మంగళవారం తీర్పు వెల్లడించింది. ఈవో ఇచ్చిన ఫ్రీజింగ్‌ ఆదేశాలను సస్పెండ్‌ చేసింది. ఈ పరిణామంతో జీతాలకు ఢోకాలేదని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే దేవదాయ శాఖ అధికారులు అమరావతిలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి ఉద్యోగుల జీతాలకు ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించారు. దేవదాయ శాఖ ఏటా మాన్సాస్‌కు అందించే రూ.5 కోట్ల ద్వారా చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో అశోక్‌ను కట్టడి చేసే వ్యూహం పన్నారు. ఏదైనాగానీ మాన్సాస్‌ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ప్రస్తుతానికి హైకోర్టు చొరవతో ఉద్యోగుల జీతాల చెల్లింపు సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడినట్టే.



Updated Date - 2021-07-28T05:08:42+05:30 IST