మేం చెప్పింది వినడమే.. మీరు మాట్లాడొద్దు

ABN , First Publish Date - 2021-12-01T06:45:52+05:30 IST

కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా కౌన్సిల్‌లో మేం చెప్పింది వినడంవరకే మీపని..

మేం చెప్పింది వినడమే.. మీరు మాట్లాడొద్దు
కౌన్సిల్‌ సమావేశంలో సభ్యుల వాగ్వాదం

తిరువూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపక్షంపై పాలకవర్గం తీరు

తిరువూరు, నవంబరు 30: కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా కౌన్సిల్‌లో మేం చెప్పింది వినడంవరకే మీపని.. మీకు మాట్లాడే అవకాశం లేదంటూ పాలకపక్షం సభ్యులు అన్నారు. మున్సిపల్‌ సమావేశం మంగళవారం చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి అధ్యక్షతన జరిగింది. పట్టణంలో ఎల్‌ఈడీ బల్పుల ఏర్పాటుకు రూ.7 లక్షలు కేటాయించడంపై టీడీపీ కౌన్సిలర్లు అబ్దుల్‌ హుస్సేన్‌, నాళ్లా సురేంద్ర మాట్లాడుతూ, 2018 మేలో పట్టణంలో ఎల్‌ఈడీ బల్పుల ఏర్పాటు ఐఈఎస్‌ఎస్‌ సంస్థతో ఐదు సంవత్సరాల ప్రాతిపదికన నాటి పాలకవర్గం కాంట్రాక్టు ఇచ్చింది. దాని ప్రకారం 2024 వరకు గడువు ఉండగా ప్రస్తుతం రూ.7 లక్షలు కేటాయించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వైస్‌చైర్మన్‌ వెలుగొటి విజయలక్ష్మి, పసుపులేటి శేఖర్‌బాబు మాట్లాడుతూ కాంట్రాక్టర్‌కు మొత్తం నగదు చెల్లించడంతో పట్టణంలో బల్పుల ఏర్పాటుకు రావటం లేదని, పట్ణణంలో పలు ప్రాంతాల్లో  లైట్ల ఏర్పాటుకు ఇప్పుడు టెండర్‌ పిలవటం జరిగిందన్నారు.  కాంట్రాక్టర్‌కు నిర్వహణ బాధ్యత 2024 వరకు ఉంది కాబట్టి,  కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఆ సంస్థతో బల్పులు ఏర్పాటు చర్యలు తీసుకోకుండా ఇలా ప్రజాధనాన్ని ఎందుకు ఖర్చుచేస్తున్నారన్నారు. ఈ నిధులు నూతనంగా వేసిన స్తంభాలకు విద్యుత్‌ బల్పుల ఏర్పాటు కోసమని వైస్‌చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, 14వ వార్డు కౌన్సిలర్‌ శేఖర్‌బాబు అన్నారు. అలాగే 13వ వార్డులో అంగన్‌వాడీ భవన నిర్మాణ స్థలంలో జంగిల్‌ క్లియరెన్స్‌కు రూ.30 వేలు కేటాయించడంపై టీడీపీ  కౌన్సిలర్లు అభ్యంతరం  తెలిపారు. భవన నిర్మాణం కాంట్రాక్టరే  జంగిల్‌ క్లియరెన్స్‌చేసుకుంటాడు. నిధులు వృథా చేయవద్దని సూచించారు. దీంతో పాలకపక్షం మేమి చెప్పించి వినటమే, మీరు మాట్టావద్దని కౌన్సిల్‌ సమావేశం ముగిసిందన్నారు. కానీ ఆ తరువాత అజెండాలోని నాలుగు అంశాలు అమోదించుకోవడం కొసమెరుపు. సమావేశంలో ఇన్‌చార్జి కమిషనర్‌ మనోజ, టీపీవో పీవో మూర్తి, ఏఈ కృష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-01T06:45:52+05:30 IST