జాబితాలు గందరగోళం!

ABN , First Publish Date - 2022-07-07T05:10:48+05:30 IST

‘ప్రభుత్వం చెల్లిస్తున్న అదనపు పరిహారం కోసం ప్రదర్శించిన జాబితాలు గందరగోళంగా ఉన్నాయి. అధికారులూ సక్రమంగా సమాచారం ఇవ్వడం లేదు. అస్తవ్యస్తంగా పరిహారం చెల్లిస్తున్నారు’ అని వంశధార నిర్వాసితులు కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అదనపు నష్టపరిహారం పంపిణీకి సంబంధించి వంశధార నిర్వాసితులు, అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులు పలు సమస్యలను కలక్టరు ముందుంచారు.

జాబితాలు గందరగోళం!
నిర్వాసితులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

సక్రమంగా అందని అదనపు పరిహారం
కలెక్టర్‌ ముందు వంశధార నిర్వాసితుల ఆవేదన
అర్హులకు న్యాయం చేస్తామన్న శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
హిరమండలం, జూలై 6 :
‘ప్రభుత్వం చెల్లిస్తున్న అదనపు పరిహారం కోసం ప్రదర్శించిన జాబితాలు గందరగోళంగా ఉన్నాయి. అధికారులూ సక్రమంగా సమాచారం ఇవ్వడం లేదు. అస్తవ్యస్తంగా పరిహారం చెల్లిస్తున్నారు’ అని వంశధార నిర్వాసితులు కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అదనపు నష్టపరిహారం పంపిణీకి సంబంధించి వంశధార నిర్వాసితులు, అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులు పలు సమస్యలను కలక్టరు ముందుంచారు. ‘పరిహారం జాబితాలో కొంతమంది పేర్లు లేవు. ఇప్పటివరకు చాలామందికి పరిహారం అందలేదు. మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల్లో కొంతమందికే పరిహారం చెల్లించారు. దరఖాస్తులు ఇచ్చేందుకు అధికారుల వద్దకు వెళితే.. ఉద్యోగులకు పరిహారం అందజేయడం లేదంటూ తిరస్కరిస్తున్నారు. సగం మందికి పరిహారం చెల్లించి.. కీ నెంబర్లు లేవని కొంతమంది చెల్లింపులు నిలిపేశారు. సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. ఎవరికి దరఖాస్తులు ఇవ్వాలో తెలియక రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామ’ని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ.. అర్హులైన నిర్వాసితులందరికీ అదనపు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ‘మృతి చెందిన వారికి సంబంధించి ఫ్యామిటీ మెంబర్‌ సర్టిఫికెట్‌, లీగల్‌ హెయిర్‌ అందజేస్తే చాలు. అఫిడవిట్‌ అవసరం లేదు. ఇప్పటివరకూ నిర్వాసితులకు రూ.130 కోట్లు చెల్లించాం. మరో పది రోజుల్లో మిగతా పరిహారాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం.  ఆధార్‌ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా అందజేయకపోవడంతో 3వేల మంది నిర్వాసితుల దరఖాస్తులు తిరస్కరించాం. ఇందుకు గల కారణాలతో జాబితాను హిరమండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతాం. సరైన ఆధారాలతో దరఖాస్తు చేస్తే పరిహారం అందజేస్తాం. ఉన్న భూమికి పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని చెబుతున్న రైతులంతా.. సరైన వివరాలు ఆధార్‌ నెంబర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. భూములు, ఆర్‌అండ్‌ఆర్‌ కలిపి ఇంకా సుమారు 4వేల మందికి సంబంధించి డేటా రావాల్సి ఉంది. దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులందరికీ పరిహారం అందజేస్తామ’ని కలెక్టర్‌ వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఆర్డీవో జయరామ్‌, తహసీల్దార్‌లు బి.ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ ఉన్నారు.

 

Updated Date - 2022-07-07T05:10:48+05:30 IST