Liver Health: ఊబకాయంతో కాలేయానికి డేంజర్ బెల్స్..

ABN , First Publish Date - 2022-07-30T19:21:44+05:30 IST

మన శరీరంలో అత్యంత కష్టపడి పనిచేసే అవయవాలలో కాలేయం 500 కంటే ఎక్కువ విధులను నిర్వహిస్తుంది.

Liver Health: ఊబకాయంతో కాలేయానికి డేంజర్ బెల్స్..

మన శరీరంలో కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. రక్తంలోని టాక్సిన్స్ ను ఫిల్టర్ చేయడం, శక్తిని నిల్వ చేయడం, హార్మోన్లను, ప్రోటీన్ లను రెగ్యులేట్ చేయడం కాలేయం చేసే ముఖ్య విధుల్లో కొన్ని. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలిలో ఆరోగ్యకరమైన మార్పులు అవసరం. 


మన శరీరంలో అత్యంత కష్టపడి పనిచేసే అవయవాలలో కాలేయం 500 కంటే ఎక్కువ విధులను నిర్వహిస్తుంది. ఇది  ఒత్తిడికి గురయ్యే వరకు ఎప్పుడూ ఫిర్యాదు చేయదు. బహుశా, అందుకే మనం ఈ కీలకమైన అవయవంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదేమో. అసలు కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేయాల్సిన పనులేమిటో తెలుసుకుందాం. 


1. కంటినిండా నిద్ర చాలా అవసరం. 

రాత్రి నిద్రపోవాలంటే చాలామందికి ఇప్పటిరోజుల్లో కుదిరే పనికాదు. సమయానికి నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలున్నాయి. రోజంతా అధిక ఒత్తిడి మీద పనిచేయడం, అనారోగ్య సమస్యలు, శరీర ఆరోగ్యానికి చేటు చేసే అలవాట్ల కారణంగా నిద్ర సరైన సమయానికి పట్టదు. ఈ ప్రభావం మన కాలేయం మీద పడుతుందంటున్నారు డాక్టర్స్. ఆరోగ్యకరమైన నిద్ర కనీసం 7 నుంచి 9 గంటలు ఉండాలంటున్నారు. 


2. అధిక బరువు ఆరోగ్యానికి మంచిదేనా?

అధిక బరువు వల్ల శరీరంలో కాలేయానికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు డాక్టర్స్. అధిక బరువు ఉన్నా ఆరోగ్యంగానే ఉన్నామనే భ్రమలో ఉంటారు చాలామంది. కానీ ఈ ఊబకాయం కాలేయ డిసీజ్ కు ప్రధాన కారణాలలో ఒకటి. అధిక బరువు ఉన్న వ్యక్తులు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ముప్పును కలిగి ఉంటారు. అందువల్ల శరీరంలో అధిక బరువును తగ్గించుకునేందుకు ఆరోగ్యకరమైన డైట్ ను ఫాలో కావాలి. ఉండాల్సిన దానికంటే అధిక బరువు ఉన్నట్లయితే అది మీకు ఎప్పుడో డెంజర్ బెల్స్ మోగిస్తుందని గురుతుపెట్టుకోండి. 


3. శరీరాన్ని మందుల సంచిగా మార్చకండి. 

మన శరీరానికి అనారోగ్యం వచ్చిందంటే దాని నుంచి బయటపడడానికి మందులు వాడి నయం చేసుకుంటాం. ఇది మామూలుగా అందరూ చేసే పనే. అసలు జబ్బుకు సరైన మందు వేసుకుంటున్నామా?లేక సొంత వైద్యం తో ఏది పడితే అది మింగేస్తున్నామా అనేది ఒకసారి బేరీబు వేసుకోవాలి. అనవసరంగా వాడుతున్న ఈ మందుల ప్రభావం మన శరీరం మీద ఉంటుంది. ముఖ్యంగా అది లివర్ మీద ప్రభావం చూపిస్తుందంటున్నారు డాక్టర్స్. జబ్బు చేసి పరిస్థితి మన చేతిలో లేనప్పుడు మాత్రమే మెడిసిన్స్ వాడాలి లేకపోతే మామూలుగా మందులు వేసుకునే ముందు మీకు నిజంగా అది అవసరమా అని ఆలోచించండి.


4. శరీరానికి వ్యాయామం అవసరం.

మన కాలేయంలో కొవ్వు పేరుకుపోవడంపై వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ 30 నిమిషాల చురుకైన నడక మన కాలేయ ఆరోగ్యానికి సహకరిస్తుంది. 


5. ధూమపానాన్ని దూరం పెట్టండి. 

కాలేయానికి పొగతో చాలా ముప్పు కలుగుతుంది. ధూమపానం, రసాయనాలు శరీరంలో కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది. 


కాలేయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకుందాం.....


1. డాక్టర్ సలహా లేనిదే మందులు తీసుకోకండి.. సొంత నిర్ణయాలతో తీసుకునే మందులు మీ కాలేయానికి హాని కలిగిస్తాయి.

2. మధ్యం తీసుకునేవారు అందులో ఇతర రసాయనాలును కలిపి తీసుకోకండి.

3. గదిలో బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.

4. బగ్ స్ప్రేలు, పెయింట్ స్ప్రేలు ఇతర రసాయన స్ప్రేలు కూడా హాని కలిగిస్తాయి. 

5. హెపటైటిస్ A, B టీకాలు మీ పిల్లలకు తప్పక వేయించండి.

6. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. రోజూ కాస్త దూరం నడవండి. 

7. దువ్వెనలు, రేజర్లు, వ్యక్తిగత వస్తువులను భాగస్వామ్యం చేయవద్దు.

8. సమతుల్య, పోషకాహారం రోజువారి ఆహారంలో ఉండేలా చూడండి. 

9. శరీర బరువను అదుపులో ఉండుకోండి.

10. ముఖ్యంగా పొగత్రాగ వద్దు.


స్థూలకాయుల్లో మాత్రమే కాలేయం ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంది అనుకుంటాం. దీనికి నిపుణులు అంటున్న మాట ఏమిటంటే.. నాన్ ఆల్కహాలిక్ అయి ఫ్యాటీ లివర్ డిసీజ్(NAFLD) అనేది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా ఉన్న ఆరోగ్య సమస్య. మన భారతదేశంలో లివర్ సిర్రోసిస్ తో ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇది ముఖ్యంగా యువతలో ఎక్కువగా వ్యాపిస్తుంది. ఊబకాయంతో పాటు (NAFLD) జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. దీనితో గుండె జబ్బులు, అధిక BP, మధుమేహం, మూత్రపిండ వ్యాధి, స్లీప్ అప్నియా ఇంకా మరెన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

Updated Date - 2022-07-30T19:21:44+05:30 IST