Liz Truss-Rishi Sunak Debate: వాడివేడిగా తొలి డిబేట్.. వెనుకంజలో రిషి సునాక్

ABN , First Publish Date - 2022-07-27T16:13:19+05:30 IST

బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్న భారత సంతతి వ్యక్తి, మాజీ చాన్సలర్‌ రిషి సునాక్ (Rishi Sunak), విదేశాంగ మంత్రి లిజి ట్రస్ (Liz Truss) మధ్య జరిగిన మంగళవారం బీబీసీ చానెల్‌లో జరిగిన డిబేట్ (Debate) హోరాహోరీగా జరిగింది. ప్రధానంగా ఇరు నేతల మధ్య పన్ను ప్రణాళిక, ఆర్థిక అంశాలపై చర్చలు జరిగాయి.

Liz Truss-Rishi Sunak Debate: వాడివేడిగా తొలి డిబేట్.. వెనుకంజలో రిషి సునాక్

లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్న భారత సంతతి వ్యక్తి, మాజీ చాన్సలర్‌ రిషి సునాక్ (Rishi Sunak), విదేశాంగ మంత్రి లిజి ట్రస్ (Liz Truss) మధ్య జరిగిన మంగళవారం బీబీసీ చానెల్‌లో జరిగిన డిబేట్ (Debate) హోరాహోరీగా జరిగింది. ప్రధానంగా ఇరు నేతల మధ్య పన్ను ప్రణాళిక, ఆర్థిక అంశాలపై చర్చలు జరిగాయి. కాగా, ఈ డిబేట్‌లో ఎవరూ బాగా మాట్లాడారు అన్నదానిపై ఒపీనియం సంస్థ నిర్వహించిన పోల్‌లో రిషికి 39 శాతం ఓట్లు వస్తే.. లిజికి 38 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, ఈ సర్వేలో పాల్గొన్న కన్జర్వేటివ్‌ పార్టీ ఓటర్లలో మాత్రం 47 శాతం మంది లిజి బాగా మాట్లాడారని చెబితే.. 38 శాతం మంది రిషికి మద్దతు పలికారు.  


ఇక డిబేట్‌లో భాగంగా "40 బిలియన్‌ పౌండ్ల మేర పన్నుల కోతకు మీరు హామీ ఇచ్చారు. అదనంగా 40 బిలియన్‌ పౌండ్ల అప్పులు తెస్తామన్నారు. అది దేశానికి భారమవుతుంది. భవిష్యత్‌తరాలు ఆ రుణాన్ని తీర్చాల్సి ఉంటుంది" అంటూ లిజిపై రిషి విమర్శలు గుప్పించారు. అలాగే లిజి ప్రతిపాదిస్తున్న పన్ను(TAX) కోతల వల్ల లక్షల మంది ఇబ్బందిపడతారని, వచ్చే సాధారణ ఎన్నికల్లో దీనికి కన్జర్వేటివ్‌ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మహమ్మారి కరోనావైరస్ వల్ల దేశంలో ప్రస్తుతం పన్ను భారం పెరిగిందని తెలిపారు. కోవిడ్-19 విజృంభణ సమయంలో ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇక లిజి కూడా రిషి వ్యాఖ్యలపై అదే స్థాయిలో ఘాటుగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఏ దేశమూ పన్నులు పెంచడంలేదని ఆమె వ్యాఖ్యానించారు. 


"రిషి ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 70 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భారీగా పన్నులను పెంచారు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. నిజాలెంటో గణాంకాలే చెబుతున్నాయి" అని లిజి మండిపడ్డారు. నిజంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వృద్ధికి ప్రస్తుతం రిషి వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని ఆమె విమర్శించారు. ఇలా ఇరువురు నేతల మధ్య వాడివేడి చర్చలు జరిగాయి. ఇదిలాఉంటే.. ప్రస్తుతం యూకే పీఎం రేసులో రిషి కంటే కూడా లిజినే ముందంజలో ఉన్నట్లు పలు సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. బ్రిటన్‌ ప్రధానిగా లిజినే ఎంపిక కావడానికి 75 శాతం ఆస్కారం అధికంగా ఉందని బెట్టింగ్‌ అంచనాల సంస్థ 'ఆడ్స్‌చెకర్‌' పేర్కొంది. 'యువ్‌గవ్‌' అనే మరో సంస్థ నిర్వహించిన సర్వే కూడా ఆమె వైపే మొగ్గింది. దీంతో రిషి సునాక్ ప్రధాని రేసులో వెనుక బడినట్లు తెలుస్తోంది.  


Updated Date - 2022-07-27T16:13:19+05:30 IST