ఇలా అయితే ఎలా?

ABN , First Publish Date - 2021-11-11T05:33:44+05:30 IST

ఇలా అయితే ఎలా?

ఇలా అయితే ఎలా?

ఇంకా విడుదల కాని ఎల్‌ఎల్‌బీ చివరి సెమిస్టర్‌ ఫలితాలు

రెండు నెలల నుంచి విద్యార్థుల ఎదురుచూపులు

విజయవాడ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా యూనివర్సిటీ పరిధిలో మూడేళ్లు, ఐదేళ్ల న్యాయ విద్య కోర్సులు (బీఎల్‌/ఎల్‌ఎల్‌బీ) చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు చివరి వారంలో పరీక్షలు రాసినా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయకపోవడంతో ఎల్‌ఎల్‌ఎం, ఇతర ఉన్నత కోర్సులకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన ఇవే పరీక్షల ఫలితాలను రికార్డు సమయంలో (పరీక్షలు ముగిశాక ఆరు రోజుల్లోనే) విడుదల చేశారని, కృష్ణా యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు రాసి రెండు నెలలు దాటినా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయకపోవడానికి కారణాలేంటో అర్థం కావడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు రూ.వేలల్లో ఫీజులు చెల్లించి ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో చేరిపోయారు. తీరా ఫలితాలు విడుదల చేశాక ఏమైనా కొన్ని సబ్జెక్టుల్లో తప్పితే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలలు దాటిపోయిందని, ఫలితాలు విడుదల చేశాక రీ వాల్యుయేషన్‌కు, బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులున్న విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించాల్సి ఉందని, ఇవన్నీ నిర్వహించడానికి ఇంకెంత సమయం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. విలువైన విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండేలా ఇప్పటికైనా కృష్ణా యూనివర్సిటీ అధికారులు ఫలితాలను విడుదల చేయాలని కోరుతున్నారు. 

వాల్యుయేషన్‌ కోసం ఆంధ్రా యూనివర్సిటీకి.. 

లా కళాశాల విద్యార్థులు రాసిన పరీక్షల జవాబు పత్రాలను ఆంధ్రా యూనివర్సిటీకి పంపుతున్నాం. కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో మూల్యాంకనం చేసేందుకు ఎవరూ దొరకలేదు. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం కార్యక్రమాల్లో పని ఒత్తిడి ఉండటం వల్ల మూల్యాంకనం ఇప్పటి వరకు చేయించలేదు. దీంతో ఫలితాలు వెల్లడించడంలో జాప్యమైంది. త్వరలో జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటిస్తాం.

- రామశేఖరరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి, కృష్ణా విశ్వవిద్యాలయం

Updated Date - 2021-11-11T05:33:44+05:30 IST