అప్పులే.. అప్పులు..

ABN , First Publish Date - 2022-08-08T05:59:38+05:30 IST

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి (ఎస్‌ఆర్‌డీపీ) నిధుల కటకట మొదలైంది.

అప్పులే.. అప్పులు..

ఇప్పటికే రూ. 5,275 కోట్ల అప్పు

ఎస్‌ఆర్‌డీపీకి నిధుల కటకట   

బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు  

నిధుల సమీకరణకు జీహెచ్‌ఎంసీ కసరత్తు 

బాండ్ల జారీతో రూ.500 కోట్లు..?   

కుదరని పక్షంలో మరోసారి రూపీ టర్మ్‌లోన్‌  

పురోగతిలో ఉన్న ప్రాజెక్టులకు రూ.1500 కోట్లు అవసరం  


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి (ఎస్‌ఆర్‌డీపీ) నిధుల కటకట మొదలైంది. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన ఆరేళ్లలో మొదటిసారి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు కరిగిపోవడంతో నిధులు సమకూర్చుకునేందుకు జీహెచ్‌ఎంసీ మల్లగుల్లాలు పడుతోంది. కీలక బాధ్యతలు నెత్తిన పెట్టిన సర్కారు ఇప్పటి వరకు పైసా ఆర్థిక సహకారం చేయలేదు. పురోగతిలో ఉన్న పనులకూ పైసా ఇచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదు. దీంతో ఇప్పటి వరకు శరవేగంగా సాగిన ఎస్‌ఆర్‌డీపీ పనులకు రెండు పడకల ఇళ్ల తరహాలో బ్రేక్‌ పడుతుందా, మరిన్ని అప్పులు చేసి జీహెచ్‌ఎంసీ చేపట్టిన పనులను పూర్తి చేస్తుందా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు (ఇంకా వాయిదాలు ప్రారంభం కాలేదు) చెల్లించని ధైన్యం నెలకొన్న నేపథ్యంలో అదనంగా రుణాలు తీసుకుంటే పరిస్థితి ఏంటన్న మీమాంసలో పడింది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్ర సర్కారు.. మరింత అప్పు మీరే చేయాలని జీహెచ్‌ఎంసీకి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన రుణం తీసుకోవాలి అన్న అంశాన్ని ఆర్థిక విభాగం వర్గాలు పరిశీలిస్తున్నాయి. 

రూ.29 వేల కోట్లతో పనులు..

మహానగరంలో సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం రూ.29 వేల కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ ప్రణాళికలు రూపొందించారు. పలు దఫాలుగా రూ.8 వేల కోట్ల విలువైన పనులు చేపట్టారు. వీటన్నింటినీ ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌-1 ప్రాజెక్టులుగా ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ పరిగణిస్తోంది. 47 ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలో 30 పూర్తయ్యాయి. వంతెనలు, అండర్‌పా్‌సలు, ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలో అందుబాటులోకి వచ్చాయి. పూర్తయిన పనుల విలువ రూ.3700 కోట్లకుపైగా ఉంటుంది. రూ.4300 కోట్ల పైచిలుకు పనులు 17 చోట్ల పురోగతిలో ఉన్నాయి. ఇందులో 14 పనులు జీహెచ్‌ఎంసీ చేస్తుండగా.. మరో మూడు ప్రాంతాల్లో ఎన్‌హెచ్‌ఏఐ పనులు చేస్తోంది. చాంద్రాయణగుట్ట, నాగోల్‌, ఎల్‌బీనగర్‌, కొత్తగూడ, బైరామల్‌గూడ, ఎల్‌బీనగర్‌ ఆర్‌హెచ్‌ఎ్‌స పనులు తుది దశకు చేరుకున్నాయి. వీఎ్‌సటీ, నల్గొండ చౌరస్తా, అరాంఘర్‌-జూపార్క్‌ ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతోన్న పనుల విలువ రూ.860 కోట్ల వరకు ఉంటుంది. ఉప్పల్‌- నారపల్లి, అంబర్‌పేట ఛే నెంబర్‌, అరాంఘర్‌ వంతెనలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఆస్తుల సేకరణ దాదాపుగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో బల్దియా నిర్మిస్తోన్న వంతెనల కోసం  కనీసం రూ.1500 కోట్లు అవసరమని భావిస్తున్నారు. ఈ నిధుల సమీకరణపై సంస్థ దృష్టి సారించింది. 

బాండ్ల జారీతో  రూ.500 కోట్లు..?

గతంలో మునిసిపల్‌ బాండ్ల జారీ ద్వారా రూ.495 కోట్లు, రూపీ టర్మ్‌ లోన్‌ రూపంలో తీసుకున్న రూ.2500 కోట్లు ఇప్పటికే ఖర్చయ్యాయి. రూ.400 కోట్లకుపైగా జీహెచ్‌ఎంసీ నిధులనూ ఆదిలో ప్రాజెక్టు కోసం వెచ్చించారు. ఎస్‌ఆర్‌డీపీ ఆస్తుల సేకరణకు రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి బదలాయింపు హక్కు (టీడీఆర్‌) కల్పించారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనులకు మరో రూ.1500 కోట్ల వరకు అవసరమని భావిస్తోన్న నేపథ్యంలో రుణాల కోసం అన్వేషణ ప్రారంభించింది. రూ.1000 కోట్ల బాండ్ల జారీకి గతంలోనే జీహెచ్‌ఎంసీకి అనుమతి లభించింది. ఈ క్రమంలోనే మూడు పర్యాయాలు మునిసిపల్‌ బాండ్లు జారీ చేసి రూ.495 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఇప్పుడు మరో రూ.500 కోట్లు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మూడో దఫా బాండ్ల జారీకి ఆశించిన స్పందన రాలేదు. కేవలం రూ.100 కోట్లు.. అది కూడా రూ.10.23 శాతం వడ్డీకి ఇచ్చేందుకు మదుపర్లు ముందుకు వచ్చారు. తొలి విడత బాండ్లకు 8.9 శాతం వడ్డీ రేటుకు రూ.200 కోట్లు రాగా.. మూడో విడత వడ్డీ రేటు గణనీయంగా పెరిగింది. దీంతో ఆ తరువాత జీహెచ్‌ఎంసీ బాండ్ల జోలికి వెళ్లలేదు. ఆర్థిక అవసరాల దృష్ట్యా.. ప్రస్తుతం బాండ్లకు వెళ్లాలా..? రుణం తీసుకోవడం సులువా..? అన్నది పరిశీలిస్తున్నారు. తొలుత రూ.500 కోట్ల కోసం బాండ్స్‌ లిస్టింగ్‌ చేసే అవకాశమూ ఉందని సమాచారం. స్పందన రాని పక్షంలో రూపీ టర్మ్‌ లోన్‌ తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని జీహెచ్‌ఎంసీ ఆర్థిక విభాగం వర్గాలు చెబుతున్నాయి. రూ.500 కోట్ల ద్వారా ఒక సంవత్సరం పనులు ఆగకుండా సాగుతాయి. ఆ లోపు మరో రూ.1000 కోట్ల సమీకరణకు ప్రయత్నాలు చేయొచ్చు. ఇప్పుడు బాండ్ల జారీకి స్పందన రాని పక్షంలో రూపీ టర్మ్‌ లోన్‌కు వెళితే రూ.1000 - 1500 కోట్ల రుణం తీసుకోనున్నారు. దీంతో పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు దాదాపుగా పూర్తయ్యే అవకాశముంది. బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం త్రైమాసికాల వారీగా అవసరాన్ని బట్టి రుణం తీసుకుంటారు.

నెలకు రూ. 40 కోట్ల వడ్డీ

వివిధ ప్రాజెక్టుల కోసం జీహెచ్‌ఎంసీ ఇప్పటికే రూ.5275 కోట్ల రుణం తీసుకుంది. ఎస్‌ఆర్‌డీపీ కోసం బాండ్ల ద్వారా రూ.495 కోట్లు, ఎస్‌బీఐ నుంచి రూపీ టర్మ్‌ లోన్‌ ద్వారా రూ.2500 కోట్లు తీసుకున్నారు. కాంప్రహెన్సీవ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌ (సీఆర్‌ఎంపీ)లో భాగంగా ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించిన ప్రాజెక్టు కోసం రూ.1460 కోట్లు, వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ) పనులకు రూ.680 కోట్లు రుణం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పనుల కోసం రూ.140 కోట్లు హడ్కో వద్ద అప్పు చేశారు. హడ్కో మినహా మిగతా అప్పులకు ఇప్పటి వరకు నెలనెలా వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నారు. ఆ మొత్తమే సుమారు రూ.40 కోట్ల వరకు ఉంటోంది. ఈ సంవత్సరాంతానికి రూపీ టర్మ్‌ లోన్‌ వాయిదాల చెల్లింపూ మొదలు కానుంది. దీంతో నెలకు కనీసం రూ.80 నుంచి 100 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మరో రూ.1500 కోట్లు అప్పు తీసుకున్న పక్షంలో వడ్డీ/వాయిదాతో కలిపి ఈ మొత్తం మరింత పెరగనుంది. ప్రస్తుతం వేతనాల చెల్లింపునకే అష్టకష్టాలు పడుతోన్న సంస్థ రుణాలు ఎలా తీరుస్తుంది, అదనపు ఆదాయం ఎలా సమీకరించుకుంటుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆస్తి పన్ను, పట్టణ ప్రణాళికా విభాగం, ఇతరత్రా మార్గాల్లో సంస్థకు వస్తోన్న ఆదాయం రూ.3 వేల కోట్లు దాటడం లేదు. ఇందులో దాదాపు రూ.1800 కోట్ల వరకు వేతనాలు, పెన్షన్ల చెల్లింపునకే సరిపోతుంది. రహదారుల నిర్మాణం, నిర్వహణ, చెత్త తరలింపు, శాస్ర్తీయ నిల్వ, నిర్వహణ, తదితర పనులకు మరో రూ.1000 కోట్ల వరకు అవసరం. వస్తోన్న ఆదాయం వేతనాలు, పౌర సేవలకు సంబంధించిన పనులకే చాలని పరిస్థితిలో అప్పులు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఆర్థిక విభాగం వర్గాల్లో వ్యక్తమవుతోంది. గతంలో మిగులు నిధులతో ఉన్న సంస్థ స్వరాష్ట్రంలో దివాళా తీయడం గమనార్హం. 

Updated Date - 2022-08-08T05:59:38+05:30 IST