సంగమేశ్వ‌వర, బసవేశ్వర పథకాలకు రుణాలు డౌటే!

ABN , First Publish Date - 2022-09-25T08:59:00+05:30 IST

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు రుణాలు లభించే విషయంలో సందిగ్ధం నెలకొంది.

సంగమేశ్వ‌వర, బసవేశ్వర పథకాలకు రుణాలు డౌటే!

  • రుణ పరిమితి దాటిపోయిందన్న నాబార్డు 
  • బసవేశ్వర ఫైలు ప్రాథమిక దశలోనే నిలిపివేత
  • సంగమేశ్వర ఫైలు నాబార్డు కార్యాలయానికి
  • ఇంకా భూసేకరణ దశలోనే ప్రాజెక్టుల పనులు
  • భూసేకరణకు రుణం ఇవ్వబోమన్న నాబార్డు
  • ప్రశ్నార్థకంగా మారిన పనుల కొనసాగింపు!

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు  రుణాలు లభించే విషయంలో సందిగ్ధం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న ఈ రెండు పథకాలకు నాబార్డు నుంచి తీసుకోవాలనుకున్న రూ.4427 కోట్ల రుణంపై కారుమేఘాలు కమ్ముకున్నాయి. ఈ రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతినివ్వగా.. ఈ పథకాలకు రాష్ట్రం రుణాలు తీసుకునే పరిమితి దాటిపోయిందని, ప్రధానంగా బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి రుణాలు ఇవ్వలేమని నాబార్డు తేల్చేసింది. ఓ ప్రయత్నంగా సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ఫైలును ముంబైలోని ప్రధాన కార్యాలయానికి పంపించింది. తొలుత బసవేశ్వరతోపాటు సంగమేశ్వర పథకానికి కూడా సరైన అనుమతులు లేనందున రుణాలు ఇవ్వలేమని నాబార్డ్‌ బెట్టు చేసింది. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగానే సంగమేశ్వర పథకాన్ని చేపడుతున్నామని అధికారులు తెలిపారు. గతంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల పథకంలో ఈ పథకం భాగమంటూ అనుమతి పత్రాలు సమర్పించారు. దీంతో హైదరాబాద్‌లోని నాబార్డ్‌ ప్రాంతీయ కార్యాలయం సంగమేశ్వర పథకం ఫైలును ముంబైకి పంపించింది. బసవేశ్వర పథకాన్ని మాత్రం కాళేశ్వరంలో భాగంగా చూపించే విషయంలో స్పష్టత లేకపోవడంతో పక్కనపెట్టారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్‌, సంగారెడ్డి, అందోల్‌ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో చెరువులను నింపి 2.19 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రతిపాదించారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం కింద నారాయణఖేడ్‌, అందోల్‌ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రతిపాదించారు. 


అత్యంత ఎత్తైన ప్రాంతానికి నీటి ఎత్తిపోత

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీ-19 కింద మల్లన్నసాగర్‌ నుంచి సింగూరు జలాశయంలోకి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి ప్యాకేజీ 19ఏ కింద సింగూరు బ్యాక్‌వాటర్‌ను సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా తరలించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం కింద 12 టీఎంసీలు, బసవేశ్వర కింద 8 టీఎంసీల జలాలను తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. తెలంగాణలో అత్యంత ఎత్తయిన ప్రాంతానికి నీటిని తరలించే ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టులో సంగారెడ్డి జిల్లాలోని మొగుడంపల్లి మండలం గోవిందాపూర్‌ గ్రామం సముద్ర మట్టానికి 665 మీటర్ల ఎత్తులో ఉంది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని రూ.2353.43 కోట్లతో, బసవేశ్వర పథకాన్ని రూ.1490.25 కోట్లతో చేపట్టేలా పనులను కాంట్రాక్టర్‌కు ఇప్పటికే అప్పగించి ఆర్నెల్ల కిందటే శంకుస్థాపన కూడా చేసేశారు. ఈ రెండు పథకాలకు 13 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. అయితే భూసేకరణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఎంత భూమి అవసరమవుతుందనే సర్వే మాత్రమే పూర్తయింది. భూసేకరణకు అయ్యే నిధులను కూడా రుణరూపంలో తీసుకోవాలని ప్రభుత్వం యోచించింది. కానీ, భూసేకరణకు రుణం ఇవ్వబోమని నాబార్డ్‌ ఇప్పటికే తేల్చేసింది. దాంతో నాబార్డ్‌పై ఆఽశలు పెట్టుకొని చేపట్టిన ఈ ప్రాజెక్టుల పనులు ప్రశ్నార్థకంగా మారాయి. నాబార్డ్‌ నుంచి రుణం దొరక్కపోతే పనులు ముందుకు కదిలే అవకాశాల్లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్‌ నుంచి నిధులు ఇచ్చే అవకాశాలు కూడా దాదాపుగా లేవు. 

Updated Date - 2022-09-25T08:59:00+05:30 IST