దా..రుణాలు

ABN , First Publish Date - 2022-07-03T05:53:26+05:30 IST

దా..రుణాలు

దా..రుణాలు

రుణాల మంజూరులో భారీగా మినహాయింపులు

ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఉద్యోగుల చేతివాటం

రూ.5 లక్షల అప్పుకు రూ.15 వేలు హాంఫట్‌

వాయిదాలు చెల్లించకపోతే దాడులు  

పోలీసులను ఆశ్రయిస్తే కాళ్ల బేరాలు 

నగరంలో పెరుగుతున్న కేసులు


చిట్టినగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో బంగారం తాకట్టుపెట్టి రూ.5 లక్షల రుణం తీసుకున్నాడు. వాస్తవానికి అతడి ఖాతాలోకి ఆ మొత్తం జమ చేయాలి. కానీ, అందులో రూ.15 వేలు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని జమ చేశారు. దీనిపై అతడు సిబ్బందిని అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పారు. కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే సరికి ఆ మర్నాడు రూ.15 వేలను జమ చేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘటన ఇది. 


కృష్ణలంకకు చెందిన వ్యక్తి ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో అప్పు తీసుకున్నాడు. నెలనెలా చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించడంలో వెనుకబడ్డాడు. వాయిదాలు చెల్లించాలని కంపెనీ ప్రతినిధులు పలుమార్లు ఫోన్‌ చేశారు. అయినా అతడు చెల్లించలేదు. ఆ మర్నాడు కంపెనీ ప్రతినిధులు నేరుగా ఇంటికి వచ్చి అతడిపై దాడి చేశారు. 

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : పీకల మీదకు వచ్చిన అవసరాల నుంచి తప్పించుకోవడానికి చాలామంది ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. వారికి మంజూరైన మొత్తాన్ని ఇవ్వకుండా కంపెనీల్లోని ఉద్యోగులు జిమ్మిక్కులు చేస్తున్నారు. ఈ మాయాజాలాలు ఇప్పుడు జోరుగా జరుగుతున్నాయి. బయట ఉన్న వడ్డీలను తట్టుకోలేక కొంతమంది ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టుకుని అవసరాలను తీర్చుకోవాలని చూస్తున్నారు. నగరంలో ఉన్న ప్రముఖ ఫైనాన్స్‌ కంపెనీల వద్దకు వెళ్లి రుణాలు తీసుకుంటున్నారు. ఆభరణాలకు తగ్గట్టుగా, అప్పటి మార్కెట్‌ ధరను బట్టి రుణం మంజూరు చేస్తున్నా.. మొత్తం సొమ్ము ఇవ్వడంలో మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. సత్యనారాయణపురంలో ఉన్న ఓ ప్రముఖ ఫైనాన్స్‌ కంపెనీలో జరిగిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి రూ.5 లక్షల రుణాన్ని బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకున్నాడు. రూ.5 లక్షలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన సిబ్బంది ఆ మొత్తాన్ని జమ చేయలేదు. అందులో రూ.15 వేలు మినహాయించుకుని రూ.4.85 లక్షలు ఖాతాలో వేశారు. ఆయన వెంటనే కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా, డబ్బు తక్కువగా ఉందనే కారణం చెప్పారు. తర్వాత 15 నిమిషాల్లో ఖాతాలో జమ చేస్తామన్నారు. మరో ఉద్యోగి అవసరం నిమిత్తం వాడుకున్నారని మరో కారణం చెప్పారు. అయినా డబ్బు జమ కాలేదు. దీనిపై ఆయన పలుమార్లు ఫోన్‌ చేసినా సిబ్బంది స్పందించలేదు. చివరికి మేనేజరును కలిసి విషయం చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. డబ్బు మాత్రం  ఇవ్వలేదు. చివరికి విసుగుచెందిన ఆ వ్యక్తి చెన్నైలోని కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మర్నాడు బాధితుడి ఖాతాలో రూ.15 వేలు జమ అయ్యాయి.

దారి కాసి దాడులు

ఇప్పటి వరకు వాయిదాలు చెల్లించమని పదేపదే అడిగిన ఫైనాన్స్‌ కంపెనీల ప్రతినిధులు నేరుగా భౌతికదాడులకు దిగుతున్నారు. ప్రైవేట్‌ బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల నుంచి అప్పులు తీసుకున్నవారు ప్రతినెలా వాయిదాలు చెల్లించాలి. రెండు, మూడు వాయిదాలు చెల్లించకపోయే సరికి ఏజెంట్లు ఇళ్లకు వచ్చి మరీ దాడులు చేస్తున్నారు. నగరంలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్సులో షాపును నిర్వహిస్తున్న యువకుడు ఓ ప్రైవేట్‌ బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాడు. దీనికి సంబంధించి వాయిదాలు చెల్లించకపోవడంతో కొద్దిరోజుల క్రితం అతడికి ఫోన్‌ వచ్చింది. అతడు బయట ఉన్నానని అడ్రస్‌ చెప్పగా, ఆ బ్యాంకు సిబ్బంది అక్కడికి వెళ్లి దాడి చేశారు. కృష్ణలంకలో ఓ ఆటోడ్రైవర్‌దీ ఇదే పరిస్థితి. ఫైనాన్స్‌ కంపెనీల్లోని ఉద్యోగులు రుణాల్లో మినహాయించుకుని సొంత అవసరాలు తీర్చుకుంటుంటే, ఏజెంట్లు మాత్రం వాయిదాల చెల్లింపుల  కోసం చేతులకు పని చెబుతున్నారు.

పోలీసుల దృష్టికి చేరని కేసులు

తీసుకున్న రుణాల్లో కోతలు పెడుతున్నా.. వాయిదాల కోసం ప్రైవేట్‌ బ్యాంకుల సిబ్బంది దాడులు చేస్తున్నా.. ఈ ఘటనలు పోలీసుల దృష్టికి రావట్లేదు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలిసేసరికి ఆయా సంస్థల్లోని సిబ్బంది రాజీకొస్తున్నారు. కట్టుకథలు చెప్పి కోతలు విధించిన సొమ్మును అప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. సిబ్బంది చెప్పినవన్నీ నమ్మి నోరెత్తకుండా ఇంటికి వెళ్లిన వారికి చుక్కలు చూపిస్తున్నారు. వాయిదాల చెల్లింపు కోసం దాడులు చేస్తున్న సిబ్బందిదీ ఇదే పరిస్థితి. కేసు నమోదు చేయకుండా ఉండేలా తప్పైనట్టు అంగీకరిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని హెచ్చరించి పంపేస్తున్నారు.


Updated Date - 2022-07-03T05:53:26+05:30 IST