పరిశ్రమల స్థాపనకు రుణాలు మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2022-06-30T05:17:12+05:30 IST

వ్యవసాయ మౌలిక సదుపాయాల యూనిట్ల స్థాపన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

పరిశ్రమల స్థాపనకు రుణాలు మంజూరు చేయాలి
రుణ ప్రణాళికను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, అధికారులు

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి 

సిరిసిల్ల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మౌలిక సదుపాయాల యూనిట్ల స్థాపన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో డీసీసీ సమావేశం నిర్వహించారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి 2692.45 కోట్లతో రూపాయలతో రూపొందించిన వార్షిక ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధించిన ప్రగతిని బ్యాంకుల వారీగా సమీక్షిస్తామన్నారు. ప్రతీబ్యాంక్‌ వ్యవసాయ, మౌలిక సదుపాయాల కల్పన యూనిట్లను మంజూ రు చేయాలని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన లక్ష్యంలో 109.70 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. 2242.58 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా 2467.75 కోట్లరూపాయలు ఇచ్చామ న్నారు. కొన్ని పారామీటర్లలో మంచి ఫలితాలు సాధించినప్పటికీ అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కేటగిరీలో ఒకరికి కూడా ఆర్థిక సహాయం అందజేయలేదని అన్నారు. అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మీద ఒత్తిడి చేస్తేనే వ్యవసాయం రంగం బలోపేతం అవుతుందని అన్నారు. ప్రస్తుతం బ్యాంకర్లు షార్ట్‌టర్మ్‌ వ్యవసాయ రుణాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నాయని దీర్ఘకాలిక వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా రుణాలను మంజూరు చేయాలని సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. బ్యాంకర్లు పరిశ్రమల స్థాపనకు ప్రజలు ముందుకు రావడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌, ఎంపీడీవోలు క్షేత్ర స్థాయిలో ప్రజలను చైతన్యం చేసి యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చే విధంగా రుణాలను సద్వినియోగం చేసుకునేలా చైతన్యం చేయాలని కలెక్టర్‌ అదేశించారు. పీఎం స్వానిధి రుణాల మంజూరులో మంచి పనితీరు కనబర్చారని బ్యాంకర్లను అభినందించారు. అదే స్ఫూర్తితో మిగతా పెండింగ్‌లో ఉన్నవాటిని కూడా పరిశీలించి రుణాలను త్వరగా మంజూరు చేయాలన్నారు. రుణాల మంజూరు అలసత్వం వహిస్తే సంబంధిత మెప్మా పీడీ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎస్సీ కార్పొరేషన్‌ కింద జిల్లాకు రెండు వేల పాడిగేదెల యూనిట్లు మంజూరు చేశామని, ఇప్పటికే 445 యూనిట్లకు బ్యాంక్‌ అంగీకార పత్రాలను ఇచ్చారన్నారు. యూనిట్ల గ్రౌండింగ్‌కు బ్యాంక ర్లు సహకరించాలన్నారు. ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి అసం ఘటిత రంగాల్లో ఉన్న కార్మికులందరికీ ఈ-శ్రమ్‌, జీవిత బీమా కల్పించాల్సిందిగా సూచించారు. అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు అసంఘటిత రంగాలకు వేర్వేరుగా కమిటీలు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ అధికారి  రంగారెడ్డిని ఆదేశించారు.  వంద శాతం బ్యాంక్‌  లావాదేవీలు  డిజిటలైజేషన్‌ జిల్లాగా  సిరిసిల్లను  గుర్తించినందుకు  బ్యాంకర్లను అభినందించారు. 

- ‘రైతు బంధు’ను ఫ్రీజ్‌ చేయవద్దు..

వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు ద్వారా అందిస్తున్న సాయాన్ని ఫ్రీజ్‌ చేయవద్దని కలెక్టర్‌ సూచిం చారు. పంట పెట్టుబడి ఆర్థిక సాయం పొందిన బ్యాంకర్లు రైతుల బకాయిలకు సర్దుబాటు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని సర్దుబాటు చేయడం కానీ, ఫ్రీజ్‌ చేయడం కానీ చేయవద్దని అన్నారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం బ్యాంక్‌ల నుంచి పంట రుణాలు పొందిన రైతులు తమ రుణాలను రెన్యూవల్‌ చేసుకోవాలని అన్నారు. 

- రూ 2692.45 కోట్లతో రుణ ప్రణాళిక

జిల్లాలో లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో 2022-23 అర్థిక సంవత్సరం రుణ ప్రణాళికను రూ 2692.45 కోట్లతో రూపొందించారు. ఇందులో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు 1945.98 కోట్ల రూపాయలు కేటాయించారు. చిన్న, మధ్య తరహ, మైక్రో పరిశ్రమకు  566.50 కోట్లు, విద్య, హౌజింగ్‌, ఇతర అవసరాలకు  51.98 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్‌, ఎం ఖీమ్యానాయక్‌, లీడ్‌ బ్యాంక్‌ అధికారి రంగారెడ్డి, డీఏవో రణధీర్‌కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వినోద్‌కుమార్‌, జిల్లా గిరిజన అభివృద్ధి అఽధికారి గంగరాం, డీఐసీ జీఎం ఉపేందర్‌రావు, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, యూబీఐ డీజీఎం అరుణ్‌కుమార్‌, టీజీబీ డీజీఎం గంగాధర్‌, కేడీసీసీ డీజీఎం వెంకటస్వామి, ఆర్‌బీఐ ఏజీఎం రాజేంద్రప్రసాద్‌, నాబార్డ్‌ డీడీఎం మనోహర్‌రెడ్డి, బ్యాంక్‌ మేనేజర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:17:12+05:30 IST