స్థానికం.. నిర్వీర్యం!

ABN , First Publish Date - 2022-09-23T05:06:03+05:30 IST

స్థానిక సంస్థల పాలనను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఉన్న నిధులను లాగేసుకోవడంతోపాటు కరెంట్‌ బిల్లులు కట్టించడంతో గ్రామ పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. ఎటువంటి పనులు చేయలేక ఇబ్బందిపడుతుండగా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సాధారణ నిధుల కేటాయింపు చూసి సర్పంచ్‌లు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో వసూలు చేసే వివిధ రకాల పన్నులను ప్రభుత్వానికి జమ చేసిన తర్వాత తిరిగి గ్రామ పంచాయతీలకు వాటా ప్రకారం కేటాయిస్తుంది.

స్థానికం.. నిర్వీర్యం!
గ్రామ పంచాయతీ

గ్రామ పంచాయతీలకు భారీగా గ్రాంటు కోత

జనరల్‌ ఫండ్‌ కేటాయింపుల్లో ప్రభుత్వం దొంగ నాటకాలు

గతంలో 3 వేల జనాభా ఉన్న పంచాయతీకి రూ.30వేలు గ్రాంటు

ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చింది రూ.6వేలే

ఒక్కొక్కరికి ఇచ్చింది కేవలం రూపాయే

ఆందోళన వ్యక్తం చేస్తున్న సర్పంచ్‌లు

పనులు ఎలా చేయాలంటూ ఆవేదన

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 22 : 


స్థానిక సంస్థల పాలనను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఉన్న నిధులను లాగేసుకోవడంతోపాటు కరెంట్‌ బిల్లులు కట్టించడంతో  గ్రామ పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. ఎటువంటి పనులు చేయలేక ఇబ్బందిపడుతుండగా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సాధారణ నిధుల కేటాయింపు చూసి సర్పంచ్‌లు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో వసూలు చేసే వివిధ రకాల పన్నులను ప్రభుత్వానికి జమ చేసిన తర్వాత తిరిగి గ్రామ పంచాయతీలకు వాటా ప్రకారం కేటాయిస్తుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న డబ్బులను కూడా తిరిగి కేటాయించేందుకు సుముఖంగా లేదన్న విషయం ప్రస్తుతం కేటాయించిన నిధులను చూస్తేనే అర్థమవుతోంది. ఇలాగైతే పంచాయతీల్లో ఎటువంటి పనులను చేయలేమని సర్పంచ్‌లు, కార్యదర్శులు వాపోతున్నారు.

రోజురోజుకు స్థానిక పాలన పడకేస్తోంది. నిధులు, అధికారాల విషయంలో రానురాను పరిస్థితి దారుణంగా తయారవుతోంది.  గ్రామపంచాయతీలకు కేటాయించే గ్రాంటు తగ్గించడమే అందుకు నిదర్శం. ప్రభుత్వం తాజాగా జనాభా గ్రాంటు, ప్రొబిషన్‌ ట్యాక్స్‌ రెండు క్వార్టర్లను జిల్లాకు కేటాయించింది. ఈ పద్దుల కింద ప్రభుత్వం రూ.97లక్షలు మాత్రమే కేటాయించింది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనాభా గ్రాంటు కింద రూ.37.01 లక్షలు కేటాయించగా, ప్రోబిషన్‌ ట్యాక్స్‌ కింద రూ.64.06 లక్షలు కేటాయించారు. సాధారణంగా ఈ రెండు గ్రాంట్ల కింద ఈ రెండు క్వార్టర్లు కలిపి సుమారు రూ.16 కోట్లు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మొక్కుబడిగా కేవలం రూ.కోటిలోపే కేటాయింపు చేసిందంటే గ్రామపంచాయతీల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 


జిల్లాలో 16లక్షల మంది జనాభా

జిల్లాల పునర్విభజన అనంతరం 730 గ్రామ పంచాయతీలు ఉండగా 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 16 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆ ప్రాతిపదికన ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్రప్రభుత్వం భారీగా నిధుల కేటాయింపులో కోత విధించింది. గతంలో సరాసరిన ఒక్కొక్కరికి ఒక క్వార్టర్‌ (మూడు నెలలకు ఒకసారి) రూ.10 నుంచి రూ.12 కేటాయించగా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కేవలం రూపాయి మాత్రమే కేటాయింపు చేసింది అంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. 


గతంలో రూ.10 నుంచి రూ.12 కేటాయింపు

కాగా గత ప్రభుత్వ హయాంలో జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా పద్దుల కింద ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.12ను కేటాయించారు. ఆ విధంగా మూడు వేల జనాభా ఉన్న పంచాయతీ ఉంటే దానికి ఒక్కొక్క క్వార్టర్‌కు రూ.30 వేల నుంచి రూ.35వేల చొప్పున రెండు క్వార్టర్లకు కలిపి రూ.70వేల వరకు ఆ పంచాయతీకి నిధులు సమకూరుతాయి. అలా ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులతో గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టేవారు. అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేసే దిశగా శ్రీకారం చుట్టింది. అందుకు తాజాగా ఇప్పుడు కేటాయించిన నిధులే అందుకు తార్కాణం.


ప్రస్తుత ప్రభుత్వం రూ.2నే కేటాయింపు

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తాజాగా కేటాయించిన జనరల్‌ ఫండ్స్‌ నిధుల కేటాయింపు చూస్తే పాలక వర్గాలు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనాభా గ్రాంటు కింద ఒక్కొక్కరికి రూపాయి చొప్పున రెండు క్వార్టర్లకు కలిపి కేవలం రూ.2  మాత్రమే కేటాయించింది. అంటే 3వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి ఈ పద్దు కింద రెండు క్వార్టర్లు కలిపి కేవలం రూ.6 వేలు మాత్రమే మంజూరు చేసింది. ఇక  ప్రొబిషన్‌ ట్యాక్స్‌ కింద రూ.12వేలు మాత్రమే మంజూరుచేసింది. ఈ రెండు క్వార్టర్లకు కలిపి మూడు వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.18వేలు కేటాయించడంతో పంచాయతీల్లో ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లుల చెల్లింపు ఏలా చేయాలని, కొత్తగా పనులు చేపట్టాలంటే పరిస్థితి ఏమిటి అనేది పాలకవర్గాలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 


Updated Date - 2022-09-23T05:06:03+05:30 IST