మినీ సం..గ్రామం

ABN , First Publish Date - 2021-11-14T05:18:13+05:30 IST

మినీ సం..గ్రామం

మినీ సం..గ్రామం

నేటి నుంచి మూడు రోజులు జిల్లాలో ఎన్నికల సందడి

నేడు నాలుగు పంచాయతీలకు..

రేపు జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీలకు..

ఎల్లుండి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు 

హోరాహోరీగా తలపడుతున్న అధికార, విపక్షాలు 

ధనబలాన్ని ప్రయోగిస్తున్న అధికార పక్షం 

పలుచోట్ల బలవంతపు ఏకగ్రీవాలు 

ప్రభుత్వ వ్యతిరేకతపై విపక్షాల ఆశలు 


జిల్లాలో నేటి నుంచి మినీ సంగ్రామం మొదలుకానుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఆదివారం నుంచి తెరలేచింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎన్నికలకు అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. వైసీపీ, టీడీపీ మధ్య పోరు నువ్వానేనా.. అన్నట్టుగా ఉంటే, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పరిమిత స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బలం నిరూపించుకోవటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తేటతెల్లం చేయాలని టీడీపీ, జనసేన గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, ఈ ఎన్నికల్లో కూడా నయానో భయానో విజయం సాధించాలని అధికార పక్షం పావులు కదుపుతోంది. 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఐదు పంచాయతీల్లో  నేడు (ఆదివారం) నాలుగింటికి ఎన్నికలు జరగనున్నాయి. కలిదిండి మండలం అమరావతి గ్రామ పంచాయతీని వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన వాటిలో కలిదిండి మండలంలోని కలిదిండి, ముదినేపల్లి మండలంలోని ములకలపల్లి, నందివాడ మండలంలోని పోలుకొండ, ఘంటసాల మండలంలోని మల్లంపల్లి సర్పంచ్‌ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. ఈ నాలుగు స్థానాల్లో ప్రతిపక్షాలు గట్టిగా నిలబడటంతో బలవంతపు ఏకగ్రీవాలు చేయాలన్న అధికార పక్షం ప్లాన్‌ ఫలించలే దు. ఈ నాలుగు పంచాయతీ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది బరిలో ఉన్నారు.

మూడు రోజులు ఎన్నికల వేడి

జిల్లాలో 41 పంచాయతీ వార్డులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, 11కే ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన 30 అధికారపక్ష బలవంతంతో ఏకగ్రీవాలయ్యాయి. 11 వార్డుల్లో పోటీ తప్పట్లేదు. ఈ వార్డులకు గానూ మొత్తం 23 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల కోసం బంటుమిల్లి మండలంలో 11, కలిదిండి పంచాయతీలో 11, ములకలపల్లిలో 1, పోలకొండలో 5, మల్లంపల్లిలో ఒక పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. కాగా, ఆదివారం జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారి ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు వేస్తారు. 16న జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్లీ వారే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉండటంతో ఆ రోజు ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేస్తారు. 

జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో హోరాహోరీ

ఈనెల 15వ తేదీ సోమవారం జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులకు 184 నామినేషన్లు వేయగా, ఉపసంహరణ అనంతరం 95 మంది బరిలో ఉన్నారు. వైసీపీ 31, టీడీపీ 31, జనసేన 3, బీజేపీ 9, ఇండిపెండెంట్లు 21 మంది చొప్పున బరిలో ఉన్నారు. జగ్గయ్యపేటలో వైసీపీ, టీడీపీ మధ్య రసవత్తరమైన పోటీ జరగనుంది. ఇక కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులకు 229 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఏడు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 222 మందిలో 89 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా, 113 మంది బరిలో ఉన్నారు. వైసీపీ 29, టీడీపీ 29, బీజేపీ 15, జనసేన 12, సీపీఎం 3, సీపీఐ 1, ఇండిపెండెంట్లు 17, కాంగ్రెస్‌ 7 బరిలో ఉన్నారు. ఇక్కడ అధికార పక్షం ధనబలాన్ని ప్రయోగిస్తుండగా, విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకతపై దృష్టిపెట్టాయి. వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఈనెల 17న జరుగుతుంది. 

ఉత్కంఠగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

ఇక ఈనెల 16వ తేదీన  మిగిలిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో జిల్లాలో పెడన, విస్సన్నపేట, జి.కొండూరు జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. పెడన జడ్పీటీసీ ఎన్నిక ఆసక్తిని రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి వివాదంలో ఉన్న పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో జడ్పీటీసీ పోటీకి టీడీపీ గట్టి అభ్యర్థిని నిలబెట్టింది. ఈ పోరులో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. విస్సన్నపేట జడ్పీటీసీ బరిలో వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం అభ్యర్థులు ఉన్నారు. జి.కొండూరు జడ్పీటీసీకి వైసీపీ, టీడీపీ, జనసేన, బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఎంపీటీసీల విషయానికొస్తే మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలకు 18 మంది పోటీలో ఉన్నారు. నాగాయలంక మండలం పర్రచివర ఎంపీటీసీ, ముదినేపల్లి మండలం ముదినేపల్లిలో 2 స్థానాలు, వణుదర్రు, గన్నవరం మండలంలో చిన అవుటపల్లి స్థానం, పెనుగంచిప్రోలు మండలంలో కొణకంచి, నూజివీడు మండలంలో దేవరకుంట, ఆగిరిపల్లి మండలం ఈదర ఎంపీటీసీ స్థానాలకు అధికార పక్షానికి విపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. 

ఓటుకు రూ.5వేలు  : కొండపల్లిలో ధనప్రవాహం

కొండపల్లి (ఇబ్రహీంపట్నం) : కొండపల్లి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి శనివారం తెర పడింది. కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలని మైలవరం ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నారు. 29 వార్డుల్లో తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తమ గెలుపు అంత సులువు కాదని భావించిన  ఆ ప్రజాప్రతినిధి సుమారు రూ.5 కోట్ల వరకు సిద్ధం చేసుకుని ఓట్లు కొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కరెన్సీ నోట్లు సగం చించి ఇచ్చి, ఓటు వేశాక వస్తే రూ.2వేలు ఇస్తామని చెప్పిన మాటలు జనం నమ్మలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు తెరలేపారు. 

పక్కా ఏర్పాట్లు  : అధికారులతో కలెక్టర్‌ నివాస్‌ సమావేశం

జిల్లాలో జరగనున్న రెండు మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎక్కడా అలసత్వానికి తావు ఇవ్వకూడదన్నారు. సిబ్బందిపై ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల సామగ్రి తరలింపు సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించారు. కౌంటింగ్‌ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని, పోలింగ్‌కు వెబ్‌ కాస్టింగ్‌ చేయించాలని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, కె.మోహన్‌కుమార్‌, శ్రీవాస్‌ నుపూర్‌, జడ్పీ సీఈవో సూర్య ప్రకాశరావు, సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-14T05:18:13+05:30 IST