English లో మాట్లాడితే న్యాయవాదికి ఎక్కువ గౌరవమనేది సరికాదు: కేంద్ర మంత్రి రిజుజు

ABN , First Publish Date - 2022-07-16T23:47:48+05:30 IST

శనివారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన ‘18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ’ అనే కార్యక్రమంలో రిజుజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ‘‘ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు మధ్య సత్సంభందాలు ఉండాలి. దాని వల్ల ప్రజలకు సత్వర న్యాయంతో పాటు మరింత ఎక్కువ న్యాయం జరుగుతుంది. ఏ కోర్టు కూడా ప్రత్యేకాధికారుల..

English లో మాట్లాడితే న్యాయవాదికి ఎక్కువ గౌరవమనేది సరికాదు: కేంద్ర మంత్రి రిజుజు

న్యూఢిల్లీ: హైకోర్టు సహా దిగువ కోర్టుల్లో(high courts and lower courts) వాదనలు, తీర్పులు స్థానిక భాషల్లో(regional and local languages) పెరిగేలా ప్రయత్నించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు(Union Law Minister Kiren Rijiju) అన్నారు. అయితే సుప్రీంకోర్టులో మాత్రం ఇంగ్లీషులో కొనసాగించుకోవచ్చని ఆయన అన్నారు. శనివారం ఆయన ఈ విషయమై మాట్లాడుతూ ఇంగ్లీషులో మాట్లాడితే న్యాయవాద వృత్తికి ఎక్కువ గౌరవం ఉంటుందని, ఎక్కువ కేసులతో పాటు పెద్ద మొత్తంలో ఫీజు వస్తుందనేదానికి తాను సముఖంగా లేనని అన్నారు. ఏ మాతృభాషనైనా ఇంగ్లీషు కంటే తక్కువగా పరిగణించకూడదని రిజుజు సూచించారు.


శనివారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన ‘18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ’ అనే కార్యక్రమంలో రిజుజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ‘‘ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు మధ్య సత్సంభందాలు ఉండాలి. దాని వల్ల ప్రజలకు సత్వర న్యాయంతో పాటు మరింత ఎక్కువ న్యాయం జరుగుతుంది. ఏ కోర్టు కూడా ప్రత్యేకాధికారుల కోసం మాత్రమే ఉండకూడదు, న్యాయం తలుపులు అందరికీ సమానంగా తెరిచి ఉండాలి. సుప్రీం కోర్టులో వాదనలు, తీర్పులు ఇంగ్లీషులో ఉంటాయి. అయితే హైకోర్టు సహా దిగువ స్థాయి కోర్టుల్లో ప్రాంతీయ, స్థానిక భాషలకు ప్రాధాన్యం ఉండాలి’’ అని అన్నారు.


ఈ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో న్యాయవ్యవస్థలోని సుమారు 70 చట్టాలను రద్దు యనున్నట్లు రిజుజు ప్రకటించారు. దేశంలో పెండింగ్ కేసుల పట్ల కిరణ్ రిజుజు ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ కేసులు ఐదు కోట్లకు పెరగబోతున్నాయని, ఇది న్యాయ వ్యవస్థకు అత్యంత భారంగా మారనుందని, ప్రభుత్వంతో సమన్వయం అయితే ఈ కేసుల సంఖ్యను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.


స్థానిక భాషలో కోర్టుల్లో వాదనలు, తీర్పులు జరగాలనేది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఇది ఆచరణలోకి రాలేదు కానీ, అప్పుడప్పుడు రాష్ట్రాల్లోకి కోర్టులు కొన్ని ప్రత్యేక సందర్భాల్ని పురస్కరించుకుని స్థానిక భాషల్లో తీర్పులు ఇస్తుంటాయి. కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. కోర్టు తీర్పులు సమాజంపై విశేష ప్రభావం చూపిస్తాయని, అవి సరళంగా, స్పష్టంగా, సాధారణ భాషలో ఉండాలని అన్నారు. హైకోర్టుల్లో స్థానిక భాషల అమలుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయన్న ఆయన ఈ సమస్యకు త్వరలో పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.


మూడేళ్ల క్రితం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సైతం కోర్టుల్లో స్థానిక భాషలో తీర్పులు, వాదనలు జరగాల్సిన ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. ప్రజలందరూ అర్థం చేసుకునే విధంగా హైకోర్టు తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. చట్టాన్ని అర్థం చేసుకోవడం, దానిని అన్వయించడం అన్నది దశాబ్దాలుగా ఒక సంక్లిష్ట ప్రక్రియగా మారుతూ వస్తోందని పేర్కొన్నారు. సామాన్య ప్రజ లు సైతం అర్థం చేసుకునేలా న్యాయ పరిభాషను పెంపొందించాలని, అలాగే నియమనిబంధనలను సరళీకరించాలని ఆయన అన్నారు. ప్రజల వద్దకు న్యాయాన్ని తీసుకెళ్లడమే కాకుండా సంబంధిత వాది, ప్రతివాదులకు అర్థమయ్యే రీతిలోనే భాషలోనే తీర్పులు ఉండడం ఎంతో అవసరమని కోవింద్ అన్నారు.

Updated Date - 2022-07-16T23:47:48+05:30 IST