చుట్టుముట్టి, కోడిగుడ్లు విసిరి.. ఎమ్మెల్యేపై జనం దాడి

ABN , First Publish Date - 2022-05-01T08:17:27+05:30 IST

సొంత పార్టీకి చెందిన వారైనా సరే! స్వయంగా హోంమంత్రికి అనుచరుడైనా సరే! ‘మమ్మల్ని ప్రశ్నిస్తే ఊరుకోం. మా దారికి అడ్డొస్తే... అడ్డు తొలగించేస్తాం’ అంటూ చెలరేగిపోయారు. గ్రామంలో సీనియర్‌ వైసీపీ నాయకుడిని... పట్టపగలు ఫ్యాక్షన్‌ తరహాలో నరికి చంపారు.

చుట్టుముట్టి, కోడిగుడ్లు విసిరి..  ఎమ్మెల్యేపై జనం దాడి

తరిమి తరిమి కొట్టారు

మృతుడు హోంమంత్రి తానేటి వనిత అనుచరుడు

పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేపై స్థానికుల దాడి

అతి కష్టంమీద వెంకట్రావును కాపాడిన పోలీసులు

తనపై దాడి టీడీపీ పనే అని ఎమ్మెల్యే బుకాయింపు

కాదు.. తామే తరికొట్టామన్న వైసీపీ వర్గీయులు

వైసీపీ నాయకుల మధ్య వర్గపోరుకు ఒకరు బలి

ఏలూరు జిల్లాలో ‘ఫ్యాక్షన్‌’ తరహా హత్య

వేట కొడవళ్లతో నరికి చంపిన దుండగులు

ఎమ్మెల్యే వెంకట్రావు వర్గం పనే అని అనుమానం


వైసీపీలో వర్గపోరు హద్దులు దాటింది. సొంత పార్టీ నాయకుడినే దారుణంగా హత్యచేసే స్థాయికి చేరింది. హత్యకు గురయింది... స్వయానా రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత వర్గీయుడు! ఏలూరు జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అనుచరులే ఈ హత్య చేశారంటూ స్థానిక వైసీపీ నేతలు, గ్రామస్థులు భగ్గుమన్నారు. ‘పరామర్శ’కు వచ్చిన ఎమ్మెల్యే వెంకట్రావుపై మూకుమ్మడిగా దాడి చేసి... తరిమి కొట్టారు! ఇక శనివారం అనేక దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం దద్దరిల్లింది. నవ్యాంధ్ర... హింసాంధ్రగా మారింది.


(ఏలూరు - ఆంధ్రజ్యోతి)

సొంత పార్టీకి చెందిన వారైనా సరే! స్వయంగా హోంమంత్రికి అనుచరుడైనా సరే! ‘మమ్మల్ని ప్రశ్నిస్తే ఊరుకోం. మా దారికి అడ్డొస్తే... అడ్డు తొలగించేస్తాం’ అంటూ చెలరేగిపోయారు. గ్రామంలో సీనియర్‌ వైసీపీ నాయకుడిని... పట్టపగలు ఫ్యాక్షన్‌ తరహాలో నరికి చంపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం ఈ ఘోరం జరిగింది. స్థానిక వైసీపీ నేత గంజి ప్రసాద్‌(58)ను దారుణంగా చంపేశారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అనుచరులే ఈ హత్య చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. బాధితులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం....


వైసీపీ గ్రామస్థాయి నాయకులైన గంజి ప్రసాద్‌, బజారయ్య మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. పదిరోజుల క్రితం ప్రసాద్‌ అనుచరుడిని బజారయ్య అనుచరులు దాడిచేసి గాయపరిచారు. అప్పటి నుంచి వివాదం మరింత ముదిరింది. శనివారం ఉదయం 7గంటలకు గంజి ప్రసాద్‌ పాలకోసం బైక్‌పై బయటికి వచ్చారు. ఆయన కదలికలను గమనిస్తున్న వ్యక్తి... ఫోన్‌ ద్వారా ఆ సమాచారాన్ని మరో ఇద్దరికి తెలియచేశారు. ప్రసాద్‌ వంద మీటర్లు రాగానే... ఇద్దరు వ్యక్తులు మరోబైక్‌పై వచ్చి ఆయనను ఢీకొట్టారు. ఆయన కింద పడిపోతుండగానే... కత్తులు, వేటకొడవళ్లతో దాడికి దిగారు. మెడ, చేతులు, శరీరంపైన ఇతర భాగాలపై వేటు వేశారు. కత్తి వేటు దాటికి ప్రసాద్‌ చెయ్యి ఒకటి వేరైపోయింది. మెడ దాదాపుగా తెగిపోయి... మొండేనికి వేలాడుతోంది. ప్రసాద్‌ గిలగిలా కొట్టుకుంటూ అక్కడే ప్రాణాలు వదిలేశారు. ప్రసాద్‌ కదలికలపై సమాచారం ఇచ్చిన వ్యక్తితోపాటు మిగిలిన ఇద్దరు ఒకే బైక్‌పై పారిపోయారు. ఉండ్రాజవరపు మోహన్‌, మండవల్లి సురేశ్‌, శానం హేమంత్‌... హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.


ఎమ్మెల్యేపై దాడి..

ప్రసాద్‌ హత్య గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకట్రావు ఉదయం 10గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న స్థానికులు, ప్రసాద్‌ అనుచరులు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఆయన కారు దిగగానే ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ప్రసాద్‌ హత్యకు కారణం నీ అనుచరుడే’ అని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. 250మందికిపైగా ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. ఆయన తల, ముఖంపై కొట్టారు. తోపులాటలో కిందపడ్డ ఎమ్మెల్యేను మహిళలు సైతం కాళ్లతోతన్నారు. చొక్కాను చించేశారు. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు విసిరారు.


ఎమ్మెల్యేకు చెందిన రెండు సెల్‌ఫోన్లను పగులగొట్టారు. పెద్దసంఖ్యలో పోలీసులు ఉన్నా పరిస్థితిని చక్కదిద్దలేకపోయారు. ఎమ్మెల్యేను అతికష్టంమీద స్థానికంగా ఉన్న పాఠశాలలోకి తీసుకెళ్లారు. అప్పటికీ... స్థానికులు వదల్లేదు. ఎస్పీ రాహుల్‌దేవ్‌ అక్కడికి చేరుకుని.. అందరికీ సర్ది చెప్పారు. ఎమ్మెల్యేను కారు ఎక్కించి అక్కడినుంచి పంపించారు.  నిందితులను అరెస్టు చేసేదాకా ప్రసాద్‌ మృతదేహాన్ని తరలించేందుకు వీల్లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన అంబులెన్స్‌ టైర్‌ గాలిని తీసేశారు. గ్రామస్తులకు సర్దిచెప్పిన పోలీసులు అంబులెన్స్‌ టైర్‌ మార్పించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు తరలించారు. కాగా, ‘‘నా భర్త చావుకు ఎమ్మెల్యే వెంకట్రావు, స్థానిక ఎస్‌ఐలే కారణం. వాళ్లిద్దరూ కలిసే హత్య చేయించారు’’ అని ప్రసాద్‌ భార్య సత్యవతి ఆరోపించారు. 




ప్రశ్నించినందుకే చంపేశారు

‘‘అధికార పార్టీలో అరాచకాలను ప్రశ్నించినందుకే మా నాన్నను చంపేశారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఇది జరిగింది. మా గ్రామానికి చెందిన బజారయ్య, రెడ్డి సత్యనారాయణ, మరికొంతమంది ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు. చైన్‌స్నాచింగ్‌,  దొంగతనాలను కూడా చేయిస్తున్నారు. ఒకప్పుడు సైకిల్‌ కూడా లేని వాళ్లు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. వీరి అరాచకాలపై ఫిర్యాదు చేసినందుకే మా నాన్నపై కక్ష పెంచుకున్నారు. స్థానిక పరిస్థితులను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదు!’’

ఉదయ ఫణికుమార్‌ (గంజి ప్రసాద్‌ తనయుడు)

Updated Date - 2022-05-01T08:17:27+05:30 IST