అరుణాచల్ ప్రదేశ్‌ నదిని పాడు చేస్తున్న చైనా!

ABN , First Publish Date - 2021-10-30T23:56:45+05:30 IST

అరుణాచల్ ప్రదేశ్‌లోని కామెంగ్ నది అకస్మాత్తుగా

అరుణాచల్ ప్రదేశ్‌ నదిని పాడు చేస్తున్న చైనా!

ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లోని కామెంగ్ నది అకస్మాత్తుగా నల్లగా మారిపోవడంతో వేలాది చేపలు మరణించాయి. దీనికి కారణం చైనా దుశ్చర్యలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. టోటల్ డిజాల్వ్‌డ్ సబ్‌స్టాన్సెస్ పెద్ద మొత్తంలో కలవడం వల్లే ఇలా జరిగిందని ఈస్ట్ కామెంగ్ జిల్లా అధికారులు శనివారం మీడియాకు చెప్పారు. 


జిల్లా మత్స్య అభివృద్ధి శాఖ అధికారి హలి టజో శనివారం మీడియాతో మాట్లాడుతూ, కామెంగ్ నదిలో శుక్రవారం వేలాది చేపలు మరణించాయని చెప్పారు. నదిలో నీరు హఠాత్తుగా నల్లగా మారిందని, దీనికి కారణం టోటల్ డిజాల్వ్‌డ్ సబ్‌స్టాన్సెస్ (టీడీఎస్) పెద్ద మొత్తంలో కలవడమేనని తెలిపారు. టీడీఎస్ వల్ల చేపలు, ఇతర జలచరాలు శ్వాస పీల్చుకోవడం సాధ్యం కాదన్నారు. లీటరు నీటిలో 300 నుంచి 1,200 మిల్లీ గ్రాముల వరకు టీడీఎస్ ఉండటం ప్రమాదకరం కాదని, ప్రస్తుతం ఇది 6,800 మిల్లీ గ్రాములు ఉందని చెప్పారు. మరణించిన చేపలను తినవద్దని ప్రజలను కోరారు. వీటిని తింటే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. 


ఈస్ట్ కామెంగ్ జిల్లా అధికారులు కూడా ప్రజలకు మార్గదర్శకాలను విడుదల చేశారు. శుక్ర, శనివారాల్లో మరణించిన చేపలను తినవద్దని కోరారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ నదిలో చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు. 


జిల్లా ముఖ్య పట్టణం సెప్పా నివాసులు మాట్లాడుతూ, చైనా కారణంగానే కామెంగ్ నది నీరు నల్లగా మారిందని చెప్పారు. చైనా యథేచ్ఛగా నిర్మాణ కార్యకలాపాలను  జరుపుతోందన్నారు. సెప్పా ఈస్ట్ ఎమ్మెల్యే టపుక్ టకు మాట్లాడుతూ, తక్షణమే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఈ నది నీరు నల్లగా మారడానికి కారణాలను తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 


Updated Date - 2021-10-30T23:56:45+05:30 IST