లాక్‌డౌన్‌ ప్లీజ్‌...

ABN , First Publish Date - 2021-05-11T06:04:51+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ సమాజాన్ని అతలాకుతలం చేస్తుండటంతో లాక్‌డౌన్‌ విధించాలనే డిమాండ్‌ భిన్న వ ర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వం దలాదిమంది కొవిడ్‌ కోరలకు చిక్కి ప్రాణాలు కోల్పో వడంతో లాక్‌డౌన్‌ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమనే వాదన వ్యక్తమవుతోంది.

లాక్‌డౌన్‌ ప్లీజ్‌...

కరోనా ఉధృతితో ముక్తకంఠంతో విన్నవిస్తున్న ప్రజలు

ఇప్పటికే పలు గ్రామాల్లో స్వీయ లాక్‌డౌన్‌లు

ఉల్లంఘించిన వారికి గ్రామ పంచాయతీల జరిమానాలు

ఉదయం 6 నుంచి 12 గంటల వరకే షాపులకు అనుమతి

లాక్‌డౌన్‌ ఉన్న ప్రాంతాల్లో నియంత్రణలో కరోనా 

వరంగల్‌ నగరంలో అమలుకాని కొవిడ్‌ నిబంధనలు

తూతూ మంత్రంగా రాత్రి కర్ఫ్యూ 

వైన్‌షాపులు, బార్‌షాపులు, షాపింగ్‌ మాల్స్‌ కిటకిట

రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా బాధితులు


ఆంధ్రజ్యోతి, హన్మకొండ

కరోనా సెకండ్‌ వేవ్‌ సమాజాన్ని అతలాకుతలం చేస్తుండటంతో లాక్‌డౌన్‌ విధించాలనే డిమాండ్‌ భిన్న వ ర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వం దలాదిమంది కొవిడ్‌ కోరలకు చిక్కి ప్రాణాలు కోల్పో వడంతో లాక్‌డౌన్‌ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమనే వాదన వ్యక్తమవుతోంది. 

గత సంవత్సరం మొదటి వేవ్‌ సందర్భంగా కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసింది. ప్రజలు బయట తిరగకుండా అన్ని ప్రధాన రహదారులను పోలీసులు దిగ్బంధించారు. అడుగడుగునా బారికేడ్లను ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించినవా రిని లాఠీలతో చితకబాదారు. కేసులు సైతం పెట్టారు. దీం తో జనం బయటకు రావడానికి జంకారు. ఫలితంగా కరోనా అదుపులోకి వచ్చింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలను లెక్కిస్తోంది. నియంత్రణ లేక ప్రజలు బయట విచ్చల విడిగా తిరుగుతున్నారు. మాస్క్‌లు కూడా సరిగా ధరించ డం లేదు. వైన్‌షాపులు, బార్లు బార్లా తెరవడంతో మందు బాబులు మద్యం తాగి చిందులేస్తున్నారు. హోటళ్ళు, రెస్టారెంట్లు కిటకిటలాడుతున్నాయి. పట్టణాల్లో దుకాణా లను రాత్రి పొద్దుపోయే వరకు తెరిచి ఉంచుతున్నారు. కూరగాయల మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ జాతరను తలపింప చేస్తున్నాయి. దీంతో కరోనా విజృంభిస్తోంది.  


మొదటి వేవ్‌ కన్నా రెండో వేవ్‌లో కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. ఆక్సిజన్‌ అందక వందలాది మం ది మృత్యువాత పడుతున్నా ప్రభుత్వాలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి.  ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతా ల్లో ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వీయ నిర్బంధం విధించుకుంటున్నారు. గ్రామాలకు గ్రామాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ అమలు చేసుకుంటున్నాయి.  మ ధ్యాహ్నం 12 గంటలకే షాపులు మూసివేస్తున్నారు. ఫలి తంగా ఆయా ప్రాంతాల్లో కరోనా అదుపులోకి వస్తున్నట్టు చెబుతున్నారు. 


స్వీయ లాక్‌డౌన్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అనేక చోట్ల గత  పదిహేను రోజులుగా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలవుతోంది. కొన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను పాటిస్తుం డగా, మరికొన్ని గ్రామాల్లో పాక్షికంగా విధించు కుంటున్నారు. వ్యాపారస్తులతో గ్రామ పంచాయతీ ప్రతిని ధులు చర్చించి లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రాల్లో వ్యాపారులు లాక్‌ డౌన్‌లో భాగంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్వచ్ఛం దంగా తమ దుకాణాలను మూసివేస్తున్నారు. లాక్‌డౌన్‌ అమ లు చేయడంలో గ్రామ పంచాయతీలు చొరవ తీసుకుంటున్నాయి. వేటికవి తీర్మానం చేసి గ్రామాల్లో లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. గ్రామాలకు కొత్తవారిని రాకుం డా కంచెలు వేస్తున్నాయి. కొవిడ్‌ను కట్టడి చేసేందుకు ప్రజలు స్వీయనియంత్రణ పాటించడమే కాకుండా లాక్‌డౌన్‌ అమలుకు కఠిన నిర్ణయాలు  తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 500 నుంచి రూ. 1000 వరకు జరిమానా విధిస్తున్నారు. 


మొదటి దశలో పట్టణాల్లో ఎక్కువగా ప్రభావం చూపిన మహమ్మారి రెండో దశలో పట్నం, పల్లె అనే తేడా లేకుండా వేగంగా విస్తరిస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల పుణ్యమా అని చాలా గ్రామాలు కరోనా బారిన పడ్డాయి. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన అనేక మంది గ్రామ స్థాయి కార్యకర్తలు సైతం నగరానికి వచ్చారు. ఇక్కడే తిష్టవేసి ప్రచారం సాగించారు. ప్రచారం ముగిసిన తర్వాత తిరిగి గ్రామలకు వెళ్ళి కరోనాను అందరికీ అంటించారు.  వరంగల్‌ అర్బన్‌తో పాటు వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం కరోనా ఉధృతంగా ఉండడానికి ఇదే కారణం. దీంతో కరోనా నియంత్రించేందుకు సెల్ఫ్‌లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గంగా భావించి ఆ మేరకు అమలు చేసుకుంటున్నారు.


కేసులు– మరణాలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గత వారం రోజుల్లో అధికారిక లెక్కల ప్రకారం కరోనా బారిన పడి 550 మంది మృతి చెందారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 258 మంది, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 115 మంది, మహబూబాబాద్‌ జిల్లాలో 105 మంది, జనగామ జిల్లాలో 50 మంది, ములుగు జిల్లాలో 15 మంది, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 22 మంది మృత్యువాతపడ్డారు. కానీ అనధికారిక లెక్కల ప్రకారం ఈ మరణాలు వెయ్యికిపైనే ఉంటాయని తెలుస్తోంది. ఒక్క వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోనే గత పది రోజుల్లో 550 మందికిపైగా మరణించినట్టు సమాచారం. 

ఉమ్మడి జిల్లాలో  గత పది రోజుల్లో 8937 కేసులు నమోదయ్యాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2290, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 1726, మహబూబాబాద్‌ జిల్లాలో 1708, జనగామ జిల్లాలో 890, ములుగు జిల్లాలో 900, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 1423 కేసులు రికార్డయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1వ తేదీ నుంచి కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.


వరంగల్‌ అర్బన్‌

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు లాక్‌డౌన్‌ను స్వచ్ఛందంగా విధించుకున్నారు.  ఖిలా వరంగల్‌లో ప్రజల సెల్ఫ్‌ లాక్‌డౌన్‌తో జంక్షన్‌ నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది.  భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు, మాణిక్యాపూర్‌, గాంధీనగర్‌ గ్రామాల ప్రజలు మంగళవారం నుంచి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయించుకున్నారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే రూ 5వేలు జరిమానా విధించాలని ముల్కనూరు గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. కమలాపూర్‌ మండలంలో కమలాపూర్‌, శనిగరం, శ్రీరాములపల్లె గ్రామస్తులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను విధించుకున్నారు. హసన్‌పర్తి మండల కేంద్రంలో ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు తెరుస్తారు.  ఎల్కతుర్తి మండల కేంద్రంలో కూడా గత రెండు రోజులుగా స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది.  లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారికి రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. వరంగల్‌లోని శాయంపేట, రంగశాయిపేట, కాశిబుగ్గ తదితర ప్రాంతాల్లో కూడా సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ అమలవుతోంది. కానీ హన్మకొండ, కాజీపేట పట్టణాల్లోనే అంతగా కనిపించడం లేదు.


మహబూబాబాద్‌

మహబూబాబాద్‌ పట్టణంలో మే 6  నుంచి సాయంత్రం 5 గంటలకే స్వచ్ఛందంగా వస్త్ర, వ్యాపార, జ్యూవెలరీ, ఇతరత్రా దుకాణాలను మూసి వేసే నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.  కొత్తగూడ, బయ్యారం, దంతాలపల్లి, తొర్రూరు, గూడూరు మండల కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటలకే స్వచ్చందంగా బంద్‌ పాటిస్తున్నారు. డోర్నకల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు, కేసముద్రం మండలం కల్వలలో ఉదయం 10 గంటలకే బంద్‌ పాటిస్తున్నారు. 


జనగామ           

జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 23 గ్రామాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. జనగామ జిల్లాకేంద్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ను రెండు రోజులుగా అమలు చేస్తున్నారు. జనగామ మండలంలోని పెంబర్తి, దేవరుప్పుల మండలంలోని దేవరుప్పుల, కామారెడ్డిగూడెం, సీతారాంపురం, ధర్మాపురం, కడవెండి, కోలుకొండ, సింగరాజుపల్లి గ్రామాల్లో 10 రోజులుగా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలులో ఉంది. లాక్‌డౌన్‌ను విధించుకున్న గ్రామాలు గ్రామంలో సొంతంగా ఆంక్షలను విధించుకున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలను తెరుచుకోవాలని నిబంధన పెట్టుకున్నాయి. కొన్ని గ్రామాల్లో 2 గంటల వరకు అనుమతిని ఇచ్చాయి. 


స్టేషన్‌ఘన్‌పూర్‌  మండలంలోని విశ్వనాథపురంలో ఏప్రిల్‌ 16 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఈ గ్రామంలో కొత్తగా కేసులు నమోదు కాలేదు. ఇదే మండలంలోని కోమటిగూడెంలో ఏప్రిల్‌ 18 నుంచి, ఛాగల్‌లో ఏప్రిల్‌ 29 నుంచి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మే 8 నుంచి శివునిపల్లిలో మే 9 నుంచి లాక్‌డౌన్‌ అమలు జరుగుతోంది. 


పాలకుర్తి మండలంలోని పాలకుర్తి, చెన్నూరు, గూడూరు, తొర్రూరులో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ను విధించుకోగా.. చెన్నూరులో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. చిల్పూరు మండలంలోని చిల్పూరు, వెంకటాద్రిపేట, లింగంపల్లి, కొండాపూర్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మంగళవారం నుంచి నష్కల్‌, చిన్న పెండ్యాల, వంగాలపల్లిలో లాక్‌డౌన్‌ విధించనున్నారు.  తరిగొప్పుల మండలకేంద్రంలో నెల రోజులుగా నాయీ బ్రాహ్మణులు తమకు తాముగా లాక్‌డౌన్‌ విధించుకొని దుకాణాలు బంద్‌ చేశారు. నాయీబ్రాహ్మణులు కటింగ్‌ చేయడానికి ముందుకు రాకపోవడంతో ప్రజలు సొంతంగా కటింగ్‌ చేసుకుంటున్నారు. 


కొడకండ్ల మండలంలోని గిర్నితండా, కొడకండ్లలో ఉదయం 6 నుంచి 11 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంది. లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్లలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇదే మండలంలోని కళ్లెంలో కేసులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ గ్రామాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. బచ్చన్నపేట మండల కేంద్రంలో గత పది రోజులుగా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. జఫర్‌ఘడ్‌ మండలంలోని జఫర్‌గడ్‌, కూనూరు, రఘునాథపల్లిలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. నర్మెట్ట మండలకేంద్రంలో వారం రోజులుగా పాక్షిక ఆంక్షలతో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.


ములుగు

ములుగు జిల్లా కేంద్రంలో 10 నుంచి 25వ తేదీ వరకు పాక్షికంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది.  ములుగు మండలం మల్లంపల్లిలో,  గోవిందరావుపేట మండలంలో గోవిందరావుపేటతో పాటు పస్రా, చల్వాయి, ఏటూరునాగారం, మంగపేటలో ఈనెల 20 వరకు, తాడ్వాయి మండలం బీరెల్లి, కాటాపూర్‌లలో ఈనెల 30 వరకు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ అమలు జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలను నిర్వహించాలని ఆంక్షలను విధించారు. ములుగు మండలం మల్లంపల్లి, ఏటూరునాగారం, మంగపేట, గోవిందరావుపేట మండలాల్లో గత వారం రోజుల నుంచి కట్టడి కొనసాగుతోంది.


భూపాలపల్లి

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరుస్తున్నారు. కాటారం మండలం జాదారావుపేటను కంటోన్మేంట్‌ ఏరియాగా  పరిగణించి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. చిట్యాల మండలం అందుకుతండాలో పాక్షికంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. మహదేవ్‌పూర్‌ మండలంలో కాళేశ్వరం, మద్దులపల్లి, పలుగుల గ్రామాల్లో ప్రజలు సెల్ఫ్‌లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. కాటారం మండలం  శంకర్రావుపల్లి, రెగొండ మండల కేంద్రంలో కూడా పాక్షికంగా స్వీయ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. టేకుమట్ల మండలంలోని మొత్తం 24 గామాల్లో మంగళవారం నుంచి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించాలని  పంచాయతీలు తీర్మానం చేశాయి. మల్హర్‌ మండలం పెద్దతుండ్లలో గత వారం రోజుల నుంచి సెల్ఫ్‌లాక్‌డౌన్‌ను ప్రజలు పాటిస్తున్నారు. మొగుళ్ళపల్లి మండలంలోని యమన్‌పల్లిలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళలోనే ఉండిపోతున్నారు.


వరంగల్‌ రూరల్‌

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నెక్కొండ, చిన్నకోర్పోలు గ్రామాల్లో అంక్షలు అమలు అవుతున్నాయి. స్వయం ప్రకటిత లాక్‌డౌన్‌ను ప్రజలు విధించుకున్నారు. కేసులు తగ్గకపోతే స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు కొనసాగిస్తామని గ్రామా ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. నల్లబెల్లిలో గత వారం రోజులుగా ప్రజలు స్వచ్ఛం లాక్‌డౌన్‌  పాటిస్తున్నారు. గ్రామాల్లోకి  కొత్తవారిని రానివ్వడం లేదు.


తక్షణమే లాక్‌డౌన్‌ విధించాలి..

– సీతక్క, ములుగు ఎమ్మెల్యే, ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి

కరోనా వైద్యం ఉచితంగా అందించాలి. వెంటనే ఆరోగ్య ఆరోగ్యశ్రీలో చేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు లెక్కలేకుండా పోతున్నాయి. చూస్తుండగానే వైరస్‌ విపరీతంగా వ్యాపిస్తోంది.  కళ్ళెదుటే కుటుంబాలు ఆగమవుతున్నాయి. పేదల ప్రాణం కంటే ఆదాయమే ముఖ్యమని ప్రభుత్వం అనుకుంటోంది. శవాలపై పేలాలు ఏరుకుంటున్న చందంగా సీఎం వ్యవహరిస్తున్నారు. ధనిక రాష్ట్ర సంపద ఎవరి ఖాతాలో వేయడానికి లాక్‌డౌన్‌ అమలు చేయడం లేదు? పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. తక్షణమే లాక్‌డౌన్‌ విధించాలి. 


లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కార మార్గం..

– యాట సదయ్య, ఎస్టీయూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు

కరోనా సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తున్నందున ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించే దిశగా అడుగులు వేయాలి. ప్రజలు భౌతిక దూరం పాటించక పోవడం వల్లే కరోనా వ్యాప్తి చెందుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కార మార్గం. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. మన రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి లాక్‌డౌన్‌ ప్రకటించాలి.  రాష్ట్రంలోని అనేక గ్రామాలు, ప్రాంతాల్లో ప్రజలు స్వీయ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. నెల రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటిస్తే కరోనా విస్తరణను కొంత మేరకు అరికట్టవచ్చు. 


కనీసం 15 రోజులైనా పెట్టాలి..

– డాక్టర్‌ ఎల్‌. లక్ష్మీనారాయణ నాయక్‌, జనగామ

కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే కనీసం 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ను పెట్టడం మం చింది. మనిషి నుంచి మనిషికి వ్యాపించే వైరస్‌ కాబట్టి 15 రోజుల పాటు జనసంచారం లేకుండా చేస్తే వ్యాప్తిని కట్టడి చేయవచ్చు. పాక్షిక ఆంక్షలు పెడితే సరిపోదు. చట్టాన్ని కఠి నంగా అమలు చేసి జనం బయటకు రాకుండా చూడాలి. ప్రస్తుతం అధికారుల దృష్టికి వచ్చిన కేసులు మాత్రమే లెక్కల్లోకి వస్తున్నాయి. ప్రైవేటుగా పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలు లెక్క ల్లోకి రావట్లేదు.  పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవు తున్నా యి. ఇప్పటికే సరిపడా బెడ్లు, ఆక్సిజన్‌, ఇంజక్షన్లు అందడం లేదు.  కేసుల సంఖ్య ఇంకా పెరిగితే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. 


ప్రజల ప్రాణాలే ముఖ్యం..

– డోలి సత్యనారాయణ, టీజేఎస్‌ మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షుడు

కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో పూర్తి స్ధాయిలో లాక్‌డౌన్‌ విధించాలి. ప్రతీ రోజు పాజిటివ్‌ కేసులు పెరగడం.. కరోనా వైరస్‌ తన ఆకృతిని మార్చుకుంటూ విజృంభిస్తోంది. 13 నెలలుగా ప్రజల భయాందోళన మధ్య జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆర్ధిక మూలాల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం. పాజిటివ్‌ వచ్చిన నిరుపేదలు ఆర్ధికంగా లేక సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా లాక్‌డౌన్‌ విధించి ప్రాణాలను కాపాడాలి.  


లాక్‌డౌన్‌తోనే  కరోనా అదుపు..

– బాసాని చంద్రప్రకాశ్‌, శాయంపేట మాజీ ఎంపీపీ, రూరల్‌ జిల్లా

కరోనా రోజు రోజుకు పెరుగుతుండడంతో గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ అమ లు చేసుకుంటున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ప్రభుత్వమే లాక్‌డౌన్‌ విధించాలి. అప్పుడే కరో నా అదుపులోకి వస్తుంది.   వ్యాధి పెరగకుండా ఉంటుంది.   

Updated Date - 2021-05-11T06:04:51+05:30 IST