హైదరాబాద్‌లోని ఈ ఏరియాలో లాక్‌డౌన్‌ విధిస్తారా?

ABN , First Publish Date - 2021-05-09T17:41:42+05:30 IST

కరోనా విస్తరిస్తుండటంతో పాలకవర్గం అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకోనుంది.

హైదరాబాద్‌లోని ఈ ఏరియాలో లాక్‌డౌన్‌ విధిస్తారా?

  • రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
  • కరోనా కట్టడికి లాక్‌డౌన్‌?
  • అమలు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌

హైదరాబాద్/జవహర్‌నగర్‌ : జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో రోజూ 50 మందికి కరోనా రాపిడ్‌ టెస్టులు చేస్తుండగా అందులో 20మందికి పాజిటివ్‌ లక్షణలుంటున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, పోలీసులకు కరోనా సోకడంతో ఐసొలేషన్‌లో ఉన్నారు. కరోనా విస్తరిస్తుండటంతో పాలకవర్గం అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకోనుంది.  


చురుగ్గా ఇంటింటి సర్వే

మున్సిపల్‌, వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది  ఇంటింటి సర్వేను సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్‌లో సుమారు 70 వేలకు పైగా ఇళ్లు ఉన్నాయి. సిబ్బంది థర్మల్‌ స్ర్కీనింగ్‌తో టెస్టులు నిర్వహించి వారి వివరాలు నమోదు చేసుకుంటున్నారు.  మూడు రోజులుగా  2వేల ఇళ్లల్లో ఫివర్‌ సర్వే  నిర్వహించారు. కరోనా లక్షణలున్నవారిని గుర్తించిన సిబ్బంది వారికి  కరోనా కిట్‌లను అందించారు. మొబైల్‌ద్వారా వారి క్షేమ సమాచారాలు సేకరించనున్నట్లు వైద్యసిబ్బంది తెలిపారు.


వీకెండ్‌ లాక్‌డౌన్‌ అమలు చేయాలి: కాంగ్రెస్‌

కార్పొరేషన్‌ పరిధిలో వీకెండ్‌ లాక్‌డౌన్‌ అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో, మేయర్‌కు వినతి పత్రం అందించారు. రోజువారి కూలీలే ఎక్కువగా ఉంటారనీ వారిని కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపైన ఉందన్నారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో అరకొర వసతులతో ప్రజలుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఆ దిశగా అడుగులు?

కరోనా ఉధృతి పెరుగుతుండటంలో పాలకవర్గం లాక్‌డౌన్‌ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని.. దీనిపై మంత్రి మల్లారెడ్డితో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకటి, లేదా రెండు రోజుల్లోనే లాక్‌డౌన్‌ దిశగా జవహర్‌నగర్‌లో అడుగులు పడనున్నాని తెలుస్తోంది.

Updated Date - 2021-05-09T17:41:42+05:30 IST