Advertisement

మొదటి వారం నుంచే లాక్‌డౌన్‌!

Jun 30 2020 @ 01:55AM

  • 3 లేదా 5 నుంచి అమలు?
  • ఒకటి, రెండు రోజుల్లో కేబినెట్‌ భేటీ
  • ఈసారి లాక్‌డౌన్‌ కఠినంగా అమలు 


హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో జూలై మొదటి వారం నుంచి లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకురావటానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవటానికి ఒకటి, రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ భేటీని నిర్వహించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం లేదా గురువారం జరిగే అవకాశం ఉంది. తదుపరి శుక్రవారం లేదా ఆదివారం నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. ఈసారి లాక్‌డౌన్‌ మొదట 15 రోజులకు పరిమితం కానుంది. అప్పటికీ, కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రాకపోతే, మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో కఠినంగా కట్టడి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సీఎం కేసీఆర్‌ వద్ద ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం తర్వాత మళ్లీ లాక్‌డౌన్‌ అనే సంకేతాలిచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 రోజులు లాక్‌డౌన్‌ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చినట్లు కూడా సీఎం కార్యాలయం ప్రకటించింది. అయితే లాక్‌డౌన్‌ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఎప్పటివరకు కొనసాగుతుంది? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే, జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలనే నిర్ణయం తీసుకుంటే, నిత్యావసరాల కోసం 1-2 గంటల సమయం ఇచ్చి, రోజంతా కర్ఫ్యూతోపాటు, విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిపివేయాల్సి ఉంటుందని తెలియజేశారు. దీంతో ఈ ప్రాంతంతో కుటుంబ, వ్యాపార, వాణిజ్య సంబంధాలున్న ప్రతి ఒక్కరూ అప్రమత్తమయ్యారు. మార్చి మూడవ వారంలో లాక్‌డౌన్‌ ఆకస్మికంగా ప్రకటించటంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈసారి లాక్‌డౌన్‌ అమలు చేయటానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 


ఢిల్లీ, ముంబై, చెన్నై బాటలోనే..

ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల మాదిరిగానే హైదరాబాద్‌లోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా నగరాల్లో చేపడుతున్న కట్టడి చర్యలనే ఇక్కడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా చెన్నైలో రాబోయే 12 రోజులు లాక్‌డౌన్‌ విధించగా, జూలై నెలాఖరు వరకు ముంబైలో లాక్‌డౌన్‌ ఉంటుందని ప్రకటించారు. కేంద్రం కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు మళ్లీ లాక్‌డౌన్‌ వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించే అవకాశం ఉంది. అంతకంటే ముందు తామే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో లాక్‌డౌన్‌ ప్రకటించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలు మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటంలో అజాగ్రత్తగా వ్యవహరించటమే కరోనా కేసుల్లో వృద్ధికి కారణమని ప్రభుత్వం ధ్రువీకరించుకుంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ చాలా కుటుంబాలు దావత్‌లు చేసుకోవటాన్ని గుర్తించింది. ఇటువంటి అన్నింటిపైనా ఉక్కుపాదం మోపే విధంగా లాక్‌డౌన్‌ అమలు ఉండబోతోందని సమాచారం.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.