లాక్‌డౌన్ వెరైటీ కిచెన్

ABN , First Publish Date - 2020-04-11T20:16:34+05:30 IST

ఏం వదినా.. ఈరోజు ఏం కూర వండావు? అని గోడ దగ్గర కబుర్లు చెప్పుకునే కాలం కాదిది. సమయాన్ని డబ్బుతో కొలిచే కాలం.

లాక్‌డౌన్ వెరైటీ కిచెన్

విభిన్న వంటకాలను ట్రై చేస్తున్న నగరవాసులు

సహాయపడుతున్న విభిన్నమైన ఆన్‌లైన్‌ సైట్లు


ఏం వదినా.. ఈరోజు ఏం కూర వండావు? అని గోడ దగ్గర కబుర్లు చెప్పుకునే కాలం కాదిది. సమయాన్ని డబ్బుతో కొలిచే కాలం. అందునా, తినడానికే సమయం లేదు... ఇక వంట? అంటూ క్వశ్చన్‌ మార్క్‌ పెట్టే నవతరమున్న కాలమిది. కడుపు కాలుతుందనుకుంటే ఏదో ఒకటి ఆ టైమ్‌కు లోపల పడేస్తే చాలు అనేటట్లుగా వ్యవహారం నిన్నటి వరకూ ఉండేది. కానీ లాక్‌డౌన్‌ పుణ్యమా అని రొటీన్‌ మారిపోయింది. అసలు తిన్నావా అని అడగడానికే మొహమాటపడే కుర్రతరం, ఇప్పుడు... హాయ్‌, వాట్‌ కర్రీ యు ట్రైడ్‌ దిస్‌ డే.. అంటూ చాట్‌ చేసుకునే స్థాయికి చేరింది. అంతేనా... ప్రత్యేకంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ గ్రూప్‌లను వాట్సా్‌పలలో క్రియేట్‌ చేసి విభిన్నమైన వంటకాల గురించి చర్చోపర్చలనూ చేస్తున్నారు. యూట్యూబ్‌, చెఫ్స్‌ కిచెన్‌ లైవ్‌ క్లాసెస్‌ వీడియోలను చూసి తాము కూడా విభిన్న వంటకాలను ట్రై చేస్తున్నారు. టేస్టీగా ఉండే వంటకాలకు అధిక ప్రాధాన్యమిస్తూనే వాటిని వైరల్‌ చేసేందుకూ ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్‌ తరువాత గూగుల్‌పై ఎక్కువ మంది శోధించిన అంశాల్లో రెసిపీలు ఉండటం, తమలోని సృజనాత్మతను కిచెన్‌లో పరీక్షించుకోవాలనుకుంటున్న నవతరపు ఆలోచనలను తెలపడమే కాదు, రెస్టారెంట్లలో తాము తిన్న ఆహారాన్ని ట్రై చేయాలనుకుంటున్న వారి ఆలోచనలనూ ప్రతిబింబిస్తుందంటున్నారు చెఫ్‌లు.


ఉన్నవాటిని ఉపయోగించాలి... 

కొత్తదనం చూపాలి!

కొవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు, భౌతిక దూరం ఆచరింపజేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. తొలుత 21 రోజుల లాక్‌డౌన్‌ అనగానే కిరాణా, సూపర్‌ మార్కెట్‌లపై దాడి చేసిన అతి జాగ్రత్తపరులు అవసరాన్ని మించి సరుకులను నిల్వ చేసుకున్నారు. వాటిలోనూ తప్పనిసరిగా వంటల్లో వాడే స్పైసెస్‌, ఆయిల్స్‌, టీ, కాఫీ పౌడర్లు, పిండి లాంటివి భారీగానే నిల్వ చేశారు చాలామంది. ఈ కారణం చేత విభిన్న వంటకాలను ట్రై చేయడమూ పెరిగింది.


ఏ ఇంటికి అయినా కిచెన్‌ గుండెలాంటిది అయితే, కరోనా నేపథ్యంలో అదిప్పుడు వార్‌ రూమ్‌ అయిందనే చెప్పాలి. రోజుకు మూడుసార్లు తినాలనే కాన్సెప్ట్‌ ఈ లాక్‌డౌన్‌ పుణ్యమా అని పోయింది. ఎన్నిసార్లు తిన్నామన్నది కాదు.. ఎంత వెరైటీగా తిన్నామనే కాన్సెప్ట్‌ పుట్టుకువచ్చిందిప్పుడు. ఇదే విషయమై చెఫ్‌ శరత్‌ మాట్లాడుతూ ‘కిచెన్‌కు ఓ అపూర్వమైన శక్తి ఉంది. ఓ ఆర్గనైజ్డ్‌ కిచెన్‌ ఉంటే, ఆ ఇల్లు శక్తివంతంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా, వైవిధ్యంగా! అంతేకాదు, ప్రొడక్టివిటీ పరంగా కూడా ఆ ఇంటిలోని వ్యక్తులు మరింత మెరుగైన ప్రదర్శన కనబరచగలరు’ అని అన్నారు. అదెలా అన్నప్పుడు సింపుల్‌  ఇంగ్రీడియెంట్స్‌తోనే మన పూర్వీకులు అద్భుతమైన రుచులను సృష్టించినట్లుగా! అని చెప్పుకొచ్చారు.


వాట్సాప్ చాటింగ్స్‌...

లాక్‌డౌన్‌ వచ్చిన దగ్గర నుంచీ కిచెన్‌లో మహిళలకు పని పెరిగిందంటూ వాట్సా్‌పలో జోక్స్‌ పేలుతున్నాయి. కొంతమంది అయితే టిక్‌టాక్‌, హలో యాప్స్‌లో వీటికి సంబంధించి తమ బాధలనూ హాస్యం మేళవించి మరీ వైరల్‌ చేస్తున్నారు. ఇవెలా ఉన్నా ఇప్పుడు వాట్సాప్‌ ఫ్యామిలీ గ్రూప్‌లు, ఫేస్‌బుక్‌లో మాత్రం సరికొత్త వంటకాల గురించిన చర్చ మాత్రం ఎక్కువగానే కనబడుతోంది. మరీ ముఖ్యంగా మహిళల కన్నా మగవారే ఈ తరహా చర్చలను అధికంగా చేస్తుండటం విశేషమనే చెప్పాలి. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి రోజూ తమ ఇంటిలో చేసిన నూతన వంటకాన్ని వాట్సాప్‌ స్టేట్‌సలో పెడుతున్నారు.


ఆనందం కలిగిస్తుంది... ఆదుకుంటుంది...

నిజానికి కుకింగ్‌ను ఓ సర్వైవల్‌ స్కిల్‌గా అభివర్ణిస్తున్నారు చెఫ్‌లు. ఈత నేర్చుకోవడం, ఆత్మరక్షణ విధానాలను అభ్యసించడం ఎలాగో కుకింగ్‌ కూడా అలాంటిదేనంటున్నారు చెఫ్‌ నితిన్‌. మన వంట మనం చేసుకుంటే అన్నీ కంట్రోల్‌లోనే ఉంటాయి. అది టేస్ట్‌ పరంగా మాత్రమే కాదు హెల్త్‌ పరంగా కూడా! ఈ లాక్‌డౌన్‌ వేళ వంట చేయడం నేర్చుకుంటే తరువాత కాలంలో అది మనకు ఎంతగానో ఉపయోగపడే అవకాశాలున్నాయన్నారు.


నిజానికి కుకింగ్‌ ఓ మెడిటేషన్‌ లాంటిదేనన్నది కొంతమంది భావన. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ టాస్క్‌తో బిజీగా గడిపేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రమణ మాట్లాడు తూ బ్రతకడం కోసం తినాలి... తినడం కోసం వండుకోవాలంటారు కానీ రిలాక్సేషన్‌కూ ఇది ఓ మార్గంగా కనబడుతుంది. ఎలాగంటే మనకు నచ్చినది, మనకు నచ్చిన స్టైల్‌లో వండుకుంటే ఆ ఆనందం వేరు. పైగా మొనాటినీ కూడా ఉండదంటూ చెప్పుకొచ్చారు.


లాక్‌డౌన్‌ వేళ ఎక్కువగా

కనబడుతున్న వంటకాలు..

బిస్కెట్స్‌తో కేక్‌: ఓరియో లేదంటే ఇతర క్రీమ్‌ బిస్కెట్స్‌ను కేక్‌లుగా మారుస్తుండటం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ తరహా రెసిపీలను అబ్బాయిలే ఎక్కువ ట్రై చేస్తున్నారు. 


బనానా బ్రెడ్‌: బాగా పండిన అరటి పండ్లతో దీనిని చేస్తున్నారు. 

మోమోస్‌: నేపాల్‌ తదితర దేశాల్లో బాగా కనిపించే మోమోస్‌ ఇప్పుడు నగరంలో స్ట్రీట్‌ ఫుడ్‌గా కూడా ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆవిరి మీద ఉడికించే ఈ మోమో్‌సను ఈవెనింగ్‌ స్నాక్స్‌గా ఎక్కువ మంది తింటున్నారు.


నూడిల్స్‌, ఫ్రైడ్‌ రైస్‌: నూడిల్స్‌తో విభిన్న రకాల వంటకాలను ట్రై చేయడం బాగా పెరిగింది. వెజ్‌ నూడిల్స్‌ అని మాత్రమే కాకుండా యూట్యూబ్‌లో చూసి మరీ భిన్నమైన వంటకాలను చేస్తున్నారు. 

Updated Date - 2020-04-11T20:16:34+05:30 IST