కేటాయింపులు జరగలేదని ఇళ్లకు తాళాలు

ABN , First Publish Date - 2021-04-23T05:06:39+05:30 IST

కేటాయింపులు జరగలేదని ఇళ్లకు తాళాలు

కేటాయింపులు జరగలేదని ఇళ్లకు తాళాలు
ఇంటికి తాళం వేయడంతో ఇంటి ఎదుట నిలబడిన దివ్యాంగురాలు, పిల్లలు

  •  ఇప్పటికిప్పుడు ఎక్కడికెళ్లాలని బాధితుల ఆవేదన 
  • తక్షణమే ఇళ్లు అప్పగించాలని డిమాండ్‌

ఘట్‌కేసర్‌ : జీహెచ్‌ఎంసీ అధికారులు మేడ్చల్‌ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని అన్నోజిగూడ దివ్వాంగుల కాలనీలోని ఇళ్లకు తాళాలు వేసి తమ దాష్టీకాన్ని చాటుకున్నారు. అన్నోజిగూడ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 14లో అప్పటి ముఖ్యమంత్రి వైస్‌ఎ్‌సఆర్‌ హయాంలో దివ్యాంగుల కోసం 19బ్లాకుల్లో 269 ఇళ్లు నిర్మించారు. కాగా వాటి నిర్మాణం పూర్తయినప్పటికీ అధికారులు వెంటనే కేటాయింపులు చేపట్టలేదు. దీంతో అక్కడే గుడిసెలు వేసుకుని నివాసముంటున్న పలువురు దివ్వాంగులు ఆ ఇళ్లలోకి వెళ్లి నివాసముంటున్నారు. కొన్ని రోజుల తర్వాత అధికారులు కేటాయింపులు చేపట్టారు. అందులో 29 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆరు కుటుంబాలు ఆ ఇళ్లలో నివాసముంటున్నారు. గురువారం జీహెచ్‌ఎంసీ అధికారులు అన్నోజిగూడకు వచ్చి కేటాయింపులు లేకుండా ఇళ్లలోకి ఎలా ప్రవేశిస్తారని దివ్యాంగులు నివాసముంటున్న ఇళ్లకు తాళాలు వేశారు. ఇంట్లో సామాన్లు సైతం తీసుకోవడానికి అవకాశం కల్పించకుండా వారిని అడ్డుకున్నారు. దివ్యాంగులు మాట్లాడుతూ తమ ఇళ్లకు తాళాలు వేస్తే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలని వాపోయారు. ఆశ్రయం కల్పించాలని తహసీల్దార్‌ విజయలక్ష్మికి మొరపెట్టుకున్నారు. కాగా అధికారులు ఇళ్లు కేటాయించే వరకూ వేచి ఉండాల్సిందిగా హెచ్చరించినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే వారికి ఇళ్లు కేటాయించాలని దివ్వాంగుల సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇళ్లకు తాళాలు వేయడం దారుణం 

దివ్వాంగుల ఇళ్లకు తాళాలు వేయడం దారుణం. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో తాళాలు వేస్తే వారంతా ఎక్కడికి వెళ్తారు. అధికారులు ఉన్నపలంగా వచ్చి ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. వారికి ఇళ్లు కేటాయించే వరకు ఆ ఇళ్లలోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.

         - మొక్క ఉపేందర్‌, దివ్యాంగుల సంఘం నాయకుడు

అర్హులందరికీ ఇళ్లు కేటాయించాలి

దివ్వాంగుల కాలనీలో ఉన్న అర్హులందరికీ ఇళ్లు కేటాయించాలి. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో విచారణ జరిపి అర్హులను ఎంపిక చేశారు. కాగా ప్రస్తుతం తాళాలు వేసిన ఇళ్ల బాధితులు కూడా ఇళ్లు కేటాయించిన లిస్టులో ఉన్నారు. వారి ఇంటి తాళాలు అందజేయాలి.

       - భూతం లింగయ్య, దివ్యాంగుల సంఘం నాయకుడు

Updated Date - 2021-04-23T05:06:39+05:30 IST