పొరపాటు జరిగింది.. చింతిస్తున్నాం

Dec 7 2021 @ 01:17AM

నాగాలాండ్‌ కాల్పులు దురదృష్టకరం.. 

వాహనం ఆపకపోవడంతోనే కాల్పులు

లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

హోం మంత్రి రాజీనామాకు విపక్షాల డిమాండ్‌


న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నాగాలాండ్‌లో భద్రతా బలగాలు తీవ్రవాదులనుకొని పౌరుల్ని కాల్చివేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్‌లో పొరపాటు జరిగిందని తెలిపింది. 14 మంది పౌరులు మరణించడం దురదృష్టకర ఘటన అని, చింతిస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించామని, అది నెలరోజుల్లో నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. నాగాలాండ్‌ ఘటనపై సోమవారం పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. హోం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితే భద్రతా దళాలు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపాయని, తీవ్రవాదుల కదలికలను గమనించిన తర్వాతే ఓటింగ్‌ ప్రాంతానికి వెళ్లారని అమిత్‌ షా సమర్థించుకున్నారు. జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం చింతిస్తోందన్నారు.


‘‘ఓటింగ్‌, మోన్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఆర్మీ 21 పారా కమాండో యూనిట్‌ శనివారం మెరుపు దాడులు చేపట్టింది. అటుగా వస్తున్న ఓ వాహనాన్ని ఆపమని కోరినా.. ఆగకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. అందులో ఉన్నది ఉగ్రవాదులని భావించిన దళాలు.. కాల్పులు జరిపాయి. ఆరుగురు మరణించారు. పొరపాటు జరిగినట్లు గుర్తించిన బలగాలు.. వాహనంలోని ఇద్దరు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. కాల్పుల విషయం తెలియగానే స్థానికులు ఆర్మీ యూనిట్‌పై దాడి చేశారు. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆత్మరక్షణ కోసం సైనికులు మళ్లీ కాల్పులు జరపగా మరో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పౌరుల దాడిలో ఓ సైనికుడు చనిపోయాడు. ఆదివారం సాయంత్రం కూడా స్థానికులు ఆర్మీ శిబిరంపై దాడికి దిగారు. వారిని చెదరగొట్టేందుకు సైనికులు కాల్పులు జరిపారు.


ఈ ఘటనలో మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు’’ అని అమిత్‌ షా లోక్‌సభలో వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. షా ప్రకటనపై స్పందించేందుకు స్పీకర్‌ ప్రతిపక్షాలను అనుమతించలేదు. ఏఎ్‌ఫఎ్‌సపీఏ చట్టాన్ని ఎత్తివేయాలని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ఆయన వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా, మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్‌ ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తూ నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రోఫిక్‌ సబ్‌ స్టాన్సెస్‌ బిల్లును ప్రవేశపెట్టారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.