త్వరలో జరిగే సమావేశాలపై లోక్‌సభ స్పీకర్ ఆశాభావం

ABN , First Publish Date - 2021-11-21T01:10:22+05:30 IST

ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల

త్వరలో జరిగే సమావేశాలపై లోక్‌సభ స్పీకర్ ఆశాభావం

న్యూఢిల్లీ : ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అన్ని అంశాలపైనా, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో చేసిన మంచి పనులపైనా చర్చ జరుగుతుందన్నారు.  ఈ సమావేశాలు డిసెంబరు 23 వరకు జరిగే అవకాశం ఉంది.


ఓం బిర్లా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, రానున్న శీతాకాలం సమావేశాల్లో సభా కార్యకలాపాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అన్ని సమస్యలపైనా చర్చ జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎంపీలు తమ నియోజకవర్గాల్లో చేపట్టిన మంచి పనుల గురించి కూడా చర్చ జరుగుతుందని తెలిపారు. 


ఇటీవల ఓం బిర్లా ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సులో మాట్లాడుతూ, సభ్యులు స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ పాటించేవిధంగా అన్ని రాజకీయ పార్టీలతో జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. క్రమశిక్షణా రాహిత్య ధోరణి పెరగడాన్ని ఆపాలన్నారు. చట్ట సభల్లో అంతరాయాలు కలిగించడం, గందరగోళం సృష్టించడం వంటివాటిని నిలువరించాలని చెప్పారు. 


సాగు చట్టాలు, పెగాసస్ స్పైవేర్ తదితర అంశాలపై సభ్యుల నిరసనల మధ్య వర్షాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాలకు కేటాయించిన సమయంలో 22 శాతం సమయంలో లోక్‌సభ కార్యకలాపాలు, 28 శాతం సమయంలో రాజ్యసభ కార్యకలాపాలు జరిగాయి. మిగిలిన సమయం వృథా అయింది. 


Updated Date - 2021-11-21T01:10:22+05:30 IST