మంత్రులకు ఓం బిర్లా హెచ్చరిక

ABN , First Publish Date - 2021-12-14T22:56:46+05:30 IST

కేంద్ర మంత్రులు తమ కార్యాలయాలను లోక్‌సభలో నిర్వహించవద్దని

మంత్రులకు ఓం బిర్లా హెచ్చరిక

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు తమ కార్యాలయాలను లోక్‌సభలో నిర్వహించవద్దని స్పీకర్ ఓం బిర్లా మంగళవారం హెచ్చరించారు. మంత్రులు, సభ్యులు సభలో మాట్లాడుకుంటుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌తో ఓ సభ్యుడు మాట్లాడుతుండగా ఓం బిర్లా జోక్యం చేసుకుని ఈ హెచ్చరిక చేశారు. 


ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత ఓ సభ్యుడు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసి, మాట్లాడారు. ఆ విషయాన్ని ఓం బిర్లా గమనించారు. గౌరవ సభ్యులు, మంత్రులు తమ కార్యాలయాలను ఇక్కడి నుంచి నిర్వహించకూడదని చెప్పారు. కార్యాలయంలో కలవాలని సభ్యులను మంత్రులు కోరాలన్నారు. సభా గౌరవాన్ని కాపాడాలని కోరారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసినట్లు ప్రకటించినప్పటికీ కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి ఓ ప్రశ్నకు సమాధానాన్ని కొనసాగిస్తుండటంతో, ఆయనపై కూడా ఓం బిర్లా మండిపడ్డారు. ‘‘మంత్రి గారూ, సభాపతి ఓ ప్రకటన చేశారు. కూర్చోండి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసినట్లు నేను చెప్పినప్పటికీ మీరు మాట్లాడుతూనే ఉన్నారు’’ అని అన్నారు.


పార్లమెంటులో కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో సభ్యులు మంత్రుల వద్దకు వెళ్లి, వివిధ సమస్యలను ప్రస్తావిస్తుండటం సాధారణంగా జరుగుతుంది. 


Updated Date - 2021-12-14T22:56:46+05:30 IST