లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన

ABN , First Publish Date - 2022-08-14T05:27:30+05:30 IST

జాతీయ లోక్‌ అదాలత్‌కు మంచి స్పందన లభించిందని జిల్లా జడ్జీ వైవీఎస్‌బీజీ పార్థసారధి అన్నారు.

లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన
కేసు పరిష్కరించి చెక్కులు అందజేస్తున్న జిల్లా న్యాయమూర్తి పార్ధసారధి

ఒక్క రోజులో 7,070 కేసులకు పైగా పరిష్కారం 

గుంటూరు(లీగల్‌), ఆగస్టు 13: జాతీయ లోక్‌ అదాలత్‌కు మంచి స్పందన లభించిందని జిల్లా జడ్జీ వైవీఎస్‌బీజీ పార్థసారధి అన్నారు. శనివారం జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారులతో జిల్లా జడ్జి సమావేశం నిర్వహించారు. విద్యావంతులు లోక్‌ అదాలత్‌ని చక్కగా వినియోగించుకొంటున్నారని చెప్పారు. తోటి నిరక్షరాస్యులకు కూడా లోక్‌ అదాలత్‌ వలన కలిగే ప్రయోజనంపై అవగాహన కల్పించాలని సూచించారు. 5వ జూనియర్‌ సివిల్‌ కోర్డులో పెండింగ్‌లో ఉన్న కేసులో రాజీ కుదిర్చి బాధితురాలికి రూ.32 లక్షలు, వారి కుమార్తెకు రూ.17 లక్షల డీడీని అందజేశారు. శనివారం సాయంత్రానికి మొత్తం 7,070 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. అదాలత్‌కు సహకరించిన న్యాయవాదులు, పోలీసు, ప్రభుత్వ సంస్థలకు చెందిన సిబ్బంది, కక్షిదారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నకుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-14T05:27:30+05:30 IST