టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులకు లోకేశ్‌ పరామర్శ

ABN , First Publish Date - 2021-11-19T02:31:16+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ గురువారం అమరావతిలో పోలీసుల అదుపులో ఉన్న టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులను పరామర్శించారు.

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులకు లోకేశ్‌ పరామర్శ

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి  నారా లోకేశ్‌ గురువారం అమరావతిలో పోలీసుల అదుపులో ఉన్న టిఎన్‌ఎస్‌ఎఫ్‌  నాయకులను పరామర్శించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనానికి ప్రభుత్వం విడుదల చేసిన మూడు జీవోలను రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల నాయకులు గురువారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ సమీపానికి  వెళ్లిన  20మందిని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులను పోలీసులు బలవంతంగా అమరావతి పోలీసు స్టేషన్‌కు తీసుకురావడం జరిగింది. సమాచారం తెలుసుకున్న నారా లోకేశ్‌తో పాటు శాసనమండలి సభ్యులు దీపక్‌రెడ్డి, అశోక్‌బాబులు సాయంత్రం 3 గంటల సమయంలో స్టేషన్‌కు వచ్చి టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులను పరామర్శించి జరిగిన సంఘటన వివరాలు తెలుసుకున్నారు.


తాము అసెంబ్లీ ముట్టడిలో ప్రహరీ గోడను తాకడం జరిగిందని విద్యార్ధి సంఘనాయకులు తెలిపారు. మీకు అండగా ఉంటామని లోకేశ్‌ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులకు హామీ ఇచ్చారు.  అమరావతి పోలీసు స్టేషన్‌కు తరలించిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌, విజయవాడ పార్లమెంట్‌ పరిధి అధ్యక్షుడు వినోద్‌, మచీలీపట్నం పార్లమెంట్‌ పరిధి అధ్యక్షుడు ఎన్‌ సత్యసాయి, బాపట్ల పార్లమెంట్‌ పరిధి అధ్యక్షుడు శరత్‌కుమార్‌, విజయనగరం పార్లమెంట్‌ పరిధి అధ్యక్షుడు తారకరామారావు, కర్నూలు పార్లమెంట్‌ పరిధి అధ్యక్షుడు శ్రీరామాంజనేయులు, నరసరావుపేట పార్లమెంట్‌ పరిధి అధ్యక్షుడు కె హనుమంతరావుతో పాటు అధికార ప్రతినిధులు  దొండపాటి విజయ్‌, చావా సతీష్‌  తదితర నాయకులు ఉన్నారు. లోకేశ్‌ అమరావతి వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.




Updated Date - 2021-11-19T02:31:16+05:30 IST