జనంతో మమేకమవుతూ..

ABN , First Publish Date - 2021-04-06T06:55:14+05:30 IST

తిరుపతిలో సోమవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారం విజయవంతమైంది

జనంతో మమేకమవుతూ..
లోకేశ్‌ సభకు హాజరైన జనం

ప్రజల్లోకి చొరవగా దూసుకెళ్లిన లోకేశ్‌ 

దారిపొడవునా జన నీరాజనాలు

తెలుగు తమ్ముళ్లతో పోటెత్తిన తిరు వీధులు


తిరుపతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో సోమవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారం విజయవంతమైందితిరుపతిలో సోమవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారం విజయవంతమైంది. కొంతదూరం కాలినడకన.. పలు చిన్నపాటి వీధులు, సందుల్లోనూ ఆయన చొరవగా జనంలోకి వెళ్లారు. ఇళ్ల ముందు నిలిచి తనకోసం నిరీక్షిస్తున్న వారితో మాట కలిపారు. ఆదరంగా పలకరించారు. పలువురి ఇళ్లల్లోకి వెళ్లారు. చిన్న పిల్లలు కనిపిస్తే ఆప్యాయంగా మాట్లాడి ఎత్తుకుని ముద్దు చేశారు. చిన్నపాటి దుకాణాల వద్దా ఆగి దుకాణదారులతో మాట్లాడారు. కొన్ని వస్త్ర దుకాణాల్లోకి సైతం వెళ్లి వ్యాపారులు, పనిచేసే వారినీ పలకరించారు. ప్రతి ఒక్కరికీ కరపత్రాలు అందిస్తూ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఇలా లోకేశ్‌ చొరవ, అరమరికలు లేకుండా జనంలోకి వెళ్లడం స్థానికులను ఆకట్టుకుంది. ఇలా లోకేశ్‌ రోడ్‌షో.. ప్రచారం విజయవంతం కావడంతో తెలుగు తమ్ముళ్లలో జోష్‌ నింపింది. ఇక, లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా వీధులన్నీ పసుపురంగును పులుముకున్నాయి. ధరలు తగ్గాలంటే టీడీపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణాపురం ఠాణా నుంచి మొదలైన పాదయాత్ర గాంధీ రోడ్డు, చిన్నబజారు వీధి, తిలక్‌ రోడ్డు మీదుగా కార్పొరేషన్‌ కార్యాలయం వరకు సాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.  ఈ కార్యక్రమంలో నేతలు కాల్వ శ్రీనివాసులు, నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి,  సుగుణమ్మ, నరసింహ యాదవ్‌, మబ్బు దేవనారాయణ రెడ్డి, బీఎల్‌ సంజయ్‌, శ్రీధర్‌ వర్మ, పుష్పావతి యాదవ్‌, జేబీ శ్రీనివాస్‌, కృష్ణా యాదవ్‌,  రవినాయుడు, వెంకట కీర్తి తదితరులు పాల్గొన్నారు.


దారిపొడవునా నేతల స్వాగతం


పాదయాత్ర సందర్భంగా ఆయా కూడళ్లలో వందలాది మంది కార్యకర్తలు ర్యాలీలో కలవడంతో తిరువీధులు కిక్కిరిసిపోయాయి. నాలుగు కాళ్ల మండపం వద్ద పులుగోరు మురళీకృష్ణారెడ్డి పెద్దఎత్తున కార్యకర్తలను తీసుకొచ్చారు. ప్రెస్‌క్లబ్‌ ఎదురుగా నరసింహ యాదవ్‌, ఆయన సోదరులు గజమాలతో  సత్కరించి, గుమ్మడికాయలతో దిష్టితీశారు. కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, మునిశేఖర్‌ రాయల్‌, ఊట్ల సురేంద్ర నాయుడు ఆయా డివిజన్లకు చెందిన కార్యకర్తలతో లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌,  కొట్టే హేమంత్‌ రాయల్‌ తదితరులు ఎస్వీయూ నుంచి విద్యార్థి చైతన్య యాత్రను నిర్వహించి లోకేశ్‌ యాత్రలో కలుసుకున్నారు.


వీధి వ్యాపారులకు న్యాయమేదీ?


వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న వీధి వ్యాపారులను ఉద్దేశించి బహిరంగ సభ చివర్లో లోకేశ్‌ మాట్లాడారు. అధికారంలోకి వస్తే  వీధి వ్యాపారులకు శాశ్వతంగా షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌రెడ్డి ఇప్పుడు వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గర్వం అణగాలంటే ఉప ఎన్నికలో బుద్ధి చెప్పాలని కోరారు.  


Updated Date - 2021-04-06T06:55:14+05:30 IST