చచ్చినా సరే.. లోన్‌ డబ్బు కట్టాల్సిందే!

ABN , First Publish Date - 2022-05-19T07:57:36+05:30 IST

ఆన్‌లైన్‌ రుణ యాప్‌ నిర్వాహకులది ఎంత క్రూరత్వం? ఇచ్చిన అప్పు వసూలు చేసుకునేందుకు ఆమెను వేధించుకుతిన్నారు.

చచ్చినా సరే.. లోన్‌ డబ్బు కట్టాల్సిందే!

  • గృహిణికి ‘లోన్‌ యాప్‌’ వేధింపులు
  • నగ్న చిత్రాలకు ఆమె ఫొటోలు మార్ఫ్‌
  • కాంటాక్టు లిస్ట్‌లో ఉన్నవారందరికి 
  • పంపుతామని నిర్వాహకుల బెదిరింపులు
  • పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం
  • ఆగని వేధింపులు.. ఉరేసుకొని ఆత్మహత్య


ఏసీసీ, మే 18: ఆన్‌లైన్‌ రుణ యాప్‌ నిర్వాహకులది ఎంత క్రూరత్వం? ఇచ్చిన అప్పు వసూలు చేసుకునేందుకు ఆమెను వేధించుకుతిన్నారు. పురుషుల నగ్న ఫొటోలను బంధువులు, మిత్రులకు మెసేజ్‌ చేస్తామని వారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ప్రచారం చేస్తామని బెదిరించారు. చివరికి ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నగ్న ఫొటోలు రూపొందించి కాల్‌ లిస్ట్‌లోని బంధువులు, మిత్రులకు షేర్‌ చేస్తామని హెచ్చరించారు. ఆ వేధింపులను ఆమె తాళలేకపోయింది. ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఉరేసుకొని ప్రాణం తీసుకుంది. మృతురాలు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొల్లు కల్యాణి (30) అనే గృహిణి. ఆమెకు ఏపీలోని అనంతపూర్‌కు చెందిన  గోవింద్‌రెడ్డితో ఎనిమిదేళ్లక్రితం పెళ్లయింది. వారు అనంతపూర్‌లోనే నివాసం ఉండేవారు. గోవింద్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కరోనా సమయంలో ఆయన ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి వారు ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో రుణాల యాప్‌లకు సంబంధించిన ప్రకటనలను కల్యాణి చూసింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చుననే ఉద్దేశంతో ఓ రుణ యాప్‌ నిర్వాహకులకు రూ.30 వేలు అడిగింది. ఆమె ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్లు, ఫొటోలను యాక్సెస్‌ చేసుకునే షరతు మీద ఆ డబ్బును వారు అప్పుగా ఆమె ఖాతాలో వేశారు. 


అయితే గడువు దాటినా ఆమె అప్పు తీర్చలేకపోయింది. దీంతో యాప్‌ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఒకరోజు గుర్తు తెలియని పురుషుల నగ్న చిత్రాలను ఆమెకు పంపి.. అప్పు చెల్లించకపోతే ఆ పురుషులతో వివాహేతర సంబంధాలున్నాయని బంధువులకు చెప్పి ఫొటోలు మెసేజ్‌ చేస్తామని బెదిరించారు. భయపడిపోయిన ఆమె, 20 రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. కల్యాణి తమ నుంచి అప్పు తీసుకొని చెల్లించడం లేదంటూ ఆమె ఫోన్లోని బంధువులు, మిత్రుల నంబర్లకు మెసేజ్‌ పెట్టారు. ఒకరోజు కల్యాణి ఫొటోలను మార్ఫింగ్‌తో నగ్న చిత్రాలుగా మార్చి.. ఆమె ఫోన్‌కు పంపారు. తమ డబ్బులు చెల్లించకపోతే ఆమె ఫోన్‌లో ఉన్న కాంటాక్టు నంబర్లకు, వాట్సాప్‌ గ్రూప్‌లకు ఆ ఫొటోలను షేర్‌ చేస్తామని బెదిరించారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆమె, మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడంతో కోలుకుంది. ఇంతలో మళ్లీ యాప్‌ నిర్వాహకులు ఫోన్‌ చేశారు. తాను ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని కల్యాణి వారికి చెప్పింది. తమకు ఆ విషయాలన్నీ అవసరం లేదని, చచ్చినా పర్వాలేదని, డబ్బులు చెల్లించాలని వారు బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన కల్యాణి బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. 

Updated Date - 2022-05-19T07:57:36+05:30 IST