Advertisement

ఇక తొలగింపే

Mar 6 2021 @ 00:35AM
కాల్వపక్కనే అక్రమనిర్మాణాలు


 నేరేడుచర్ల, మార్చి 5: నేరేడుచర్ల పరిధిలోని ఆర్‌-3 కాల్వపై ఆక్రమణ తొలగింపునకు ఎన్నెస్పీ అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇప్పటికే కాల్వ ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఆక్రమణ ఏ మేరకు జరిగిందో అక్కడ వరకు స్వచ్ఛందంగా తొలగించుకునేందుకు గతంలోనే మార్కింగ్‌ కూడా చేశారు. నోటీసు గడువు కూడా ముగిసింది. సుమారు 110 మంది ఆర్‌-3 కాల్వ కట్టపై 30 ఏళ్ల నుంచి ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఆక్రమణలను తొలగించాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక అధికారులు తహసీల్దార్‌కు నివేదిక పంపనున్నట్లు తెలిసింది. రెవెన్యూ, పోలీసు అధికారుల పర్యవేక్షనతో ఆక్రమణలు తొలగించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ మేరకు ఆయా శాఖల అధికారుల సహాయాన్ని కోరారు. ఇదిలా ఉండగా కోదాడ-జడ్చర్ల హైవే పనులు వేగంగా సాగుతుండడం, రహదారి మధ్య నుంచి 50 అడుగుల మేర రోడ్డు విస్తరణలో భాగంగా ఆక్రమణలు తొలగిస్తున్నారు. హైవే వెంట నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలో పనులు మొదలయ్యాయి. మురుగుకాల్వ నిర్మాణ పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న కొన్ని ఇళ్లను ఆక్రమణదారులే స్వచ్ఛందంగా తొలగిం చుకున్నారు. హైవేకు ఆనుకుని నిర్మిస్తున్న మురుగుకాల్వ నుంచి మరో ఆరు అడుగులకు పైగా నిర్మాణాలను తొలగించాల్సి ఉందని హైవే అధికారులు చెబుతున్నారు. హైవేకి ఆనుకొని ఇరువైపులా మునిసిపల్‌ డ్రైనేజీతో పాటు విద్యుత్‌ స్తంభాలు, తాగునీటి పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. 


ఎన్‌ఎస్పీ స్థలం స్వాధీనం 

నేరేడుచర్ల ఎన్‌ఎస్పీ కార్యాలయం స్థలాన్ని మున్సిపల్‌ అధికారులు శుక్రవారం స్వాధీన పరుచుకునేందుకు స్థలం హద్దులు ఏర్పాటు చేశారు. మొత్తం ఒక ఎకరా 12 గుంటల స్థలాన్ని తహసీల్దార్‌ సరిత ఆధ్వర్యంలో మున్సిపల్‌ అధికారులకు స్వాధీనపర్చారు. 1966లో దాతలు వల్లంశెట్ల రమేష్‌ సోదరులు ఈ భూమిని ఎన్‌ఎస్పీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వగా, అక్కడ సబ్‌డివిజన్‌ నిర్మించారు. అదే సమయంలో నిర్మించిన కార్యాలయ భవనాలు, అధికారులు, సిబ్బంది ఇళ్లు శిథిలావస్థకు చేరి, నిరుపయోగంగా మారాయి. ఆ స్థలంలో ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్‌ అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. వివరాలు సేకరించి స్థలం నిరుపయోగంగా ఉంటే మున్సిపాలిటీ స్వాధీనపర్చుకోవచ్చని ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం సర్వేయర్‌తో కొలిపించి హద్దులు నిర్ణయించారు. 12గుంటలలో కొంత భూమిని ఎన్‌ఎస్‌పీ కార్యాలయానికి ఉంచి, మిగతా స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించాలని తహసీల్దార్‌ సరిత ఎన్‌ఎస్పీ డీఈని ఆదేశించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఆస్థలాన్ని కేటాయిస్తామని డీఈ అమరేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జయబాబు, కమిషనర్‌ గోపయ్య, ఎన్‌ఎ్‌సపీ సిబ్బంది తదితరులున్నారు.  
Follow Us on:
Advertisement