లొంగు‘బాట’

ABN , First Publish Date - 2020-11-24T04:21:25+05:30 IST

చర్ల మండలానికి చెందిన 33మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు సోమవారం భద్రాద్రి ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సునిల్‌దత్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

లొంగు‘బాట’
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ సమక్షంలో లొంగిపోయిన 33 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు

33మంది మావోయిస్టు మిలీషియా సభ్యుల సరెండర్‌

వివరాలు వెల్లడించిచన భద్రాద్రి ఎస్పీ సునిల్‌దత్‌ 

అంతా చర్ల మండలానికి చెందినవారే 

కొత్తగూడెం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): చర్ల మండలానికి చెందిన 33మంది మావోయిస్టు  మిలీషియా సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు సోమవారం భద్రాద్రి ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సునిల్‌దత్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చర్ల మండలం బత్తినపల్లి, కిష్టారంపాడు గ్రామాలకు చెందిన మొత్తం 33మంది నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్టు ఎస్పీ తెలిపారు. వీరంతా గతంలో మావోయిస్టు దళానికి సహకరిస్తూ చర్ల ఏరియా కమిటీ సెక్రటరీ అరుణ వద్ద పని చేశారు. రెండేళ్లుగా వీరంతా మావోయిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నారు. వీరిలో కొందరు చర్ల మండలంలోని పెద్దమిడిసిలేరు రోడ్డు బ్లాస్టింగ్‌, కలివేరు మందుపాతర్లను అమర్చిన ఘటన, తిప్పాపురం వద్ద రోడ్డు రోలర్‌, జేసీబీలను తగలబెట్టిన సంఘటనలో వీరంతా పాల్గొన్నట్టు ఎస్పీ తెలిపారు. పోలీసుల నిరంతర కృషితో మెరుగైన జీవనం గడపాలని భావించి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకొని పోలీసుల సమక్షంలో లొంగిపోయినట్టు తెలిపారు. ఇంకా ఎవరైనా మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జన జీవన స్రవంతిలో కలవాలనుకునే వారు తమ ప్రాంతంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కుగానీ బంధు మిత్రుల ద్వారా గానీ, ఎస్పీ కార్యాలయానికిగానీ నేరుగా వచ్చి సంప్రదించవచ్చన్నారు. లొంగిపోయిన మావోయిస్టు, మిలీషియా, గ్రామ కమిటీ సభ్యులకు జీవనోపాధికి అవసరమైన చర్యలను ప్రభుత్వం ద్వారా అందేలా పోలీసుశాఖ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఓఎస్‌డీ వి.తిరుపతి, 141 బెటాలియన్‌ కమాండెంట్‌ హరి ఓం ఖేర్‌, సెకండ్‌ ఇన్‌ కమాండెంట్‌ సీఆర్‌పీఎఫ్‌ కేసీ. అహ్లావత్‌, చర్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.అశోక్‌, ఎస్‌ఐ రాజు వర్మ, ఎస్పీ కార్యాలయ సిబ్బంది రాజగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

లొంగిపోయిన సభ్యులు వీరే..

చర్ల మండలం బత్తినపల్లికి చెందిన తుర్రం అరిజయ్య, కల్లూరి రాజబాబు, తుర్రం బాబురావు, సున్నం రాజారావు, సాయిమల్ల బాలకృష్ణ, తుర్రం జంపు, సున్నం రాజాబాబు, కల్లూరి మురళీ, ఇరప అర్జున్‌, కొమరం వాసు, కరక సమ్మయ్య, కాంతి ఆంజనేయులు, సున్నం నరసింహారావు, కల్లూరి పవన్‌, ఇరప ప్రసాద్‌, గట్టుపల్లి రామారావు, కల్లూరి శ్రీను, మిడి యం రామారావు, తుర్రం సర్వేశ్వరరావు, కాంతి మురళీ, తుర్రం రాము, కారం వెంకటేష్‌, కొమరం రాజాబాబు, యాసం వీరయ్య, మిడియం వెంకటరావు, సోడి ఉంగయ్య, బాడిశ రమేష్‌, మడకం లక్ష్మయ్య, దెర్దో దేవ, మడకం ఐతయ్య, మడవి గంగయ్య, మడకం భద్రయ్య, మడకం సన్నయ్య లొంగిపోయిన వారిలో ఉన్నారు. 

Updated Date - 2020-11-24T04:21:25+05:30 IST