భక్తులకు వసతిపై నజర్‌

ABN , First Publish Date - 2022-06-20T06:30:46+05:30 IST

భక్తులకు వసతిపై నజర్‌

భక్తులకు వసతిపై నజర్‌
నిర్మాణం పూర్తి చేసుకున్న సీతానిలయం

రూ.3.60కోట్లతో జానకీ సదనం అంచనాలకు భద్రాద్రి దేవస్థానం ఆమోదం

దాతల సహకారంతో 30 గదుల నిర్మాణానికి నిర్ణయం

ఇటీవల పలు నూతన కాటేజీలు పూర్తి

మరో కాటేజీ ఏర్పాటుకు  ఏపీ మంత్రి సోదరుడి సంసిద్ధత

పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి వచ్చే వారికి మెరుగైన వసతులకు చర్యలు  

భద్రాచలం, జూన 19: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు వసతిని కల్పించడంపై దేవస్థానం దృష్టిసారించింది. భద్రాచలంలోని రామయ్యను దర్శించేందుకు రెండు తెలుగు రాషా్ట్రల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్న క్రమంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగా వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన ఉత్సవాలు నిర్వహించే సమయంలో భక్తుల సమస్యలు అంత ఇంత కాదు. రాబోయే 2023లో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహించనుండటంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో భక్తులకు వసతి కల్పించాలనే ఉద్దేశ్యంతో కాటేజీలు సత్రాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇందు కోసం అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది నాటికి చాలా వరకు వసతి సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం కాటేజీలు, సత్రాల నిర్మాణానికి దాతల దాతృత్వాన్ని సైతం దేవస్థానం ఆశిస్తోంది.  


రూ.3.60కోట్లతో జానకీ సదనం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రూ.3.60కోట్లతో జానకి సదనం నిర్మించనున్నారు. శ్రీరామసదనం-సౌమిత్రి సదనం మధ్య ఉన్న ఖాళీ స్థలంలో జానకిసదనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ 30గదులతో సదనం నిర్మించనుండగా ఇప్పటికే అధికారికంగా రూ.3.60కోట్ల అంచనాలకు ఆమోదం లభించింది. ఈ మొత్తాన్ని దాతల నుంచి సేకరించి నిర్మించాలని సంకల్పించారు. ఒక గది నిర్మాణానికి రూ.12లక్షల చొప్పున దాతల నుంచి సేకరించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 11మంది దాతలు నగదును దేవస్థానం వద్ద జమ చేశారు. ఇందుకు సంబంధించిన పనులకు  సెప్టెంబరులో శంకుస్థాపన జరగనున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఏపీలోని దేవాదాయ శాఖ మంత్రి సోదరుడు సైతం ఒక కాటేజీని నిర్మించేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఇటీవల కాలంలో అల్లూరి నిలయం, రామరాజు కాటేజీల నిర్మాణం జరిగింది. భాస్కర్‌ ప్యాలెస్‌ పేరిట ఒక కాటేజీ నిర్మాణం చేపట్టగా అది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే సీతానిలయం కాటేజీని సైతం నిర్వాహకులు అధునాతనంగా నిర్మిస్తున్నారు. భద్రాద్రి కరకట్ట కాంట్రాక్టర్‌ సైతం కాటేజీని నిర్మిస్తుండగా అది సైతం చివరి దశలో ఉంది.  


టీటీడీ వసతి సముదాయం అందుబాటులోకి వస్తే.. 

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రూ.4.70కోట్లతో భద్రాచలంలో నిర్మించిన టీటీడీ వసతిగదుల సముదా యం అందుబాటులోకి వస్తే సామాన్య, మధ్య తరగతి భక్తుల కష్టాలు చాలావరకు తీరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈవసతి భవనం లో 32ఏసీ గదులు, నాలుగు డార్మెట్రీలు, ఒక కల్యాణ మండపం ఉండటంతో కనీసం ఐదు వేల మందికి ఒకేసారి వసతి చూపేందుకు అవకాశముంది. ఈ భవన సముదాయ నిర్మాణానికి నాలుగున్నరేళ్లు పట్టగా సాంకేతికపరమైన సమస్యలతో గత రెండేళ్లుగా ఇది భక్తులకు అందుబాటులో రాలేని పరిస్థితి నెలకొంది. టీటీడీ అధికారులు ఇందుకు సంబంధించి చర్యలు చేపడితే కనీసం రాబోయే రెండు నెలల్లోనైనా ఈ నూతన భవన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.  


సత్రాలు, కాటేజీల నిర్వహణపై దృష్టిసారించాలి

దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వసతి సత్రాలు, కాటేజీలపై దేవస్థానం అధికారులు దృష్టిసారించాలని రామభక్తులు కోరుతున్నారు. చిన్న చిన్న సమస్యలను సైతం పరిష్కరించకపోవడంతో అవి ఉన్నా భక్తులకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా ఏసీల నిర్వహణ  కాటేజీల్లో సరిగా లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన ఏసీలను తీసేసి కొత్త ఏసీలను ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు తగ్గుతాయని దేవస్థానానికి ఆదాయం కూడా పెరుగుతుందని దేవస్థానం వర్గా లు పేర్కొంటున్నాయి. అలాగే పరుపులు, దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండ్లు నాణ్యతతో కూడినవి వాడటం వల్ల ఎక్కువ కాలం మన్నిక వస్తుందని దేవస్థానం వర్గాలే పేర్కొంటుండం గమనించదగ్గ విషయం. కొన్ని సందర్భాల్లో కాటేజీలు, సత్రాల్లో నిర్వహణ సరిగా లేక దుర్వాసన సైతం వస్తోందని భక్తులు పేర్కొంటున్నారు. దేవస్థానం కాటేజీలు మూడు నిర్వహణ సవ్యంగా లేకపోవడంతో మూలన పడి ఉన్నాయి.ఇకనైనా అధికారులు వసతి సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు ఆదాయం పెంచుకునేందు కు చర్యలు చేపట్టాలని భక్తులు సూచిస్తున్నారు. 



Updated Date - 2022-06-20T06:30:46+05:30 IST