ముందు యూరప్‌ సంగతి చూడండి!

ABN , First Publish Date - 2022-04-13T08:15:14+05:30 IST

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఆరోపించారు.

ముందు యూరప్‌ సంగతి చూడండి!

రష్యా నుంచి మేం నెలరోజుల్లో కొన్న 

చమురును ఆ దేశాలు ఒక్క పూటే కొంటున్నాయి

చమురుపై అమెరికా పాత్రికేయుల ప్రశ్నకు 

దీటుగా బదులిచ్చిన విదేశాంగ మంత్రి జైశంకర్‌

భారత్‌లో హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయి

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ ఆరోపణ


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 12: భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌  ఆరోపించారు. ముఖ్యంగా.. ప్రభుత్వ, పోలీసు, జైలు అధికారులు ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌.. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయడ్‌ ఆస్టిన్‌, ఆంటోనీ బ్లింకెన్‌ నడుమ సోమవారం జరిగిన 2+2 మంత్రులస్థాయి సమావేశం అనంతరం బ్లింకెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వీరి భేటీలో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావ సహా కొవిడ్‌ నుంచి పర్యావరణ మార్పు దాకా పలుఅంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు చర్చకు వచ్చాయి. అనంతరం నలుగురు మంత్రులూ కలిసి ఉమ్మడి పత్రికా సమావేశం నిర్వహించారు.


అక్కడే ఆంటోనీ బ్లింకెన్‌ భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావించారు. ఉల్లంఘనలు జరుగుతున్నట్టు చెప్పిన బ్లింకెన్‌.. దానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. బ్లింకెన్‌ తర్వాత మాట్లాడిన రాజ్‌నాథ్‌, జైశంకర్‌ ఈ అంశం గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇక, ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా విషయంలో భారత్‌ వైఖరిపై విలేకరులు వేసిన ప్రశ్నలకు జైశంకర్‌ విస్పష్టమైన సమాధానాలిచ్చారు. రష్యా విషయంలో భారత్‌ అనుసరించాల్సిన వైఖరిపై సలహాలిచ్చినందుకు అమెరికా పాత్రికేయులకు వ్యంగ్యంగా రెండుసార్లు కృతజ్ఞతలు తెలిపిన జైశంకర్‌.. ‘‘రష్యా నుంచి మేం కొనుగోలు చేస్తున్న చమురుకు సంబంధించిన గణాంకాలు చూస్తే.. ఒక నెలలో మేం చేసే మొత్తం కొనుగోళ్ల విలువ, యూరప్‌ దేశాలు ఒక మధ్యాహ్నం పూట రష్యా నుంచి కొనే చమురు కన్నా తక్కువ. కాబట్టి మీరు ముందు ఆ విషయంపై దృష్టి సారిస్తే మంచిది. రష్యా నుంచి మేం కొనే చమురు మా ఇంధన భద్రతకు ఎంతో అవసరం’’ అని సుతిమెత్తగా చురకలంటించారు. ‘‘ఘర్షణకు మేం వ్యతిరేకం. చర్చలకు, దౌత్యానికి, హింసకు అడ్డుకట్ట వేయడానికి మేం కట్టుబడి ఉంటాం. ఈ లక్ష్యాలను సాధించడానికి మా వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని జైశంకర్‌ తెలిపారు. పత్రికా సమావేశంలో నలుగురు మంత్రులు ప్రస్తావించిన ముఖ్యాంశాలు..


ఫ అమెరికా ఆంక్షలకు విరుద్ధంగా.. రష్యా నుంచి భారత్‌ ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసినప్పటికీ కాట్సా (కౌంటరింగ్‌ అమెరికాస్‌ యాడ్వర్సరీస్‌ త్రూ శాంక్షన్స్‌ యాక్ట్‌) కింద భారత్‌పై ఆంక్షలు విధించే, సడలించే విషయంపై ఇంకాఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని బ్లింకెన్‌ తెలిపారు. రష్యాతో భారత్‌ బంధం ఎన్నో ఏళ్ల క్రితమే ఏర్పడిందని.. ఆ సమయంలో ఇండియాతో అమెరికా భాగస్వామిగా ఉండలేకపోయిందని.. ఇప్పుడా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో సహాకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా ఇరు దేశాలు ‘స్పేస్‌ సిచ్యువేషనల్‌ అవేర్‌నెస్‌’ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. 


1-2 శాతమే.. ఉల్లంఘన కాదు..


రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేస్తున్న చమురు 1-2 శాతమే ఉంటోందని.. ఇది ఆంక్షల ఉల్లంఘన కాదని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ పేర్కొనడం గమనార్హం. ఉక్రెయిన్‌లోని బుచలో పౌరుల హత్యలను భారత్‌ ఖండించిందని.. మందులు, నిత్యావసర వస్తువులతో 90 టన్నుల మానవతా సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించిందని, 18 దేశాలకు చెందిన 150 మంది విదేశీయులను తరలించిందని ఆమె గుర్తుచేశారు. 

Updated Date - 2022-04-13T08:15:14+05:30 IST