దూసుకొస్తున్న యాస్‌

ABN , First Publish Date - 2021-05-26T05:36:53+05:30 IST

రోజంతా మబ్బులు.. అక్కడక్కడా చిరు జల్లులు... మంగళవారం జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. యాస్‌ ప్రచండ తుఫాన్‌ బుధవారం పశ్చిమ బెంగాల్‌-ఒడిశాల మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావం జిల్లాపై పడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు.

దూసుకొస్తున్న యాస్‌
కళింగపట్నం వద్ద అలల ఉధృతి


సముద్రం అల్లకల్లోలం

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు

రోజంతా మబ్బులు..అక్కడక్కడా చిరు జల్లులు

ఆందోళనలో మత్స్యకారులు, రైతులు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

రోజంతా మబ్బులు.. అక్కడక్కడా చిరు జల్లులు... మంగళవారం జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. యాస్‌ ప్రచండ తుఫాన్‌ బుధవారం పశ్చిమ బెంగాల్‌-ఒడిశాల మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావం జిల్లాపై పడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు. గతానుభవాల నేపథ్యంలో నాటి విపత్తులను తలచుకొని వణికిపోతున్నారు. ఇప్పటికే తితలీ విలయాన్ని గుర్తుచేసుకొని బికుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని 11 తీర మండలాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మత్స్యకార గ్రామాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతి పెరిగింది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు వచ్చింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తీరంలోని పడవలు, వలలు, వేట సామగ్రిని మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 


రైతుల్లో భయం..భయం

రబీలో భాగంగా సాగునీటి వనరులు అందుబాటులో ఉన్నచోట రైతులు వరి సాగుచేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చింది. కల్లాల్లో ధాన్యం నిల్వలు ఉన్నాయి. వేరుశెనగ, నువ్వులు, పెసర వంటి అపరాలను రైతులు సాగుచేస్తున్నారు. కూరగాయలు కూడా పండిస్తున్నారు. మరోవైపు జీడి, మామిడి సేకరణ సమయమిది. ఇటువంటి పరిస్థితుల్లో తుఫాన్‌ హెచ్చరికలతో రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. పంటల సంరక్షణకుగాను యుద్ధప్రాతిపదికన 27 వేల టార్పాలిన్లు, ఏడువేల సంచులను అందించారు. 



Updated Date - 2021-05-26T05:36:53+05:30 IST