అహంకారంతో ఆరంభం

Published: Fri, 29 Apr 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అహంకారంతో ఆరంభం

కురుక్షేత్ర యుద్ధ రంగంలో భగవంతుడయిన కృష్ణుడికీ, యోధుడైన అర్జునుడికీ మధ్య... 700 శ్లోకాల్లో జరిగిన సంభాషణ... భగవద్గీత. యుద్ధం మొదలయ్యే ముందు... ఆ యుద్ధంలో తన బంధువులు, మిత్రులు అనేకమంది మరణిస్తారనే చింత అర్జునుడిలో కలిగింది. అనేక విధాలుగా ఇది చెడ్డదని అతను వాదించాడు. అర్జునుడిలో ఈ సందిగ్ధావస్థ ‘చేసేవాడిని నేనే’ (అహంకర్త) అనే భావన నుంచి ఉద్భవించింది. దీన్నే ‘అహంకారం’ అని కూడా అంటారు. ఈ అహంకారం మనం ప్రత్యేకమైన వాళ్ళం అని మనకు చెబుతుంది, కానీ వాస్తవం భిన్నంగా ఉంటుంది. ‘ఇగో’ అనే మాట ‘అహంకారం’ అనే సాధారణ అర్థాన్ని ఇస్తుంది. కానీ అహంకారం తాలూకు అనేక రూపాల్లో ఇగోను ఒకటిగా పరిగణించవచ్చు. కృష్ణార్జునుల సంభాషణ మొత్తం ఈ అహంకారం గురించే... అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, దాన్ని తొలగించుకోవడానికి వివిధ మార్గాలనూ, మైలు రాళ్ళనూ కృష్ణుడు చూపించాడు.


కురుక్షేత్ర సంగ్రామాన్ని ఒక ఉపమానంగా  తీసుకున్నట్టయితే...  కుటుంబంలో కావచ్చు, పని చేసే చోట కావచ్చు, ఆరోగ్యం, సంపద, సంబంధాల్లాంటి విషయాల్లో కావచ్చు... మనమందరం నిత్య జీవితాల్లో అర్జునుడిలా ఇలాంటి సందర్భాల్లోకి అడుగుపెడతాం. ఒక వ్యక్తి జీవించినంతకాలం, అహంకారాన్ని అర్థం చేసుకున్నంత వరకూ ఇలాంటి సందిగ్ధావస్థలు సహజం.  భగవద్గీత ‘మనం ఏమిటి?’ అనే అంశానికి సంబంధించినది, మనకి తెలిసిన వాటి గురించో, మనం చేస్తున్న వాటి గురించో కచ్చితంగా కాదు. సైకిలు తొక్కడానికో, ఈత కొట్టడానికో మనకు థియరీతో ఎలాంటి నిమిత్తం లేదు. అలాగే మనం జీవితాన్ని ముఖాముఖి చూడనంతకాలం ఎలాంటి వేదాంతమూ సాయం చెయ్యలేదు, అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి భగవద్గీతలోని మార్గదర్శక సూత్రాలు మనకు సాయపడతాయి - ఆ గమ్యమే అంతరాత్మ, అది అహంకారరహితం. పైనుంచి చూసినప్పుడు... అర్జునుడికి కృష్ణభగవానుడు గీతను బోధించాక... కాలం చాలా మారిపోయినట్టు కనిపించవచ్చు. గత రెండు దశాబ్దాల్లో సైన్స్‌ బాగా అభివృద్ధి చెందడం వల్ల ఎన్నో మార్పులు కచ్చితంగా వచ్చాయి. కానీ, వాస్తవానికి, ‘పరిణామం’ అనే దృక్పథంతో చూసినప్పుడు, మానవులు ఏ మాత్రం పరిణామం చెందలేదు. సందిగ్ధావస్థ తాలూకు అంతర్గత పార్శ్వం అలాగే ఉంది. మన అవతారాలు (వృక్షాలు) చూడడానికి భిన్నంగా కనిపించవచ్చు, కానీ లోపలి భాగం (వేర్లు) అలాగే ఉంది.


అహంకారంతో ఆరంభం

జీవన వైరుధ్యాలు...

‘దారులన్నీ రోమ్‌కే చేరుతాయి’ అనే నానుడిలా... భగవద్గీత అందించే దారులన్నీ మనల్ని అంతరాత్మవైపు నడిపిస్తాయి. కొన్ని మార్గాలు పరస్పర విరుద్ధంగా కనిపించవచ్చు. అయితే, ఇది ఒక వృత్తంలాంటిది. ప్రయాణం ఎటువైపు మొదలుపెట్టినా... అదే గమ్యానికి మనల్ని చేరుస్తుంది. గీత వివిధ స్థాయిల్లో సాగుతుంది. కొన్నిసార్లు అర్జునుడి స్థాయికి కృష్ణుడు దిగి వచ్చాడు, మరికొన్నిసార్లు ఆయన పరమాత్మగా కనిపించాడు. ఈ రెండు స్థాయిలూ భిన్నంగా కనిపిస్తాయి కాబట్టి ప్రాథమిక దశలో అవగాహనకు ఇది ఇబ్బందులు సృష్టిస్తుంది. కిందటి శతాబ్దం ఆరంభంలో, కాంతిని అర్థం చేసుకొనేటప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. ప్రాథమికంగా, ‘కాంతి ఒక తరంగం’ అని రుజువైంది, తరువాత అది ఒక కణంలా కూడా వ్యవహరిస్తుందని గ్రహించారు. ఈ రెండు సిద్థాంతాలు ఒకదానికొకటి విరుద్ధంగా కనిపిస్తాయి. కానీ మనకు బాగా సుపరిచితమైన కాంతి... ఎన్నో వైరుధ్యాల సమ్మేళనం. జీవితం కూడా అంతే.


ఒక గ్రామంలోకి ఏనుగు వచ్చింది. కొందరు అంధులు దాన్ని గుర్తించడానికో లేదా అర్థం చేసుకోడానికో ప్రయత్నించారు. వాళ్ళు ముట్టుకున్న భాగాన్ని బట్టి... ఏనుగు ఎలా ఉండొచ్చనేది ఊహించుకున్నారు. తొండాన్ని ముట్టుకున్న వ్యక్తి ‘‘ఏనుగు పొడవుగా, గరుకుగా ఉండే జీవి’’ అని చెప్పాడు. మరో వ్యక్తి దాని దంతాన్ని ముట్టుకున్నాడు... ‘అది రాయిలా గట్టిగా ఉండే జంతువు’ అని అన్నాడు. మరో వ్యక్తి దాని పొట్టను పట్టుకున్నాడు... అది పెద్దదనీ, మెత్తగా ఉంటుందనీ చెప్పాడు. వారి ఊహాగానాలు ఈ విధంగా కొనసాగాయి.


ఈ రోజు ప్రపంచంలో మనం చూస్తున్న అన్ని వ్యత్యాసాలకూ కారణం... ఒకే సత్యం విషయంలో భిన్నమైన అవగాహనలే. ఏనుగు అనేది ఆ కథలో చెప్పినవాటిలో ఏదీ కాదు, కానీ అది అవి అన్నీ కూడా. మనుషులు, విషయాలు, సంబంధాలు ఆ ఏనుగులాంటి చిక్కుముడిలా ఉంటాయి కాబట్టి ఈ వ్యక్తులకూ, మనకూ మానసిక స్థితిలో తేడా లేదు. పాక్షికమైన అవగాహన మనల్ని దుఃఖం వైపు నడిపిస్తుంది. భగవద్గీత ఆవశ్యకంగా ఒక పాక్షికమైన అవగాహన నుంచి పరిపూర్ణత వరకూ తీసుకువెళ్ళే ప్రయాణం. 80-20 సూత్రంలా, ఈ అవగాహనలో కనీసం కొన్ని అడుగులు వెయ్యగలిగినా అది జీవితంలోకి సంతోషాన్ని తీసుకువస్తుంది.

అహంకారంతో ఆరంభం

- కె.శివప్రసాద్‌, ఐఎఎస్‌


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.