కాపాడిన రాముడు.. మా ఊరి దేవుడు!

Nov 28 2021 @ 02:36AM

ప్రాణదాతగా మారిన రిటైర్డ్‌ లష్కర్‌ రామయ్య

అన్నమయ్య ప్రాజెక్టుతో 30 ఏళ్ల అనుబంధం

విలయం సృష్టించిన రాత్రి కట్టపైనే కాపలా

ప్రమాదం పొంచి ఉందని పసిగట్టి...

రెండు గ్రామాలవాసులకు ఫోన్లు

గుట్టపైకి వెళ్లాలంటూ హెచ్చరికలు

గుట్టపైకి వెళ్లడంతో వందలమంది సురక్షితం

కళ్లముందే కొట్టుకుపోయిన మట్టికట్ట

అరగంటలోనే వరదలో సర్వ నాశనం

‘ఆంధ్రజ్యోతి’తో రామయ్య 


‘‘తెల్లవారుజామున 4 గంటలు దాటింది. చెయ్యేరు వరద అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్టపైకి చేరింది. మొదట అన్నమయ్య విగ్రహం ఉన్న కొండవైపు మట్టికట్టపై నుంచి వరద పొంగింది. అక్కడ... కట్ట కొంచెం కొంచెం కోతకు గురౌతోంది. కట్ట ఎక్కువసేపు నిలవదని... ఇంకా స్పష్టంగా అర్థమైంది. 4.30 గంటలకు మా మేనల్లుడికి మరోసారి ఫోన్‌ చేశాను. కట్ట ఎప్పుడైనా తెగవచ్చునని చెప్పాను. క్షణం ఆలస్యం చేయకుండా గుట్టపైకి వెళ్లమన్నా!’’ - రామయ్య


కన్నీళ్లు ఆపుకోలేకపోయా!

వరద బీభత్సం జరిగిన రెండు రోజుల తర్వాత మా సొంతూరు తోగూరుపేటకు వచ్చాను. మా ఊరి జనం నన్ను పట్టుకుని, ‘నీ వల్లే మేము బతికాం. అర్ధరాత్రి నువ్వు ఫోన్‌ చేయకపోతే ఊరంతా వల్లకాడు అయ్యేది. మేమంతా బతికి ఉన్నామంటే అది నీపుణ్యమే’ అని కన్నీళ్లు పెట్టారు. ఉద్వేగంతో నాకూ కన్నీళ్లు ఆగలేదు. నేను వీళ్లకు చేసిన సాయం చిన్నదే. ఫోన్‌ చేసి అక్కడి పరిస్థితి చెప్పడమే! ఈ చిన్న సహాయానికే జనం నన్ను దేవున్ని చేసేస్తున్నారు. ఈ జన్మకు ఇది చాలు.


నాకు జరిగిన నష్టం...

ఆనకట్ట తెగిపోవడంతో మాకు ప్రాజెక్టు దిగువన ఒక ఇల్లు, ఊర్లో ఉన్న మరో ఇల్లు కొట్టుకుపోయాయి. రెండెకరాల పొలం ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. మాకు 120 ఆవులు ఉంటే... 60 కొట్టుకుపోయాయి. 140కి పైగా కోళ్లు కూడా పోయాయి. ఇది మేం ఎప్పుడూ ఊహించని నష్టం’’

- రామయ్య


ఆ ప్రాజెక్టుతో ఆయనది మూడు దశాబ్దాల అనుబంధం! ఆ మట్టికట్టపై ఆయన వేసిన అడుగులు వేలూ, లక్షలు! భారీ వరదకు... ఆ మట్టికట్ట... కంపిస్తోంది. కుంగుతోంది. మరోవైపు వరద అంతకంతకు పెరుగుతూనే ఉంది. ‘కట్టను కాపాడే పరిస్థితి లేదు. కిందనున్న గ్రామాల ప్రజలను కాపాడాలి’... ఆయన మనసులో ఇదే తపన! వెంటనే... ఫోన్‌ పట్టుకున్నారు. మూడు గ్రామాల పరిధిలో తనకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్‌ చేస్తూనే ఉన్నారు. కొందరి ఫోన్లు కనెక్ట్‌ కాలేదు. కొందరు ఫోన్‌ ఎత్తలేదు. అవతలి వాళ్లు... ‘హలో’ అనగానే, ‘మట్టికట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. పిల్లా పాపలతో కలిసి గుట్టపైకి ఎక్కండి’ అని చెబుతూనే ఉన్నారు. అలాపదులకొద్దీ ప్రాణాలు కాపాడారు. ఆయనే... వర్నా రామయ్య! కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు రిటైర్డ్‌ లష్కర్‌! ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు వద్ద ఏం జరిగింది? రామయ్య చెప్పిన ప్రత్యక్ష కథనం


అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయే ముందు ఏం జరిగింది? ఈ భారీ ఉపద్రవం నుంచి వంద లాది మంది ప్రజలను ఒక మాజీ లష్కర్‌ ఎలా అప్ర మత్తం చేశారు? ఆ ప్రాజెక్టులో మొన్నటి వరకూ లష్క ర్‌గా పని చేసిన రామయ్య చెప్పిన విషయాలు ఆయ న మాటల్లోనే.... 

‘‘మాది కడప జిల్లా రాజంపేట మం డలం తోగూరుపేట. చెయ్యేరు నదీ తీరంలో రెండు ఎకరాల పొలం ఉంది. పచ్చనిపంటలు, పాడిపోషణతో ఆనందంగా సాగే జీవితం. అన్నమయ్య ప్రాజెక్టు కింద మా పొలం పోయింది. పునరావాసంలో భాగంగా నిర్వాసితుడైన నాకు ప్రాజెక్టులో 1990లో వాచ్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. ఆరేళ్లకు లస్కర్‌గా ప్రమోషన్‌ వచ్చింది. ఈ ఏడాది జూన్‌లోనే రిటైర్‌ అయ్యాను. నా సర్వీసులో పాతికేళ్లకు పైగా అన్నమయ్య ప్రాజెక్టులోనే పనిచేశాను. ఆ ప్రాజెక్టే నా ఇల్లుగా మారింది. ఆనకట్ట దిగువన ఉన్న 700 మీటర్ల దూరంలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నాం. నిత్యం నా మనసు, నా కళ్లు అన్నమయ్య ప్రాజెక్టుపైనే ఉంటాయి. 


కట్ట కదిలిన క్షణం...

18వ తేదీ... గురువారం ఉదయం చెయ్యేరు వరద క్రమక్రమంగా పెరుగుతోంది. 200 మీటర్లకు వరద చేరింది. డ్యామ్‌ ఈఈ రవికిరణ్‌, ఈఈ రాజశేఖర్‌రెడ్డి, ఏఈలు అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ గేట్లు ఎత్తుతున్నారు. రాత్రి 8.30 గంటల వరకు పెద్దగా ప్రమాదం అన్పించలేదు. ఆ సమయంలో ఆనకట్ట దిగువన ఇంట్లోనే ఉన్నా. ఎగువ వరద క్రమక్రమంగా పెరుగుతోంది. రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో గేట్లన్నీ ఎత్తారు. డ్యాంలో నీటిమట్టం కొద్దిగా తగ్గింది. ప్రమాదం ఉండదేమో అనుకున్నాం. అర్ధరాత్రి సమయంలో ఎగువ నుంచి వరద ఉప్పెనలా రావడం మొదలైంది. అప్పుడు మొదటిసారిగా నాకు అనిపించింది... ‘ఈ వరదకు డ్యామ్‌ తట్టుకుంటుందా’ అనే సందేహం! డ్యామ్‌ దిగువన ఉన్న నేను, భార్యా పిల్లలందరం ఆనకట్ట పైకి చేరుకున్నాం. 30 ఏళ్ల అనుభవంలో ఆనకట్టకు ఇంతటి వరదను చూడలేదు. ఎక్కడో భయం వేస్తోంది. ఏమైనా జరిగితే.. మా సొంతూరు తోగూరుపేటతోపాటు రామచంద్రాపురం, శాలిపేట  తుడిచిపెట్టుకుపోతాయి. పంటలు, ఆస్తులు సరే... మరి ప్రాణాల మాటేమిటి? అప్పటికి అర్ధరాత్రి దాటింది. సెల్‌ఫోన్‌ తీసుకున్నాను! తోగూరుపేటలో తెలిసిన వారందరికీ ఫోన్‌ చేయడం మొదలుపెట్టారు. గట్టా రామయ్యకు ఫోన్‌ ఎత్తగానే... ‘ఏ క్షణమైనా డ్యామ్‌ మట్టికట్ట తెగే ప్రమాదం ఉంది. అందరినీ గుట్టపైకి తీసుకెళ్లు’ అని హెచ్చరించాను. గట్టా రామయ్య నా మాటపైన నమ్మకంతో తోగూరుపేట, రామచంద్రాపురం, శాలిపేటకు చెందిన మరికొందరిని అప్రమత్తం చేశారు. గుట్టపై ఉన్న దాసలమ్మ గుడి వద్దకు తీసుకెళ్లారు. మా ఊరికి ఎదురుగా నది అవతల ఉన్న పులపుత్తూరులో ఆరుగురికి ఫోన్‌ చేశాను. ఏ ఫోన్‌ తగలలేదు. ఓ వైపు క్షణక్షణానికీ వరద పెరుగుతోంది. నా గుండె దడ కూడా పెరుగుతోంది. ప్రయత్నించగా ప్రయత్నించగా... పులపుత్తూరు సర్పంచి జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ తగిలింది. పరిస్థితి ఆయనకు వివరించాను.  అప్పటికి సమయం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలు దాటింది. చెయ్యేరు వరద ఆనకట్టపైకి చేరింది. మొదట అన్నమయ్య విగ్రహం ఉన్న కొండవైపు మట్టికట్టను దాటింది. అక్కడ... కట్ట కొంచెం కొంచెం కోతకు గురౌతోంది. కట్ట ఎక్కువసేపు నిలవదని... ఇంకా స్పష్టంగా అర్థమైంది. 4.30 గంటలకు తోగూరుపేటలోని మా అక్క కొడుకు మణికి ఫోన్‌ చేశాను. ఆనకట్టపై నీరు పారుతోందని...  కట్ట ఎప్పుడైనా తెగవచ్చునని... క్షణం ఆలస్యం చేయకుండా గుట్టపైకి వెళ్లమని చెప్పాను. ‘‘ఊరి జనమంతా దాసాలమ్మ గుడిపైన ఉన్నాం మామా’’ అని మణి చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నా. శుక్రవారం ఉదయం 5.30 గంటలు... ‘జరగకూడదు’ అనుకున్న ఘోరం జరిగిపోయింది. అన్నమయ్య ప్రాజె క్టు కట్ట మొత్తం ఒక్కసారిగా... కళ్లముందే కొట్టుకుపోయింది. 30 ఏళ్ల అనుబంధం ఉన్న ప్రాజెక్టు అలా కొట్టుకుపోవడంతో కన్నీళ్లు ఆగలేదు. కట్టలు తెంచుకున్న తర్వాత కేవలం అరగంటలోనే... చెయ్యేరు వరద తోగూరుపేట, పులపుత్తూరు, మందపల్లితోపాటు పలు గ్రామాలను ముంచేసింది. పంట, పొలం, ఇల్లూ వాకిలి, గొడ్డూగోదను తనలు కలుపుకొని తీసుకెళ్లింది!


రామయ్య మామ ఫోన్‌ చేయకుంటే...

నేను అన్నమయ్య ప్రాజెక్టులోనే 20 ఏళ్లుగా మ్యాన్‌మజ్దూర్‌గా పనిచేశాను. శుక్రవారం మేమంతా ఇంట్లోనే ఉన్నాం. ఆ రోజు డ్యామ్‌ తెగిపోయే ప్రమాదం ఉందని రామయ్య మామ మాకు ఫోన్‌ చేశాడు. ముందు నెట్‌ వర్క్‌ ప్రాబ్లం వల్ల ఫోన్‌ తగల్లేదు. దీంతో తిరుపతిలో ఉన్న నా భార్య అనుసూయదేవికి ఫోన్‌ చేశాడు. ఆమె తెల్లవారుజామున 3 గంటలకు నాకు ఫోన్‌ చేసింది. అప్పటికే రామయ్య మామ ఇచ్చిన సమాచారం తెలుసుకుని అప్రమత్తం చేశాం. 4 గంటలకు రామయ్య మామ నాకు మళ్లీ ఫోన్‌చేసేటప్పటికే మేమంతా గుట్టమీదున్న దాసాలమ్మ గుడికి చేరుకున్నాం. రామయ్య మామ ఫోన్‌ చేయకపోయి ఉంటే, ఊరంతా వల్లకాడు అయి ఉండేదేమో

- గుణిశెట్టి మణి, తోగూరుపేట


మూడూళ్లు తిరిగి ఇంటింటికి చెప్పా

చెయ్యేరు నది వరదతో ఉప్పొంగుతోంది. రాత్రి పింఛా ప్రాజెక్టు తెగిపోయిందని తెలిసింది. తిరుపతిలో భారీ వర్షాలు పడుతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టుకూ ముప్పు ఉందనే అనుమానంతో తోగూరుపేట, రామచంద్రాపురం, శాలిపేట గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి గుట్టపైకి చేరాలని చెప్పేసి వచ్చాను. అర్ధరాత్రి ఇంటికి చేరుకుని ఓ పుస్తకం చదువుతున్నా. అదే సమయంలో కట్ట తెగిపోవచ్చని రామయ్య ఫోన్‌ చేశాడని పక్కింటి వాళ్లు తలుపు తట్టారు. అందరం దాసలమ్మ గుడివైపు పరుగులు పెట్టాం. 75 ఇళ్ల జనం అక్కడే ఉన్నా.. పెనుమాడి పెంచలయ్య అనే వృద్ధుడు కన్పించలేదు. పరుగు పరుగున వెళ్లి ఆయనను కూడా తీసుకుని వచ్చాం.

- జొన్నా శివరామయ్య తోగూరుపేట
Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.