శాశ్వత ఆనందం ఎలా వస్తుంది?

ABN , First Publish Date - 2020-11-24T09:31:58+05:30 IST

భగవాన్‌ రమణ మహర్షి లోకానికి అందించిన 30 శ్లోకాల ఆత్మజ్ఞానామృత గ్రంథం.. ‘ఉపదేశ సారం’లోని 28వ శ్లోకమిది.

శాశ్వత ఆనందం ఎలా వస్తుంది?

కిం స్వరూప మిత్యాత్మ దర్శనే

అవ్యయా భవా పూర్ణ చిత్సుఖం


భగవాన్‌ రమణ మహర్షి లోకానికి అందించిన 30 శ్లోకాల ఆత్మజ్ఞానామృత గ్రంథం.. ‘ఉపదేశ సారం’లోని 28వ శ్లోకమిది. పరమపూర్ణ చిదానందాన్ని పొందడానికి, ఆత్మానుభూతికి రమణులు ఈ గ్రంథంలో అందించిన అంతిమ ఉపదేశమిది. ‘నా నిజ స్వరూపం ఏమిటి? అని విచారణ చేసినప్పుడు ఆత్మానుభూతి కలిగి.. తరిగిపోని, పుట్టుకలేని, నిండైన ఆనందం అనుభవంలో ఉంటుంది. తాను అనంత, అఖండ, చిదానంద స్వరూపుడిగానే ఉండిపోతాడు’ అని దీని అర్థం. ఈ లోకంలో ప్రతి ఒక్కరూసుఖాన్ని, ఆనందాన్ని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో విషయ వస్తువుల వెంట, భోగాల వెంట పిచ్చిగా పరుగులు పెడుతూ.. వాటిని అందుకుంటూ.. అనుభవిస్తూ.. ఆనందిస్తారు. తర్వాత మళ్లీ మరొక వస్తువు కోసం, భోగం కోసం పరుగులు తీస్తారు. అందితే ఆనందం. అందకపోతే దుఃఖం. అందితే అంతటితో ఊరుకోవడం ఉండదు. మరొకదాని కోసం పరుగు మొదలవుతుంది. ఇలా ఎప్పుడూ పరుగులు తీస్తూ శాశ్వత సుఖాన్ని పొందలేక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. మరి ఆనందం.. శాశ్వత ఆనందం ఎలా వస్తుంది? అది బయట వస్తువుల్లో ఉందా? లేక లోపల నీలోనే ఉందా? ఆనందం బయటి వస్తువుల్లో లేదని తేలిపోయింది. కనుక ‘నా’లోనే ఉందేమో అని ప్రతి ఒక్కరూ పరిశీలన చేయాలి.


అంటే ‘నా’ యథార్థ స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి వస్తువులకూ ఒక సహజ స్వభావం ఉంటుంది. ఆ వస్తువు దాని స్వభావాన్ని విడిచి ఉండదు. అగ్ని స్వభావం వేడి. అగ్ని వేడిని విడిచి ఉండదు. మంచు స్వభావం చల్లదనం. మంచుముక్క చల్లదనాన్ని విడిచి ఉండదు. ఈ విధంగా ఆలోచిస్తే మన సహజ స్వభావం ఏమిటి? ఆనందమా? దుఃఖమా? మన సహజ స్వభావం దుఃఖం అనుకుందాం. అదే నిజమైతే మనం దుఃఖాన్ని విడిచి ఉండలేం. ఎప్పుడూ దుఃఖం ఉండాలనుకుంటాం. కానీ.. దుఃఖం కలిగితే దాన్ని పోగొట్టుకునేందుకు మనం ఎందుకు ప్రయత్నిస్తున్నాం? ఎందుకంటే.. ఆనందం మన సహజ స్వభావం. అందుకే దుఃఖం వస్తే బయటకు పంపేయాలనుకుంటాం. ఎప్పుడూ సుఖంగా ఉండాలనుకుంటాం. ఆనందం కలిగినప్పుడు దాన్ని పారద్రోలాలని చూడం సరికదా.. ఎప్పటికీ అలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ఆనందంగా లేకపోతే.. ‘ఎలా ఆనందాన్ని, సుఖాన్ని పొందాలా?’ అని ఆలోచిస్తాం. కనుక మనం ఆనందస్వరూపులమే. కానీ, అజ్ఞానం వల్ల ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మన నిజస్వరూపంలో మనం ఉండలేకపోతున్నాం.




‘నేను దేహాన్ని’ అనుకోవడం వల్ల.. ‘నేను ఆత్మను’ అని గ్రహించకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ. ‘నేను దేహాన్ని.. దుఃఖంలో ఉన్నాను’ అనుకొని ఆనందం కోసం ఏవేవో విషయాలతో సంపర్కం పెట్టుకుంటున్నాం. రాత్రింబవళ్లూ ఇలా సంబంధం పెట్టుకున్నా కోరుకున్న ఆనందం మాత్రం లభ్యం కావట్లేదు. మరేం చేయాలి? అంటే.. మన యథార్థ స్వరూపం ఆత్మయేనని గుర్తెరగాలి. ఆత్మ ఆనంద స్వరూపం కనుక మనం ఎల్లప్పుడూ ఆనందంలో ఉన్నట్టే. కనుకనే ఈ దిశగా విచారణ సాగాలని రమణులు చెప్పారు. అందుకు సద్గురువు మార్గదర్శనం, నిరంతర శాస్త్ర శ్రవణం, విచారం అవసరం.

- దేవిశెట్టి చలపతిరావు, care@srichalapathirao.com

Updated Date - 2020-11-24T09:31:58+05:30 IST