గ్రావెల్‌ లారీలు సీజ్‌

ABN , First Publish Date - 2022-05-17T05:30:00+05:30 IST

ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ తరలిస్తున్న 7 లారీలను విజిలెన్స్‌, మైనింగ్‌ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు.

గ్రావెల్‌ లారీలు సీజ్‌
విజిలెన్స్‌ అఽధికారులు స్వాధీనం చేసుకున్న గ్రావెల్‌ లారీలు

పొన్నూరు టౌన్‌, మే 17: ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ తరలిస్తున్న 7 లారీలను విజిలెన్స్‌, మైనింగ్‌ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. మండలంలో పలు గ్రామాలలో అక్రమ క్వారీయింగ్‌ జరుగుతుందని సోమవారం అధికార పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు, మరో నాయకుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలే అక్రమ క్వారీయింగ్‌పై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. గత కొద్ది కాలంగా మండలంలోని శేకూరు, వడ్లమూడి, వేజెండ్ల, శుద్దపల్లి, వీరనాయకునిపాలెం గ్రామాల్లో విలువైన ఎర్రమట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలించి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మాజీ శాసనసభ్యుడు, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ప్రభుత్వానికి, పలు దర్యాప్తు సంస్థలకు వరుస ఫిర్యాదులు అందించారు. అయినప్పటికీ చలనం లేకపోవడంతో శుద్దపల్లి క్వారీలో ధర్నాకు దిగడంతో అధికారులు స్పందించి ఆ క్వారీని మూసి వేయించారు. తరువాత మళ్లీ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. వీరనాయకునిపాలెంలో దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములలో సైతం నిబంధనలను తుంగలోకి తొక్కి క్వారీయింగ్‌కు పాల్పడుతున్నారు. ఎస్సీ కమీషన్‌కు ఫిర్యాదులతో కొద్ది రోజులు ఆగిన క్వారీయింగ్‌ తిరిగి ప్రారంభమైంది. తాజాగా సోమవారం అధికార వైసీపీ నాయకులే ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ అగ్రికల్చర్‌ విభాగం అధికారి కొండారెడ్డి, మైనింగ్‌ ఆర్‌ఐ శివపార్వతి క్వారీల తనిఖీకి వచ్చారు. అయితే ఈ సమాచారం ముందుగానే అందుకున్న నిర్వాహకులు తవ్వకాలను నిలిపివేసి ఆ ప్రాంతం నుంచి జారుకున్నట్లు సమాచారం. ఎటువంటి అనుమతులు బిల్లులు లేకుండా రవాణా అవుతున్న 7 గ్రావెల్‌ టిప్పర్‌లను గుర్తించిన అధికారులు వాటిని సీజ్‌ చేసి చేబ్రోలు పోలీసులకు అప్పగించారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-05-17T05:30:00+05:30 IST