ఆతిఽథ్య రంగం ఢమాల్‌

May 8 2021 @ 23:13PM

మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లు

 కరోనా కర్ఫ్యూతో మరింత నష్టాల ఊబిలోకి

ఏడాదిగా అదే బాటలో హోటల్‌ పరిశ్రమ 

నెల్లూరు(సాంస్కృతికం), మే 8 : నెల్లూరు హోటళ్లు, రెస్టారెంట్ల ఆతిథ్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. నెల్లూరు భోజన రుచులను స్వదేశీయులతోపాటు విదేశీయులూ ఆస్వాదిస్తారు. . అలాంటి హోటల్‌ పరిశ్రమ గతేడాది కరోనా లాక్‌డౌన్‌తో కుదేల్‌ అయింది. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 25 ఏళ్లు వెనక్కి పోయింది. కర్ఫ్యూతో నేడు జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు అతిథులు లేక వెలవెలబోతున్నాయి. ఎక్కువ భాగం మూతపడ్డాయి. జిల్లాలో హోటల్‌ వ్యాపారం 20శాతానికి, ఆన్‌లైన్‌ ఫుడ్‌ వ్యాపారం 10శాతానికి పడిపోయింది.

మరింత పడిపోయిన వ్యాపారం

సాధారణ సదుపాయాలతో రెస్టారెంట్‌, హోటల్‌ నిర్వహించాలంటే కనీసం రూ.15 లక్షల నుంచి రూ. 50లక్షల పెట్టుబడి అవసరం. వ్యాపారం జరిగినా జరగకపోయినా అద్దె, విద్యుత్‌ చార్జీలు, సిబ్బంది జీతాలకు నెలకి రూ. 50 వేల నుంచి రూ.2లక్షల దాక భరించాల్సిందే. కర్ఫ్యూతో ప్రస్తుతం వ్యాపారం బాగా పడిపోయింది. గతేడాది లాక్‌డౌన్‌తో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. అన్‌లాక్‌తో వాటిలో 30 శాతమే తెరుచుకున్నాయి. అవి కూడా అంతంత మాత్రమే నడిచాయి. ప్రస్తుతం కర్ఫ్యూతో వాటిలోనూ ఎక్కువ భాగం మూతపడ్డాయి. కరోనాకు ముందు లాడ్జీలలో గదుల వినియోగం 60 శాతం నుంచి 80 శాతం వరకు ఉండేది. తర్వాత కార్పొరేట్‌ హోటళ్లు మినహా మిగిలిన వాటి, రెస్టారెంట్ల ఆదాయం 10శాతం కన్నా తక్కువగా ఉంది. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు జిల్లాలో హోటల్‌ పరిశ్రమ ద్వారా నెలకు రూ.70కోట్ల నుంచి 100 కోట్ల వ్యాపారం జరిగేది.  ఆ తర్వాత అది రూ. 20 కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం మరింత దిగజారింది. 

అడ్వాన్సులు వెనక్కి..

జిల్లాలో హోటళ్లు, మెస్‌లు దాదాపు 2వేలకుపైగా, రెస్టారెంట్లు 150, రోడ్డు మార్జిన్‌ హోటళ్లు, తోపుడు బండ్లు దాదాపు 4వేలకుపైగా ఉండేవి.  వాటికి వివాహాలు, ఇతర శుభకార్యాలు, సదస్సులు, సెమినార్లు తదితర కార్యాయాలకు బల్క్‌ బుకింగ్‌ల ద్వారా ఫుడ్‌ ఆఫర్లు బాగా ఉండేవి. కరోనాతో ఆ వాటి సంఖ్య 20 శాతానికి పడిపోయింది.  కర్ఫ్యూతో అడ్వాన్స్‌ బుకింగ్‌లను రద్దు చేసుకోవడంతో యజమానులు తీవ్ర నష్టాల్ని ఎదుర్కొంటున్నారు.  ఫుడ్‌ కోర్టులు, ఆన్‌లైన్‌ బుకింగ్‌లకు ఆర్డర్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 15 పెద్ద రెస్టారెంట్లతోపాటు వందలాది చిన్నహోటళ్లు మూతపడ్డాయి.  ఇప్పుడు కర్ఫ్యూ వల్ల ఉన్నవాటిలో దాదాపు 70శాతం మూత పడిపోయాయి. హోటల్‌ పరిశ్రమలో పనిచేసే సుమారు 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోవడంతో వారిపై ఆధారపడ్డ 60వేల మంది  అర్థాకలితో బతుకుతున్నారు. 

ప్రభుత్వ ఖజానాకు గండి

జిల్లాలో హోటల్స్‌ పరిశ్రమ ద్వారా వివిధ రకాల పన్నుల రూపంలో నెలకు దాదాపు రూ. 5 లక్షల నుంచి 8లక్షలు ప్రభుత్వ ఖజానాకు చేరేది. అలాంటి రాబడి 20శాతానికి పడిపోయింది. 

గాలి ప్రచారంతో మరింత నష్టం..

కరోనా సెకండ్‌ వేవ్‌ గాలి ద్వారా వ్యాప్తిస్తుందనే ప్రచారం హోటల్‌ పరిశ్రమపై తీవ్రప్రభావాన్ని చూపిస్తోంది. గతంలో రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్‌ పార్లర్లకు కుటుంబాలతో కలిసి వచ్చి దాదాపు 30 నుంచి 60నిమిషాల కాలక్షేపం చేసేవారు. ప్రస్తుతం ఒకరిద్దరు కూడా రావటం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. 

ప్రభుత్వమే ఆదుకోవాలి

గతేడాది లాక్‌డౌన్‌తో కుప్పకూలిన హోటల్‌ పరిశ్రమ కోలుకుంటున్న తరుణంలో కరోనా సెకండ్‌ వే వ్‌ మరింతగా దెబ్బతీసింది. తాజాగా విధించిన కర్ఫ్యూతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. హోటల్‌పరిశ్రమను ప్రభత్వమే ఆదుకోవాలి. హోటల్‌ పరిశ్రమలకు జీఎస్‌టీ రద్దు చేయాలి. విద్యుత్‌, గ్యాస్‌ సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. పావలా వడ్డీకి రుణాలు అందించాలి. ప్రస్తుతం ఉన్న రుణాలకు వడ్డీలు రద్దు చేసి వాయిదాల గడువును పొడిగించాలి.

అమరావతి కృష్ణారెడ్డి,  ఏపీ హోటల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు 
Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.